Abn logo
Oct 22 2021 @ 00:08AM

పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి


వారు లేని సమాజాన్ని ఊహించలేం

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం : అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌

అవిశ్రాంత పనివీరులు పోలీసులు : సీపీ జోయల్‌ డేవిస్‌ 


సిద్దిపేట క్రైం, అక్టోబరు 21 : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ అన్నారు. గురువారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ మైదానంలో పోలీస్‌ అమరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్‌ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయనతోపాటు సీపీ జోయల్‌ డేవిస్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ అమరుల పోలీస్‌ కుటుంబసభ్యులతో పాటు అధికారులు, సిబ్బంది పోలీస్‌ అమరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ డేవిడ్‌ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్‌, గౌరవ వందనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ మాట్లాడుతూ పోలీసులు ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి శాంతిభద్రతలు చాలా ముఖ్యమని, ఈ విషయంలో 24 గంటలు విధులు నిర్వహిస్తూ అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణలో అనుక్షణం నిమగ్నమై పని చేస్తున్న పోలీసులను ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, వారు క్రమశిక్షణతో ప్రజాస్వామ్య విలువలు కాపాడడంలో ఎనలేని కృషి చేస్తున్నారని తెలియజేశారు. సిద్దిపేట జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తరఫున ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. 


అమరుల జీవితాలే మార్గదర్శనం : సీపీ

పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ఏటా అక్టోబరు 21న పోలీసు అమరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామని తెలియజేశారు. అమరులైన పోలీసుల జీవితాలనే మనం మార్గదర్శకంగా తీసుకుని ప్రజాసేవకు పునరంకితం కావడమే పోలీసు అమరవీరుల ఫ్లాగ్‌ డే దినోత్సవం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాగ ఎంతో ప్రమాదకరంగా మారిందన్నారు. త్యాగాలకు భయపడకుండా రెట్టించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని సాధించాలన్నారు. పోలీసులు త్యాగం చేయని రోజు అంటూ ఉండదని చెప్పారు. సెలవులు, పండుగ దినాలు, అధిక గంటలు ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అవిశ్రాంతంగా పని చేస్తున్న వీరులు పోలీసులని చెప్పారు. ఇంత చేస్తున్నా పోలీసుల త్యాగాలు ఆశించిన స్థాయిలో గుర్తింపునకు నోచుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలో మన దేశంలో విధినిర్వహణలో 377 మంది వీరమరణం పొందారని, వారందరికీ మనమందరం శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు.  సిద్దిపేట జిల్లా పరిధిలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన ఎనిమిది మంది త్యాగమూర్తులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ అమరుల కుటుంబసభ్యులకు కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు శ్రీనివాసులు, మహేందర్‌, రామేశ్వర్‌, నారాయణ, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, ఎస్బీ ఏసీపీ రవీందర్‌రాజు, ఏవో సవిత, సీఐలు శ్రీనివాస్‌, పరుశరామ్‌గౌడ్‌, సురేందర్‌రెడ్డి, రాజశేఖర్‌, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికుమార్‌, టాస్క్‌ఫోర్సు సీఐ ప్రసాద్‌, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు డేవిడ్‌ విజయ్‌ కుమార్‌, రామకృష్ణ, రాజశేఖర్‌రెడ్డి, ధరణికుమార్‌, ఆర్‌ఎ్‌సఐ క్రాంతి, మహిళా ఆర్‌ఎ్‌సఐ స్రవంతి, అమరవీరుల పోలీస్‌ కుటుంబ సభ్యులు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.