ఆనాటి త్యాగాలకు నేడు విలువ లేదు

ABN , First Publish Date - 2020-09-17T05:36:11+05:30 IST

తెలంగాణలో జరిగిన నిజాం వ్యతిరేక ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటంలో కదం తొక్కిన మహిళలు వేల సంఖ్యలో ఉన్నారు...

ఆనాటి త్యాగాలకు నేడు విలువ లేదు

  • తెలంగాణలో జరిగిన నిజాం వ్యతిరేక ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటం ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితమయినా, దాని స్ఫూర్తి ఎన్నదగినదీ. అందరూ అనుసరించదగినదీ.  ఈ పోరాటంలో కదం తొక్కిన మహిళలు వేల సంఖ్యలో ఉన్నారు. కష్టాలు, కన్నీళ్లు, అజ్ఞాతం-  ఇలా  అనేక దశలను చూశారు. వారిలో ప్రముఖులు కొమ్మిడి సుగుణ. 87 ఏళ్ల సుగుణలో ఈ రోజుకు ఆ పోరాట పటిమ తగ్గలేదు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా పలకరించినప్పుడు  ఆమె చెప్పిన జ్ఞాపకాలెన్నో...


‘‘నేను పుట్టింది, పెరిగింది నల్గొండ జిల్లా బ్రాహ్మణపల్లిలో. మాది పెద్ద భూస్వామ్య కుటుంబం. రెండు అంతస్తుల ఇల్లు, పన్నెండు మంది జీతగాళ్లు, ఎనిమిది గుర్రాలు, రెండు వందల ఆవులు, మేకలు, గొర్రెలు, నాలుగొందల ఎకరాల భూమి..  అబ్బో చాలా పెద్ద కుటుంబం. మా ఊరికి పటేల్‌ మా నాన్న రామచంద్రారెడ్డే. మా నాన్న భూస్వామి అయినా.. మా అన్న కోదండరాంరెడ్డిపై ఆర్యసమాజ ప్రభావం బాగా ఉంది. తను అనేక సమావేశాలకు వెళ్ళేవాడు. తనతో పాటు నేను, మా అక్క శశిరేఖ కూడా వెళ్లేవాళ్ళం. అక్కడ మేము జాతీయ గీతాలు ఆలపించేవాళ్ళం. కృష్ణాష్టమి, వినాయకచవితి, దసరా లాంటి పండుగలప్పుడు కూడా కొన్ని ప్రోగ్రెసివ్‌ పాటలు పాడుకొనేవాళ్లం. కోలాటం ఆడేవాళ్ళం. ‘కల్లుమానండోయ్‌ బాబూ- కళ్లు తెరవండీ’ అంటూ ఊరూరా తిరిగి మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన సందర్భాలెన్నో! మా అన్నకు ఆడ, మగ భేదాలు చూపడం నచ్చేది కాదు. ‘ఇద్దరూ సమానమే!’ అనేవాడు. అందుకే మాకు చిన్నప్పుడు సైకిల్‌, ఈత, గుర్రపు స్వారీ, కర్రసాము వంటి రకరకాల విద్యల్లో తర్ఫీదు ఇప్పించాడు. అంతెందుకు, నాకు పన్నెండో ఏడు వచ్చే వరకూ నేత చొక్కా, లాగూ తొడుక్కునేదాన్ని.


భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభలకు మా ఇంటిల్లపాదీ కచరా బండ్లు కట్టుకొని వెళ్లాం. అదొక జనజాతర. రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి, మందుముల నరసింగరావు, బూర్గుల రామకృష్ణరావు లాంటి ప్రముఖులను ఎడ్ల బండ్ల మీద ఊరేగించారు. పల్లెల నుంచి ప్రజలు ప్రభలు కట్టుకొని మరీ వచ్చారు. మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవిలను తొలిసారి చూసింది అక్కడే. వాళ్లతో కలిసి ఆ మూడు రోజులు వాలంటీర్‌గా పనిచేశా. మహాసభల వేదికపై షేక్‌ నాజర్‌ చెప్పిన ‘బెంగాల్‌ కరువు’ బుర్రకథ ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతోంది. సుద్దాల హన్మంతు, భీంరెడ్డి నరసింహారెడ్డిల నోటి వెంట విన్న గొల్లసుద్దులు ఈ రోజుకీ నా చెవుల్లో మార్మోగుతున్నాయి. అప్పుడు నాకు ఎనిమిదేళ్లుంటాయనుకుంటా.!


లోలాకులు తీసి మహాత్ముడి జోలెలో...

అస్పృశ్యతా నివారణోద్యమ ప్రచారంలో భాగంగా మహాత్మాగాంధీ దేశవ్యాప్తంగా పర్యటించారు. 1940లలో భువనగిరి రైల్వేస్టేషన్‌ వద్ద కాసేపు ఆగి ప్రసంగించారు. ఆ సమావేశానికి మా అన్నయ్యతో పాటు నేనూ వెళ్ళాను. అప్పుడు రావి నారాయణ రెడ్డి భార్య సీతాదేవి తన మెడలోని మంగళసూత్రంతో సహా ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి గాంధీజీ చేపట్టిన అస్పృశ్యతా నివారణోద్యమ నిధికి విరాళంగా ఇచ్చారు. అది చూసి, ఉత్సాహంతో నేనూ నా చెవులకు ఉన్న లోలాకులు తీసి, మహాత్ముడి జోలెలో వేశా. గాంధీజీని నేను చాలా దగ్గరగా చూడడమే కాదు, ఆయన పాదాలకు నమస్కరించే అవకాశం దక్కింది. నేను అలా విరాళం ఇచ్చిన సంగతి తెలిసి, మా అన్నయ్య చాలా సంతోషించాడు.. విదేశీ వస్తు బహిష్కరణోద్యమ స్ఫూర్తితో మేమంతా నేత వస్త్రాలే ధరించే వాళ్లం. గాంధీజీ పిలుపుతో రావి సీతాదేవి తన పట్టు చీరలన్నిటినీ రోడ్డుమీద కుప్పపోసి నిప్పంటించారని విని ఆశ్చర్యపోయా. 


కారం పొట్లాలతో తిరిగాం...

తెలంగాణ గ్రామాల్లోని పటేల్‌- పట్వారీల దగ్గరున్న దస్తరాల(రికార్డులు)ను కాల్చివేయడం, వాళ్ల ఆయుధాలను హస్తగతం చేసుకోవడం లాంటి కార్యక్రమాల్లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ దళాలు నిమగ్నమయ్యాయి. మా అన్న మూడు దళాలకు నాయకుడు. గుండ్రాంపల్లిలోని రజాకార్ల క్యాంపు మీద దాడిచేసి, వాళ్లను అక్కడ నుంచి తరిమేసిన ముఖ్యుల్లో మా అన్న ఒకడు. మాదీ పటేల్‌ కుటుంబమే కదా! కాబట్టి నేను, మా అన్న, ఇతర దళ సభ్యులతో కలిసి మా ఇంట్లోని దస్తరాలనూ కాల్చేశాం. మా ఇంట్లోని నాటు తుపాకీ, తల్వార్‌లను ఆ దళానికి అప్పగించాం. ఒకసారి రజాకార్లు మా ఇంటిని చుట్టుముట్టారు. అప్పుడు ఇంట్లో మా మేనత్త, పెద్దమ్మ, అమ్మ, తమ్ముడు, నేనూ ఉన్నాం. ఇంటి వెనుక దర్వాజ నుంచి అమ్మ, నేను, తమ్ముడు బయటకి వెళ్ళిపోతుంటే, ఒక నిజాం పోలీసు అడ్డగించాడు. అప్పుడు మా మేనత్త సమయస్ఫూర్తితో ‘‘ఏయ్‌! మా ఇంటికెందుకొచ్చావ్‌. నీ మగడితో తండ్లాటైతే పిల్లలతో మా ఇంటికొస్తవా?’’ అని అమ్మని గదమాయించింది. దాంతో మేము ఆ కుటుంబ సభ్యులం కాదనుకొని... మమ్మల్ని పోలీసులు విడిచిపెట్టారు. అప్పుడు మేము పొరుగూరు వెళ్ళి కొద్ది రోజులు తలదాచుకున్నాం. రజాకార్ల దాడులు పెచ్చు మీరుతున్న రోజులవి.


1948, జనవరిలో బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌పై కాశీం రజ్వీ సైన్యం దాడికి దిగింది. స్టేషన్‌ మాస్టర్‌ కుటుంబాన్ని వాళ్లు పొట్టన పెట్టుకున్నారు. అంతటితో ఆగక కొన్ని ఇళ్ల మీద పడ్డారు. మాకు బాగా తెలిసిన రాజమ్మ టీచర్‌పై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ అవమానం తట్టుకోలేక ఆమె బావిలో దూకి చనిపోయింది. రజాకార్ల అకృత్యాలు శ్రుతి మించడంతో జనమంతా బెంబేలెత్తిపోయారు. గ్రామ రక్షక దళ సభ్యులు కొందరు చెట్లమీద కాపు కాసి, రజాకార్ల రాకను ముందే పసిగట్టేవారు. ఆ అరాచకుల అలికిడి అయితే చాలు, ఊరు వాళ్లందరూ అప్రమత్తమయ్యేవారు. చిన్నాపెద్దా, ఆడామగా... అంతా కారం పొట్లాలు చేతపట్టుకొని బావులు, తోటల్లోకి పరుగుతీసేవాళ్ళం.


మా ఇల్లు తగలబెట్టించాడు...

అన్నయ్యకు నన్ను బాగా చదివించాలని కోరిక. నాకూ టీచర్‌ అవ్వాలని ఉండేది. అప్పుడే హైదరాబాద్‌లోని మాడపాటి హనుమంతరావు స్కూల్లో ఎనిమిదో తరగతిలో చేరా. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌ మిల్లు పరిసరాల్లో ఉండేవాళ్ళం.. అప్పుడే కాశీం రజ్వీ తమ్ముడు తయ్యర్‌ రజ్వీ మా ఊరి మీద దాడికి వచ్చాడు. మా ఇంటి చాకలితో సహా మా పొలానికి నీళ్లు పెడుతున్న ఎనిమిది మంది పాలేర్లను బంధించాడు. వాళ్లతోనే మా ఇంటిని తగలబెట్టించాడు. తర్వాత వాళ్లందరినీ పరిగెత్తమని చెప్పి, అత్యంత క్రూరంగా అందరినీ తుపాకీతో కాల్చి చంపాడు. బావి దగ్గర ఉన్న మా నాన్నను చావగొట్టారు. బహుశా చనిపోయాడనుకొని ఆయనను వదిలేశారనుకుంటా! ఆ తర్వాత ఐదేళ్లు మమ్మల్ని సాగు కూడా చేసుకోనివ్వలేదు.


ఆ ఘటనతో నాన్న బాగా కుంగిపోయారు. ఆయన వైద్యం కోసం కుటుంబమంతా హైదరాబాద్‌కి వచ్చాం. సికింద్రాబాద్‌ దగ్గర చిలకలగూడలోని ఒక కిరాయి ఇంట్లో ఉండేవాళ్ళం. అక్కడికి అప్పుడప్పుడు అన్నయ్య రహస్యంగా వస్తుండేవాడు. ఒకసారి నిజాం సైన్యం హైదరాబాద్‌ మీద బాంబుల వర్షం కురిపించనుందని వదంతులు బయలుదేరాయి. బాంబులు పడే సమయంలో నేలమీద బోర్లాపడుకుంటే ప్రాణాపాయం తప్పుతుందని విన్నాం. దాంతో మాతో పాటు మా చుట్టుపక్క ఇళ్ల వారంతా ఆ రాత్రి నిద్రలేకుండా నేలమీద బోర్లా పడుక్కొని, భయంభయంగా గడపడం నాకు బాగా జ్ఞాపకం. తర్వాత రోజు భారత సైన్యాలు హైదరాబాద్‌లో ప్రవేశించాయనే వార్త ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది. పెద్ద ఎత్తున భారత సైన్యానికి స్వాగతం పలకడానికి జనం సమాయత్తమవుతున్నారు. మరో పక్కన కర్ఫ్యూ నడుస్తోంది. మా పొరుగింట్లోని పన్నెండేళ్ల అమ్మాయి చెత్త పారేయడానికని వీధిలోకి వెళ్ళి, తుపాకీ కాల్పుల్లో చనిపోయింది. భారత సైన్యాన్ని చూసేందుకు మా ఇంటి యజమాని వెళ్ళారు. ఆయన శవం తిరిగొచ్చింది. 


ఆరేళ్ళు అజ్ఞాతంలో...

సామ్యవాద రాజ్య స్థాపన లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కొనసాగించింది. అప్పుడు మా నివాసం లక్డీకపూల్‌లోని ఒక కిరాయి ఇంట్లో.. సాయుధ దళాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను బట్వాడా చేయడం నా బాధ్యత. అలా ఒకసారి ఖైరతాబాద్‌ నుంచి సిఖ్‌ విలేజ్‌ వరకూ నడిచి వెళ్ళి... రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డిలకు ఉత్తరాలు అందించాను. అప్పుడు నా సాహసం చూసి వాళ్ళంతా మెచ్చుకున్నారు. నాకూ రాజక్క (మల్లు స్వరాజ్యం)లా తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్లాలని ఉండేది.  ఒకసారి రావి నారాయణరెడ్డిని కలిసి ‘నన్నూ అడవుల్లోకి పంపండి’ అని అడిగాను. ‘వయసు తక్కువ కదా! వద్దులే’ అన్నారాయన. అప్పటికి నాకు పదిహేనేళ్ళే. అయినా రాచకొండ గుట్టల్లో కొద్ది రోజులు తుపాకీ శిక్షణ తరగతులకు హాజరయ్యా. కానీ అడవుల్లోకి వెళ్ళే అవకాశం నాకు దక్కలేదు. దాంతో సిఖ్‌ విలేజ్‌, అమీర్‌పేట్‌, బొల్లారం తదితర ప్రాంతాల్లోని డెన్‌ (కమ్యూనిస్టుల అజ్ఞాతవాసం)లలో సుమారు ఆరేళ్ళు అజ్ఞాతంగా పనిచేశాను. అప్పుడు నా పని రాష్ట్ర కార్యవర్గంలోని ముఖ్య ఉత్తరాలు, డాక్యుమెంటరీలను రాయడం. పదహారేళ్లు నిండిన వారికే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం ఇస్తారు. అలాంటిది, నాకు పదిహేనేళ్లకే రావి నారాయణరెడ్డి సభ్యత్వం ఇవ్వడంతో పాటు తమ కమిటీలోకి తీసుకున్నారు.


విప్లవోద్యమంలో యాక్టివ్‌గా ఉన్న మా అన్నయ్యను 1949లో ఒక పథకం ప్రకారం ఇండియన్‌ ఆర్మీ కాల్చి చంపేసింది. ఆనాటి నుంచి కమ్యూనిస్టు పార్టీ నాయకులే నాకు అన్నలుగా నిలిచారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో సుమారు నాలుగు వేలమంది కమ్యూనిస్టులు ప్రాణాలు వదిలారు. వారందరి ప్రాణత్యాగానికి ఈనాడు విలువలేకుండా పోతుందనేదే నా బాధంతా! స్వాతంత్య్రం కోసం పోరాడింది ఒకరైతే, ఆ పేరును లాక్కునేందుకు మరొకరు చరిత్రనే వక్రీకరిస్తున్నారు. పోరాటాల చరిత్రను కళ్ళతో చూసిన మేమంతా ఉండగానే, చరిత్రను తారుమారు చేయడం తగదు’’. 

- కె. వెంకటేశ్‌, హైదరాబాద్‌


ఆంధ్రా కోడలిని...

నా భర్త శాఖమూరి వెంకట కృష్ణప్రసాద్‌ స్వస్థలం గుంటూరు జిల్లా, తాడవాయి. ఆయన కమ్యూనిస్టు పార్టీ రీజనల్‌ కమిటీ ఛైర్మన్‌ కూడా. పార్టీ నాయకత్వ హోదాలో తెలంగాణ దళాలకు మార్గనిర్దేశం చేసేందుకు వచ్చారు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న సమయంలోనే ‘ఇష్టపడితే పెళ్ళి చేసుకుందామ’ని ఉత్తరం రాశారు. పార్టీ పెద్దల అంగీకారంతో 1949లో ఇద్దరం ఒక్కటయ్యాం. మా పిల్లలు శోభ, రవి, రమేశ్‌. ముగ్గురూ అమెరికాలో స్థిరపడ్డారు. 1957లో మా ఆయన చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక పాత్రను పోషించారు. పార్టీ చీలిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. మాది కులాంతర వివాహం. నాదేమో తెలంగాణ. నా భాష, సంస్కృతి వేరు. అయినా, ఏనాడు నా అత్తగారింట్లో ఆ వివక్ష నాకు ఎదురు కాలేదు. మా మెట్టినింటివారంతా నన్ను సొంత మనిషిలా అభిమానించేవారు. అందుకే ‘ఆంధ్రా కోడలిని’ అని గర్వంగా చెప్పుకుంటా. పాతికేళ్ల కిందట ప్రసాద్‌ చనిపోయారు. నేను ప్రస్తుతం సీఆర్‌ ఫౌండేషన్‌ వయోధికాశ్రమంలో ఉంటున్నా. ఆనాటి జ్ఞాపకాలే నాకు సంజీవని. వాటిని తలుచుకుంటూ ఆనందంగా ఉంటున్నా.

Updated Date - 2020-09-17T05:36:11+05:30 IST