అదే పెద్ద సవాలు

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

నటిగా నా ఎంట్రీ సినిమాల్లో సన్నివేశానికి ఏమాత్రం తీసిపోదు. మాది కోల్‌కతా. స్కూల్లో చదువుతున్న రోజులు. నాకు అప్పుడు పదిహేనేళ్లు ఉంటాయి. ..

అదే పెద్ద సవాలు

ఒకే ఒక్క చాన్స్‌... వినోద పరిశ్రమలో ఎంట్రీ కోసం ఔత్సాహికుల నోట వినిపించే మాట. 

మరి ఆ చాన్సే నడిచొచ్చి రోడ్డు మీద ఎదురుపడితే! ఆ అనుభూతి ఎలా ఉంటుందో నటి దేబ్‌జాని మోదక్‌ మాత్రమే చెప్పగలదు. 

‘ఎన్నెన్నో జన్మల బంధం’ అంటూ తెలుగింట అడుగుపెట్టిన ఈ బెంగాలీ భామ ‘నవ్య’తో పంచుకున్న అనుభవాలివి...


నటిగా నా ఎంట్రీ సినిమాల్లో సన్నివేశానికి ఏమాత్రం తీసిపోదు. మాది కోల్‌కతా. స్కూల్లో చదువుతున్న రోజులు. నాకు అప్పుడు పదిహేనేళ్లు ఉంటాయి. మ్యాథ్స్‌ ట్యూషన్‌ అయిపోయింది. నడుచుకొంటూ ఇంటికి వెళుతున్నా. కొంత దూరం పోయాక ఒకావిడ ఎదురుపడింది. నన్ను చూసి ఆగింది. నేరుగా నా దగ్గరకు వచ్చి... ‘సీరియల్‌లో నటిస్తావా? ఆసక్తి ఉంటే చెప్పు’ అంది. పరిచయం లేని వ్యక్తి... ఊహించని ప్రశ్న. ఎలా స్పందించాలో అర్థంకాలేదు. ‘మా అమ్మా నాన్నలను అడగండి. వాళ్లు ఒప్పుకొంటే ఓకే’ అన్నాను. ఆమె ఇంటికి వచ్చారు. అమ్మ అభ్యంతరం చెప్పలేదు కానీ నాన్న మాత్రం వద్దంటే వద్దన్నారు. ‘ఈ సీరియల్స్‌, సినిమాలు మనకు తగవ’న్నారు. దాంతో అమ్మ కలుగజేసుకుంది. వెతుక్కొంటూ వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం సరైన నిర్ణయం కాదని నాన్నకు సర్దిచెప్పింది. చివరకు ఎలాగో ఆయన ఒప్పుకున్నారు. ఆ తరువాత తెలిసింది... నన్ను అడిగిన ఆవిడ సీరియల్‌ నటి అని! 


ఆడిషన్స్‌కు వెళ్లాను. నా ఫీచర్స్‌ వాళ్లకు నచ్చాయి. సెలెక్ట్‌ అయ్యాను. సీరియల్‌లో లీడ్‌ రోల్‌. అప్పుడు నా ఆనందం ఎంతంటే ఏమని చెప్పాలి! ఎగిరి గంతేసే లోపే నిరాశ. అనివార్య కారణాలవల్ల ఆ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్లలేదు. అవకాశం వచ్చినా పరిస్థితులు అనుకూలించనప్పుడు మనం మాత్రం ఏంచేయగలమనుకుని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. 


అలా కలిసొచ్చింది... 

ఇక్కడే మరో మలుపు తీసుకుంది నా జీవితం. ఆ ప్రాజెక్ట్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా వ్యవహరించినవారు ఒక రోజు మా నాన్నకు ఫోన్‌ చేశారు... ‘మేం ఓ సినిమా చేస్తున్నాం. మీరు ఒప్పుకొంటే మీ అమ్మాయిని హీరోయిన్‌గా పెడదామనుకొంటున్నాం’ అని! నాన్న సరేనన్నారు. కాస్తంత నిరాశలో ఉన్న నాకు పెద్ద ఉపశమనం. తొలి ప్రాజెక్ట్‌ పట్టాలెక్కకపోతేనేం... బెంగాలీ సినిమాలో హీరోయిన్‌ రోల్‌తో ఎంట్రీ గ్రాండ్‌గా జరిగిపోయింది. 2012లో అంటే నాకు పదిహేనేళ్లప్పుడు ఆ చిత్రం విడుదలైంది. నా మొదటి ప్రాజెక్ట్‌ కావడంతో భావోద్వేగాల పరంగా కూడా దాంతో కనెక్ట్‌ అయిపోయాను. బహుశా అందుకేనేమో ఆ చిత్రంలో నా పాత్రకు మంచి పేరు వచ్చింది! ఆ తరువాత మరో రెండు బెంగాలీ సినిమాల్లో నటించాను. చిన్నతనంలోనే నటన వైపు రావడంతో కాలేజీకి వెళ్లడం కుదరలేదు. ప్లస్‌ టూ తరువాత కరస్పాండెన్స్‌లో బీఏ ఇంగ్లిష్‌ ఆనర్స్‌ పూర్తి చేశాను. 


బుల్లితెర ఆహ్వానం...

అయితే సినిమాల్లో చేస్తుండగానే నా మనసు సీరియల్స్‌ పైకి మళ్లింది. దానికి ఒక కారణం ఉంది. ఇంట్లో మా అమ్మా నాన్న సీరియల్స్‌ చూస్తుంటారు. చేతిలో ఓ టీ కప్పు పెట్టుకొని... ఓ సిప్పు వేస్తూ... సీరియల్స్‌ను ఆస్వాదించడం వారికి మొదటి నుంచి అలవాటు. మా బామ్మా తాతయ్యలకు కూడా చాలా ఆసక్తి. మన ఇంట్లో వాళ్లకి అంతగా వినోదం పంచుతున్న ఆ బుల్లితెరపై నేను కనిపిస్తే వారికి మరింత సంతోషాన్ని ఇచ్చినదాన్ని అవుతాను కదా అనిపించింది. అదే సమయంలో ప్రముఖ చానల్స్‌ నుంచి ధారావాహికల కోసం ఆహ్వానం అందింది. నా మనసు కోరుకున్న ఆఫర్‌... సైన్‌ చేయడానికి సమయం తీసుకోలేదు. 


‘స్టార్‌ మా’ నుంచి పిలుపు... 

అది మొదలు ఇప్పటికి ఒక్క బెంగాలీలోనే ఏడు సీరియల్స్‌లో నటించాను. మా రాష్ట్రం దాటి బయటకు వచ్చింది మాత్రం ఓ తమిళ ప్రాజెక్ట్‌తో. అక్కడ రెండో ప్రాజెక్ట్‌ చేస్తుండగా ‘స్టార్‌ మా’ నుంచి పిలుపు వచ్చింది. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్‌లో ప్రధాన పాత్ర కోసం నన్ను సంప్రతించారు. కథ నచ్చింది. పైగా తెలుగులో నటించాలనేది ఎప్పటి నుంచో నా కోరిక. ఓకే అన్నాను. ఈ సోమవారమే ‘స్టార్‌ మా’లో ఆ సీరియల్‌ ప్రారంభమైంది. ఇక్కడ టీమ్‌ అద్భుతం. సెట్‌లో ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నాను. 


విభిన్న పాత్ర... 

‘ఎన్నెన్నో జన్మల బంధం’ కథలానే అందులో నేను పోషించిన ‘వేదశ్వని’ పాత్ర కూడా విభిన్నంగా ఉంటుంది. పక్కింటి పిల్లను తలపించే వేదశ్వని ఒక డాక్టర్‌. ఆమెకు పిల్లలంటే అమితమైన ప్రేమ. మాతృత్వంలోని మాధుర్యాన్ని తనూ పొందాలని ఆరాటపడుతుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలవల్ల తను ఎప్పటికీ తల్లి కాలేదు. అలాంటి ఆమె ఒక పాపను చూసిన వెంటనే ఎంతో ఇష్టపడుతుంది. దగ్గరకు తీస్తుంది. ఆ పాపకు తల్లితండ్రులు ఉండరు. ఈమెకు పిల్లలు పుట్టరు. వారిద్దరి ప్రయాణమే ‘ఎన్నెన్నో జన్మల బంధం’ కథ. ఎన్నో వేరియేషన్స్‌ గల చాలెంజింగ్‌ రోల్‌ నాది. 


కొనసాగడమే సవాల్‌... 

ఈ పరిశ్రమలోకి వచ్చి తొమ్మిదేళ్లయింది. పెద్దగా ఇబ్బంది పడిన సందర్భం గానీ, నా వల్ల కాదు... వెనక్కి వెళ్లిపోదామనే ఆలోచన కానీ దేవుడి దయ వల్ల ఇవాల్టి వరకు రాలేదు. ఇక ఏ రంగంలో అయినా సవాళ్లన్నవి సాధారణం. ఇక్కడా అంతే. అవకాశం తెచ్చుకోవడం కంటే విజయవంతంగా పరిశ్రమలో కొనసాగడం పెద్ద సవాలు. నేను అనుసరించే మార్గం... పని చేసే చోట నలుగురినీ కలుపుకొనిపోవడం. నా చుట్టూ ఉన్నవారిని ప్రేమించడం. కోల్‌కతాకు ఇక్కడకు భాషాసంస్కృతుల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. అక్కడి నుంచి వచ్చిన నాకు అచ్చమైన ఒక తెలుగు అమ్మాయిగా మెప్పించడం కూడా సవాలే. కానీ సవాళ్లంటే నాకు ఇష్టం... వాటిని అధిగమించినప్పుడే కదా కిక్కు ఉండేది. 


హనుమా 


మధురాతి మధురం...

ఇన్నేళ్ల నా కెరీర్‌లో మధురానుభూతులు ఎన్నో ఉన్నాయి. కానీ మధురాతి మధురంగా అనిపించేది మాత్రం... రోడ్డు మీద వెళ్తుంటే అవకాశం ఎదురు రావడం. ‘నేను కూడా టీవీ తెరపై కనిపించబోతున్నాను’ అని తెలిసినప్పుడు ఆ రోజు కలిగిన అనుభూతి అద్భుతం. వద్దంటే వద్దన్న మా నాన్నే ఇప్పుడు నన్ను చూసి గర్వంగా భావిస్తున్నారు. మా అమ్మ కంటే ఎక్కువ ప్రోత్సహించడం నా జీవితంలోనే గుర్తిండిపోయే అనుభవం. అమ్మా నాన్న కోల్‌కతాలోనే ఉంటున్నారు. బ్రేక్‌ దొరికినప్పుడల్లా అక్కడ వాలిపోతా.


పర్సనల్‌ టచ్‌

హాబీస్‌ అంటూ ప్రత్యేకంగా లేవు. కానీ ట్రావెలింగ్‌ ఇష్టం. 

 ఖాళీ దొరికితే ఇంట్లో అమ్మా నాన్న, చెల్లితోనే కాలక్షేపం. 

 తెలుగు సినిమాలు చూస్తుంది. ‘బాహుబలి’ బాగా నచ్చింది. 

టాలీవుడ్‌లో ఫేవరెట్‌... ప్రభాస్‌, మహేశ్‌, తమన్నా, అనుష్క. 

 లక్ష్యం... తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం.


Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST