అదే బాదుడు!

ABN , First Publish Date - 2021-08-24T05:55:22+05:30 IST

అదే బాదుడు!

అదే బాదుడు!
సోమవారం పార్కింగ్‌ స్టాండ్‌లో ద్విచక్రవాహనానికి ఇచ్చిన రశీదు

- పార్కింగ్‌ కేంద్రాల్లో కొనసాగుతున్న అదనపు వసూళ్లు

- పట్టించుకోని ఆర్టీసీ అధికారులు

- కుమ్మక్కు వ్యవహారమే కారణమంటున్న వాహనదారులు

(గుజరాతీపేట)

ఏదైనా శాఖలో అక్రమాలు, తప్పిదాలు వెలుగు చూసినప్పుడు ఉన్నతాధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమిస్తారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. ఆర్టీసీలో మాత్రం అందుకు విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగ ణంలో వాహనాల పార్కింగ్‌ కేంద్రాల్లో అక్రమ వసూళ్లపై ‘ఆంధ్ర జ్యోతి’లో మూడు వారాల కిందట ‘బండి నిలిపితే బాదుడే’ అన్న కథనం ప్రచురితమైంది. అయినా పార్కింగ్‌ కేంద్రాల నిర్వాహకుల తీరు మారలేదు. రశీదుపై దిద్దుబాట్లు, వాహనదారులపై దురు సుగా మాట్లాడడం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ అప్పలరాజు, డీసీటీఎం వరలక్ష్మి, శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్‌ ప్రవీణ తదితరులు అప్పట్లో స్పందించారు. తక్షణమే చర్యలు చేపడతామని చెప్పారు. కానీ 20 రోజులు గడుస్తున్నా అక్రమ వసూళ్లు నియంత్రణలోకి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిర్వాహకులతో ఆర్టీసీ అధికారులు కమ్మక్కవ్వడం వల్లే పట్టించుకోవడం లేద న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


నిబంధనలకు విరుద్ధంగా..

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో మూడు వాహన పార్కింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు 12 గంటల పాటు పార్కింగ్‌ చేసినట్టయితే రూ.15లు వసూలు చేయాల్సి ఉంది. కానీ రూ.20 వంతున వసూలు చేస్తున్నారు. సైకిళ్లకు రూ.10 వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ నిర్ణయించిన పార్కింగ్‌ ఫీజులను తగ్గించమని వాహనదారులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. కానీ సంబంధిత నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. అటు ఆర్టీసీ అధికారులు సైతం పట్టించుకోకపోవడం విస్మయపరుస్తోంది. పార్కింగ్‌ చేసే సమయంలో నిర్ధే శించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తుండడంతో వాహనదారులు తరచూ గొడవకు దిగుతుంటారు. సంబంధిత నిర్వాహకులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఆర్టీసీ తీరుపై వాహనదారులు పెదవివిరుస్తున్నారు. కళ్లెదుటే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా నియంత్రించలేని స్థితిలో ఉన్నారని 


నివేదిక కోరాం..

పార్కింగ్‌ కేంద్రాల్లో అక్రమ వసూళ్లపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై నివేదిక అందించాలని శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్‌ ప్రవీణను ఆదేశించాం. ఈ నెల 25 నాటికి నివేదికను తెప్పించుకొని నిర్వాహకులపై చర్యలకు ఉపక్రమిస్తాం. అదనపు వసూళ్లకు పాల్పడితే కాంట్రాక్ట్‌ను సైతం రద్దుచేస్తాం. 

- ఎ.అప్పలరాజు, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌

Updated Date - 2021-08-24T05:55:22+05:30 IST