బిల్లుల చెల్లింపులో ఇదేమి మమకారం

ABN , First Publish Date - 2021-01-14T05:40:01+05:30 IST

జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శాఖలు, అందులో పనిచేస్తున్న అధికారులు బిల్లుల చెల్లింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

బిల్లుల చెల్లింపులో ఇదేమి మమకారం
తిప్పర్తిలో సాగుతున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు

గుజరాత్‌ కాంట్రాక్టర్లకే బిల్లులిస్తున్నారనే ఆరోపణలు 

రూ.6కోట్ల 64లక్షలకు పైగా పెండింగ్‌ 

నత్తనడకన సాగుతున్న ‘డబుల్‌’ పనులు 

జిల్లా అధికారులపై ఫిర్యాదుల వెల్లువ

నల్లగొండ, జనవరి 13: జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శాఖలు, అందులో పనిచేస్తున్న అధికారులు బిల్లుల చెల్లింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ఇంటికి ప్రభుత్వం కేటాయించిన సొమ్ము అరకొరగా ఉండడంతో అసలు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ఏదో ఒక పని చేస్తున్నామన్న తృప్తికోసమే కొందరు కాంట్రాక్టర్లు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల 8,155 ఇళ్ల నిర్మాణానికి గత ఐదేళ్లుగా కేవలం మూడువేల ఇళ్లకు మాత్రమే టెండర్లను ఖరారుచేశారు. ఇక ఈ మూడువేల ఇళ్లకైనా ప్రభుత్వంనుంచి వస్తున్న బిల్లులను కాంట్రాక్టర్లందరికీ సమానంగా చెల్లించాల్సింది పోయి గుజరాత్‌ కాంట్రాక్టర్ల వైపే కొందరు అధికారులు మొగ్గు చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాతోపాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కాంట్రాక్టు చేస్తున్న వారు పనులు నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో గుజరాత్‌ కాంట్రాక్టర్లు, లోకల్‌ కాంట్రాక్టర్ల మధ్య విబేధాలు తలెత్తే పరిస్థితిని అధికారులు తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బిల్లులు పెండింగ్‌ లేకుండా చెల్లిస్తుండగా జిల్లాకు వచ్చేసరికి పెండింగ్‌ ఉండడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. 


పల్లెల్లో పేదలకు ఇళ్లు దక్కేది అనుమానమే

జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కొంతమేర ప్రగతిలో ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో నిధుల కొరత ఏర్పడింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన తర్వాత అర్భన్‌ ప్రాంతాల కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో చేతులెత్తేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ముందుకు సాగని దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 8,155 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో మూడువేల ఇళ్లకు మాత్రమే టెండర్లు పూర్తికావడంతో నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల4వేలను కేటాయించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఇప్పటివరకూ నిర్మించిన ఇళ్లకు రూ.6కోట్ల64లక్షల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల విషయంలో మీనమేషాలు లెక్కపెడుతుండడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కూలీలకు డబ్బులు చెల్లించేందుకు కూడా లేకపోవడంతో యూపీ కూలీలు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఉదాహరణకు తిప్పర్తితోపాటు నల్లగొండ మండలం అన్నారెడ్డిగూడెం, దోమలపల్లి గ్రామాలతో పాటు కనగల్‌ మండలం చర్లగౌరారం, పొనుగోడు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినప్పటికీ బిల్లుల చెల్లించకపోవడంతో ఆ పనుల్లో కొన్ని ఆగిపోయే దశలతోపాటు మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి. ఇదిలా ఉంటే మరో 5,155 ఇళ్లకు టెండర్లను ఖరారుచేయాలని ప్రయత్నించినప్పటికీ బిల్లులు రావడంలేదని కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. పలుమార్లు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు రాకపోవడంతో వాయిదాలుపడ్డాయి.


ఎనిమిది నెలలుగా నిరీక్షణ

జిల్లాలో గత ఎనిమిది నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని తెలుస్తోంది. కొందరు కాంట్రాక్టర్లు రాష్ట్ర హౌసింగ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీని కూడా కలిసి బిల్లులు చెల్లించాలని కోరినా ఫలితంలేదు. ప్రధానంగా నిరుపేదలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గుజరాత్‌ నుంచి వచ్చిన కాం ట్రాక్టర్లకు అధికార యంత్రాంగం కావాలని ప్రాధాన్యం ఇచ్చి నిధులు విడుదలైన వెంటనే బిల్లులు చెల్లిస్తున్నారని, తమకు మాత్రం బిల్లులు చెల్లించకుండా వివక్ష చూపిస్తున్నారంటూ కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఆఫ్‌లైన్‌ సమయంలో ఇసుక రూ.1500లకు లభించేదని, ప్రస్తుతం అంతకు రెండింతలు ఎక్కువగా చెల్లించి నిర్మాణాలు చేయాల్సి వస్తోందని, అదేవిధంగా స్టీలు ధరలు పెరిగాయని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్మాణాలు చేస్తుంటే బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. 


పట్టణ ప్రాంతాలకు చెల్లించాం : రాజ్‌కుమార్‌, హౌసింగ్‌ పీడీ

పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లించాం. ఇంకా రూ.6కోట్ల64లక్షల బిల్లులు పెండింగ్‌ లో ఉన్నాయి. బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పం పాం. త్వరలోనే బిల్లులు మంజూర య్యే అవకాశాలున్నాయి. గుజరాత్‌, స్థానిక కాంట్రాక్టర్లు అని కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్భన్‌ ప్రాంతాల్లో బిల్లులు చెల్లించాం.  

Updated Date - 2021-01-14T05:40:01+05:30 IST