మున్సి‘పోల్స్‌’కూ అదే స్ఫూర్తి!

ABN , First Publish Date - 2021-02-23T08:49:58+05:30 IST

పురపాలక ఎన్నికలను మరింత పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎ్‌సఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అధికారులను కోరారు. రాష్ట్రంలోని 12

మున్సి‘పోల్స్‌’కూ అదే స్ఫూర్తి!

పోలింగ్‌ శాతం పెరగాలి

మున్సిపల్‌ ఎన్నికలపై అధికారులకు ఎస్‌ఈసీ దిశానిర్దేశం

పంచాయతీ పోల్స్‌ సమర్థంగా జరిపారంటూ అభినందన

కోర్టు కేసులతో ‘పరిషత్‌’కు అవాంతరాలు: రమేశ్‌కుమార్‌


అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): పురపాలక ఎన్నికలను మరింత పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎ్‌సఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అధికారులను కోరారు. రాష్ట్రంలోని 12 నగరపాలకసంస్థలు, 75 పురపాలక సంఘాలు-నగర పంచాయతీలకు వచ్చే నెల 10వ తేదీన జరిగే ఎన్నికల కార్యాచరణపై సోమవారం ఆయన  ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలను సమర్థంగా జరిపారంటూ అధికారులను అభినందించారు. పంచాయతీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్‌ నమోదైందని, అదే స్ఫూర్తితో పురపాలక ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని మరింతగా పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారమివ్వని రీతిలో ఎన్నికలు నిర్వహిస్తే, పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓట్లు వేసేందుకు ముందుకు వస్తారన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌, సీసీ కెమెరాల ఏర్పాటు, వీడియోగ్రఫీ ద్వారా నిఘా ఉంచాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో కొవిడ్‌-19 నిబంధనావళి కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా మున్సిపల్‌ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరుగుతాయి గనుక, వీటి నిర్వహణపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, శాఖల ముఖ్య కార్యదర్శులు వై.శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, సీడీఎంఏ నాయక్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు. 


పంచాయతీ... విజయవంతం

అనంతరం తన కార్యాలయంలో రమేశ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16.77 శాతం స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, సుమారు 10,890 మంది సర్పంచులు, 47,459 మంది వార్డు సభ్యులు నేరుగా ఎన్నికైనట్లు తెలిపారు.  అవాంఛనీయ ఘటనలతో ఎక్కడా రీపోలింగ్‌ జరగలేదని వివరించారు. ఓటర్లకు అవగాహన కల్పించడంలో మీడియా కీలకంగా వ్యవహరించిందన్నారు. 


అవాంతరాలు తొలిగాకే ‘పరిషత్‌’ 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ముందుగా భావించామని, అయితే  కోర్టులో కేసుల కారణంగా కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని ఎస్‌ఈసీ చెప్పారు. అవాంతరాలు తొలిగి పోయాక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మార్చి 2 నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతందని చెప్పారు. ఒత్తిడితో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి విజ్ఞప్తులపై చర్చిస్తామన్నారు.


గవర్నర్‌తో ఎస్‌ఈసీ భేటీ

ఎస్‌ఈసీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ, అధికార యంత్రాంగం సహకరించినట్టు వివరించారు. అనివార్య పరిస్థితుల్లో మంత్రులను మీడియాతో మాట్లాడనీయకుండా కట్టడి చేసేందుకు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని గవర్నర్‌కు వివరించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తామని, కోర్టు చిక్కుముడులు వీడితే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పినట్టు తెలిసింది.  


9, 10 తేదీల్లో సెలవులు: సీఎస్‌

పురపాలక ఎన్నికల ఓటింగ్‌, కౌంటింగ్‌కు వినియోగించే విద్యా సంస్థలు, ప్రభుత్వ భవనాల్లోని కార్యాలయాలకు  మార్చి 9,10 తేదీలు సెలవుగా ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ట్రెజరీలు, సబ్‌ ట్రెజరీలు యథావిధిగానే పని చేస్తాయన్నారు. దుకాణాలు, సంస్థల్లో పని చేసేవారికి మార్చి 10న వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలని కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌ను ఆదేశించారు. ఎన్నికలు ముగియడానికి 48 గంటల ముందు నుంచి మద్యం దుకాణాలను మూసివేయాలని సీఎస్‌ ఉత్తర్వులిచ్చారు.

Updated Date - 2021-02-23T08:49:58+05:30 IST