ఆరో రోజూ అదే వరుస

ABN , First Publish Date - 2020-09-25T07:08:17+05:30 IST

దేశంలో వరుసగా ఆరో రోజూ కరోనా పాజిటివ్‌ కేసుల కంటే కోలుకున్నవారి సం ఖ్య ఎక్కువగా నమోదైంది...

ఆరో రోజూ అదే వరుస

  • కొత్తగా 86,508 మందికి వైరస్‌
  • కోలుకున్నవారు 87,374 మంది
  • 10 రాష్ట్రాల్లోనే 74ు కేసులు: కేంద్రం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: దేశంలో వరుసగా ఆరో రోజూ కరోనా పాజిటివ్‌ కేసుల కంటే కోలుకున్నవారి సం ఖ్య ఎక్కువగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 86,508మంది వైరస్‌ బారినపడ్డారని, 1,129 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ వ్యవధి లో 87,374 మంది కోలుకున్నట్లు వివరించింది. తాజా కేసుల్లో 74ు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, యూపీ, తమిళనాడు, ఒడిసా, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్‌, చత్తీ్‌సగఢ్‌లోనే నమోదైనట్లు పేర్కొంది. 13 రాష్ట్రాల్లో కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. కాగా, వైరస్‌ తో తీవ్రంగా ప్రభావితమైన 5 రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య కొన్ని రోజుల నుంచి బాగా తగ్గుతోంది. మహారాష్ట్రలో వారం రోజుల్లోనే 10ు తగ్గుదల కనిపించింది. ఏపీ లోనూ భారీగానే వ్యత్యాసం ఉంది. గత వారంలో రోజువారీ పరీక్షల సగటు 9.81లక్షలు కాగా, 10 రోజుల క్రితం ఇది 10.94 లక్షలు ఉండటం గమనార్హం. కాగా, కరోనాతో మృతి చెందిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగాడీకి కేంద్ర కేబినెట్‌ గురువారం నివాళులర్పించింది.


విజయకాంత్‌కు పాజిటివ్‌

డీఎండీకే అధినేత ప్రముఖ తమిళ సినీనటుడు విజయకాంత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం అర్థరాత్రి వైద్యపరీక్షలు నిర్వహించగా ఆయనకు కొవిడ్‌ లక్షణాలు వెలుగుచూశాయి. విజయకాంత్‌ ఏడాదికిపైగా మూత్రాశయ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతూ ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు.


వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగానే ఢిల్లీలో ఈ నెల ప్రారంభంలో కేసులు భారీగా పెరిగాయని సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. ఇప్పుడది గరిష్ఠానికి చేరిందని, దీంతో కేసులు తగ్గుతాయని పేర్కొన్నారు. దేశంలో సెకండ్‌ వేవ్‌ను అంగీకరించిన తొలిరాష్ట్రం ఢిల్లీనే. కర్ణాటకలోని బీదర్‌ జిల్లా బసవకల్యాణ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణరావు (65) కరోనాతో కన్నుమూశారు. మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏకనాథ్‌ షిండేకు పాజిటివ్‌ వచ్చిం ది. సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ భార్య, కుమారుడు సహా 9 మందికి వైరస్‌ సోకింది. అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ పరిస్థితి విషమించింది.


ఇజ్రాయిల్‌లో కఠినంగా లాక్‌డౌన్‌-2

ఇజ్రాయిల్‌లో కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌-2ను శుక్రవారం నుంచి మరింత కఠినంగా అమలు చేయాలని ఆ దేశం నిర్ణయించింది. నిత్యవసరాల దుకాణాలు మినహా మిగతావాటిని మూసివేయాలని ఆదేశించింది. ప్రజలు ఇళ్ల నుంచి కిలోమీటరు పరిధిలోనే సంచరించాలని పేర్కొంది. యూదుల సెలవు దినాలు మొదలైనప్పటికీ 20 మంది మించి గుమిగూడేందుకు వీల్లేదని పేర్కొన్నది.

Updated Date - 2020-09-25T07:08:17+05:30 IST