అదే స్థితప్రజ్ఞత!

ABN , First Publish Date - 2021-03-12T05:42:59+05:30 IST

సజీవ సమాధి గురించి మనకు తెలుసు. అంటే జీవించి ఉండగానే సమాధి కావడం. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అలా జీవసమాధి పొందినవారే. అటువంటి మహాత్ములు సామాన్య వ్యక్తుల్లా జననం గురించి సంతోషపడరు.

అదే స్థితప్రజ్ఞత!

మహాత్ములు సామాన్య వ్యక్తుల్లా జననం గురించి సంతోషపడరు. మరణం గురించి భయపడరు. వారే స్థితప్రజ్ఞులు. జెన్‌ సాహిత్యంలో కూడా అలాంటి గురువుల కథలు కొన్ని కనిపిస్తాయి. అలాంటి ఒక గురువు గురించి ఓషో ఒక సందర్భంలో ప్రస్తావించారు. 


సజీవ సమాధి గురించి మనకు తెలుసు. అంటే జీవించి ఉండగానే సమాధి కావడం. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అలా జీవసమాధి పొందినవారే. అటువంటి మహాత్ములు సామాన్య వ్యక్తుల్లా జననం గురించి సంతోషపడరు. మరణం గురించి భయపడరు. వారే స్థితప్రజ్ఞులు. జెన్‌ సాహిత్యంలో కూడా అలాంటి గురువుల  కథలు కొన్ని కనిపిస్తాయి. అలాంటి ఒక గురువు గురించి ఓషో ఒక సందర్భంలో ప్రస్తావించారు. 


వేలాది శిష్యులు ఉన్న ఒక జెన్‌  గురువు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన వయసు దాదాపు తొంభై ఏళ్ళు. ఒక రోజు ఆయన పడుకొని ఉండగా... చుట్టూ ఉన్న శిష్యులు ఆయనకు సేవలు చేస్తున్నారు. వెయ్యి కళ్ళతో కనిపెట్టుకొని ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆదుర్దాగా ఉన్నారు. 


పడుకున్న ఆ గురువు కళ్ళు తెరచి, పైకి లేచి ‘‘ఎక్కడ? నా పాదరక్షలు ఎక్కడ?’’ అని అడిగాడు.శిష్యులు ఆశ్చర్యపోతూ ‘‘మహాశయా! ఎక్కడికి వెళ్తారు? అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. వైద్యుడు కూడా మిమ్మల్ని బాగా పరీక్షించి, కొన్ని రోజుల పాటు కాదు కదా, కొన్ని గంటలైనా మీరు జీవించి ఉండే అవకాశం లేదని దృఢంగా చెప్పాడు’’ అన్నారు.


అప్పుడు ఆ గురువు ‘‘అందుకే కదా... నా పాదరక్షలు ఎక్కడున్నాయని అడుగుతున్నాను. చావు వచ్చేవరకూ ఇక్కడే ఆగి ఉండాలా? మరణించాక నా మృతదేహాన్ని శ్మశానానికి మోసుకువెళ్ళే శ్రమనూ, దాన్ని పూడ్చడానికి కావలసిన గోతిని తవ్వే శ్రమనూ నేను మీ అందరికీ కలిగించాలా? అది నాకు ఏమాత్రం నచ్చదు. శ్మశానం ఎలాగూ నడిచి వెళ్ళే దూరంలోనే ఉంది. ఆ మాత్రం దూరం వెళ్ళగలిగే శక్తి, గోతిని తవ్వుకొనే బలం నాకు ఇంకా మిగిలే ఉన్నాయి. కాబట్టి నేను వెళ్తాను. నేనే నడుస్తాను’’ అంటూ చెప్పులు వేసుకొని శ్మశానానికి బయలుదేరాడు. 


ఆయన వెనుక శిష్యులు కూడా మౌనంగా నడిచారు. ఆయన తన గోతిని తానే తవ్వుకున్నాడు. ఎలాంటి విచారం, విషాదం లేకుండా అందులో పడుకున్నాడు. కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. క్రమంగా రక్తప్రసరణ, శ్వాస నిలిచిపోయాయి. తొంభై ఏళ్ళు నిర్విరామంగా శ్రమించిన ఆయన గుండె ఆగిపోయింది. శిష్యులు ఆ గోతిని కప్పేసి, వెనుతిరిగి వెళ్ళిపోయారు. జననాన్నీ మరణాన్నీ ఎంతో సహజమైనవిగా పరిగణించారు ఆ గురువూ, శిష్యులూ. విశ్వాన్నీ, సృష్టినీ, జీవితాన్నీ చక్కగా అర్థం చేసుకొనేవారు అటువంటి వారే కదా!

రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2021-03-12T05:42:59+05:30 IST