అదే ఉత్కంఠ ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-17T07:00:42+05:30 IST

రాళ్లు, కోడిగుడ్లు, టమాల దాడుల మధ్యే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన రెండో రోజు జిల్లాలో మంగళవారం కొనసాగింది. ఉత్కంఠతో కూడిన యుద్ధ వాతావరణంలో టీఆర్‌ఎస్‌ దాడులు, బీజేపీ కార్యకర్తల ప్రతిదాడుల మధ్య రణభూమిని తలపించింది. పెద్దఎత్తున మోహరించిన పోలీసులు ఇరు పార్టీల శ్రేణులను అదుపు చేయలేకపోయారు.

అదే ఉత్కంఠ ఉద్రిక్తత
చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్‌ ఐకేపీ కేంద్రం వద్ద మోహరించిన పోలీసులు

రెండోరోజూ సంజయ్‌ పర్యటన రణరంగం

టీఆర్‌ఎస్‌ శ్రేణుల  దాడి

ప్రతిదాడికి దిగిన బీజేపీ

అర్వపల్లిలో భయానక పరిస్థితి

పోలీసులనూ వదలని వైనం

ముగిసిన బండి సంజయ్‌ పర్యటన



(చివ్వెంల/ఆత్మకూర్‌(ఎస్‌)/అర్వపల్లి /తిరుమలగిరి) : రాళ్లు, కోడిగుడ్లు, టమాల దాడుల మధ్యే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన రెండో రోజు జిల్లాలో మంగళవారం కొనసాగింది. ఉత్కంఠతో కూడిన యుద్ధ వాతావరణంలో టీఆర్‌ఎస్‌ దాడులు, బీజేపీ కార్యకర్తల ప్రతిదాడుల మధ్య రణభూమిని తలపించింది. పెద్దఎత్తున మోహరించిన పోలీసులు ఇరు పార్టీల శ్రేణులను అదుపు చేయలేకపోయారు. వారు చూస్తుండగానే కర్రలు, రాళ్లు, చెప్పులు గాలిలో తేలుతూ ప్రత్యర్థులపై పడ్డాయి. వారిస్తున్న పోలీసులపై కూడా అర్వపల్లిలో దాడికి దిగారు. కనిపించిన ప్రతీ కార్యకర్తపైనా కర్రలతో విచక్షణరహితంగా దాడికి దిగడంతో గ్రామస్థులు సైతం భయాందోళనకు గురయ్యా రు. బండి సంజయ్‌ పర్యటన చివ్వెంల మండలంతో మొదలై రాత్రి తిరుమలగిరికి చేరే వరకూ ఆద్యంతం ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య సాగింది.  సుమారు తొమ్మిది గంటల పాటు సంజయ్‌ పర్యటించిన ప్రాంతాల్లో, మండలాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. 



జిల్లాలో అక్కడా, ఇక్కడా అని కాదు... ఎక్కడికెళ్లినా బండి సంజయ్‌ పర్యటనను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నమే చేశారు. పెద్దసంఖ్యలో చేరిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు కట్టడి చేయలేదు. దీంతో వారు బీజేపీ శ్రేణులపై దాడులు పాల్పడుతుండటంతో బీజేపీ నేతల సైతం ప్రతిదాడికి దిగారు. చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్‌ స్టేజీ వద్దకు టీఆర్‌ఎస్‌ నాయకులు ఆటోలో కర్రలను తరలించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ అందులో కొన్ని టీఆర్‌ఎస్‌ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. బీజే పీ నాయకులకు చెప్పులు చూపిస్తూ, రాళ్లు, కోడిగుడ్లు విసిరి, నినాదాలతో హోరెత్తించారు. దీంతో వారు సైతం ప్రతిగా నినాదాలు చేస్తూ దాడికి దిగా రు. బండి సంజయ్‌ ఐకేపీ కేంద్రానికి చేరుకున్నప్పటికే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏవైపున ఏంజరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీంతో భారీ బందోబస్తు మధ్య రైతుల వద్దకు సంజయ్‌ను తీసుకెళ్లి పోలీసులు మాట్లాడించారు. అక్కడి నుంచి లక్ష్మణ్‌నాయక్‌తండా, ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రానికి వెళ్లినా అక్కడే అదే పరిస్థితి నెలకొంది. ఇరుపార్టీల శ్రేణులు రాళ్ల వర్షం కురిపిస్తుండటంతో అరగంట వాహనంలో సంజయ్‌ ఉండిపోయారు. ఉద్రిక్తత మధ్యే రైతులతో సంజయ్‌ ముచ్చటించారు. అటు నుంచి నెమ్మికల్‌ ఐకేపీకి వెళ్లినప్పటికీ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అడ్డగింత తప్పలేదు. 


ఆ రెండు గంటలు మాత్రమే ప్రశాంతం

జిల్లా కేంద్రం నుంచి 11 గంటలకు బయలుదేరిన బండి సంజయ్‌ పర్యటన తిరుమలగిరి పట్టణంలో 8.30కి ముగిసే వరకూ సుమారు పది గంటల పాటు సాగింది. ఇందులో ప్రతిచోటా అడ్డగింతలు ఎదురైనప్పటికీ నెమ్మికల్‌ నుంచి తిరుమలగిరికి ముందుగా అనుకున్న మార్గం నుంచి కాకుండా వేరే దారిలో సంజయ్‌ ప్రయాణం సాగింది. నెమ్మికల్‌ నుంచి కందగట్ల, అర్వపల్లి, నాగారం మీదుగా తిరుమలగిరికి చేరాల్సి ఉండగా, దారి మళ్లించి నెమ్మికల్‌ నుంచి నూతనకల్‌, మద్దిరాల, తుంగతుర్తి, నాగారం మీదుగా తిరుమలగిరికి తీసుకెళ్లారు. రెండు గంటల పాటు సాగిన 50 కిలోమీటర్ల మార్గంలో ఎవరూ ఆయన్ను అడ్డుకోకపోవడంతో ప్రశాంతంగా నెలకొంది. ఆ మార్గంలో ఆయన పర్యటన ఉంటుందని తెలియని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అప్పటికే అర్వపల్లికి చేరుకున్నారు. దీంతో అడ్డగించే వారూ ఎవరూ లేకుండా పోయారు. 


తిరుమలగిరిలో రాస్తారోకో

బండి సంజయ్‌ పర్యటనలో చివరి ప్రాంతమైన తిరుమలగిరిలో టీఆర్‌ఎస్‌ నాయకులు చౌరస్తాలో సంజయ్‌ గోబ్యాక్‌ అంటూ రాస్తారోకో చేశారు. అయితే పట్టణానికి కిలోమీటరు దూరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లోనే సంజయ్‌ సమావేశాన్ని ముగించారు. అక్కడ కూడా టీఆర్‌ఎస్‌ నాయకులు మూడు కా ర్ల అద్దాలను ధ్వంసం చేశారు. అదేవిధంగా తమ నాయకులపై, వారి వాహ నాలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు, నాయకు లు నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు. ఇదిలా ఉండగా ఐకేపీని సందర్శించకుండానే బండి సంజయ్‌ తిరుమలగిరి నుంచి అర్వపల్లి, నకిరేకల్‌ మీదుగా హైదరాబాద్‌కు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బయలుదేరారు. 


భయాందోళనకు గురైన అర్వపల్లి వాసులు

బండి సంజయ్‌ పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు అర్వపల్లి మండల కేంద్రానికి నూతన్‌కల్‌, మద్దిరాల, తుంగతుర్తి, నాగారం మండలాల కు చెందిన వేలాదిగా ఉదయం 11 గంటలకే చేరుకున్నాయి. అక్కడికి వచ్చిన బీజేపీ నేతలను తరిమితరిమి కొట్టారు. బీజేపీ కండువా కప్పుకున్న నాయకు లు, వాహనాలపై రాళ్లు, కోడిగుడ్లు, కర్రలతో దాడులకు దిగుతుండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు వెంట ఉన్న మూడు కార్ల అద్దాలను పగులగొట్టి ధ్వం సం చేశారు. వారించిన పోలీసులను సైతం టీఆర్‌ఎస్‌ నేతలు వదలకుండా దాడి చేశారు. బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్ర య్య వాహనాన్ని ధ్వంసం చేశారు.కార్లను ధ్వం సం చేసిన వారిని అరెస్టు చేయా లంటూ బీజేపీ రాష్ట్ర నాయకుడు కడియం రామచంద్రయ్య ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. 


వాళ్లు రైతులేనా? : సంజయ్‌

చివ్వెంల : వట్టిఖమ్మంపహాడ్‌ ఐకేపీ కేంద్రానికి బండి సంజయ్‌ వచ్చిన సందర్భంలో ఆయన్ను అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న రైతు యల్క నర్సిరెడ్డితో సంజయ్‌ మాట్లాడారు. నన్ను అడ్డుకోవడానికి వచ్చిన వారు రైతులేనా అని అడిగారు. వారు రైతులు కాదని; టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజా ప్రతినిదులని నర్సిరెడ్డి జవాబిచ్చాడు. 


 పది కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్‌

బండి సంజయ్‌ పర్యటనతో ముందస్తుగా ఖమ్మం-సూర్యాపేట రహదారిపై వాహనాలను పోలీసులు నిలిపేశారు. దీంతో 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. యాత్ర ముగిసిన తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అప్పటి వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


ఇక్కడే పండుగలు ముగిశాయి

ఆత్మకూర్‌(ఎస్‌): ధాన్యం తీసుకువచ్చి చాలా రోజులైందని, దసరా, దీపావళి పండుగలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే జరుపుకున్నామని నెమ్మికల్‌ ఐకేపీ కేంద్రం వద్ద విసవరపు సువర్ణ తన ఆవేదనను బండి సంజయ్‌తో చెప్పుకున్నారు. తన కూతురు ఫీజు కట్టాల్సి ఉండగా ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని  గొట్టిముక్కల శైలజ, ధాన్యం విక్రయానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉప్పుల గంగమ్మ అన్నారు. 


కొర్లపహాడ్‌  టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు

 కేతేపల్లి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బస చేయడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. బీజేపీ తలపెట్టిన చలో సూర్యాపేటకు కార్యకర్తలు తరలివెళ్లకుండ కట్టడి చేయడానికి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ వైపు నుంచి విజయవాడ వెళ్లే దారిలో కార్లు, మినీ బస్సులను తనిఖీ అనంతరం పంపించారు. సాయంత్రం నాలుగుగంటల వరకు తనిఖీలు కొనసాగాయి. సంజయ్‌ కాన్వాయ్‌ సూర్యాపేట నుంచి తిరుమ లగిరికి వెళ్లిందన్న సమాచారంతో తనిఖీలు నిలిపేశారు. అప్పటివరకు అదుపులోకి తీసుకున్న వారిని వదిలి వేశారు. 


 కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందా? లేదా? : మంత్రి జగదీ్‌షరెడ్డి

నల్లగొండ : రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అన్న విషయాన్ని తక్షణమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేయాలని మంత్రి జగదీ్‌షరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేర కు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బండి సంజయ్‌ వెంట వచ్చిన గూండాల దాడి పాశవికమైనది అన్నారు. బీజేపీ గూండాయిజం భూస్వామ్యదాడులను మరిపించే పద్ధతిలో ఉందన్నారు. సంజయ్‌ రెండవ రోజు పర్యటనలో కూడా గూండాలతో రైతుల మీద దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అని బీజేపీ నేతలను ప్రశ్నించినందుకే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. బీజేపీ గూండాల దాడులను తిప్పికొట్టిన ఉమ్మడి జిల్లా రైతాంగానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట జిల్లా చైతన్యాన్ని మరోమారు చాటిన మహిళా రైతులను అభినందించారు. 


శాంతిభద్రతలు క్షీణించాయి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

సూర్యాపేట, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో శాంతి భద్ర తలు క్షీణించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.  రైతుల కోసం ఏ దాడు లనైనా భరిస్తానని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసం, చివ్వెంల, ఆత్మ కూర్‌(ఎస్‌) మండలాల పర్యటనలో సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు.  రైతులకు రుణామాఫీ చేస్తానన్న కేసీఆర్‌ నేటికీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. ఫసల్‌ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం దారుణమన్నారు. మాపై దాడులకు స్కెచ్‌ వేసినప్పుడే సీఎం కేసీఆర్‌ కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయ్యిందని, అవినీతి చిట్టా తీసి సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను జైల్‌కు పంపిస్తామన్నారు. తన పర్యటనపై టీఆర్‌ఎస్‌ నాయకులు దౌర్జన్యకాండ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడులను సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. రైతులను తన్నించినా సిద్ధిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కాళ్ళు మొక్కిన కలెక్టర్‌కు ఎమ్మెల్సీ ఇస్తావా; ఇంతకన్న దౌర్భాగ్యం మరొకటి లేదని అన్నారు. సీఎం కేసీఆర్‌, తన ఫాంహౌజ్‌లో ఏఏ పంటలు పండిస్తారో తెలపాలని అన్నారు. వానాకాలం పంట కొనేవరకు సీఎంను విడిచిపెట్టిదిలేదన్నారు.  

Updated Date - 2021-11-17T07:00:42+05:30 IST