ప్రాణం తీసిన ఇసుక మాఫియా గుంత

ABN , First Publish Date - 2022-01-22T05:56:32+05:30 IST

పదకొండేళ్లుగా తెలిసిన బాట... పొలానికి వెళ్లేందుకు వాగు దాటాలన్నా ఎటువంటి జంకులేదు.

ప్రాణం తీసిన ఇసుక మాఫియా గుంత
వీరబోయిన పూలమ్మ(ఫైల్‌)

 వాగు దాటుతూ అందులో పడిన మహిళా రైతు

 ఏళ్లుగా కొనసాగుతున్న ఇసుక దందా

 ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు

 సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌)లో ఘటన

ఆత్మకూరు(ఎస్‌), జనవరి 21: పదకొండేళ్లుగా తెలిసిన బాట... పొలానికి వెళ్లేందుకు వాగు దాటాలన్నా ఎటువంటి జంకులేదు. ఆ నమ్మకంతోనే వాగు దాటుతూ ఓ మహిళా రైతు తన ప్రాణాలు పోగొట్టుకుంది. వాగులో ఇసుక తవ్వేందుకు అక్రమార్కులు చేసిన దందా ఆమెను బలి తీసుకుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలంలోని మక్తాకొత్తగూడెం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మక్తాకొత్తగూడెం గ్రామం ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉంటుంది. అదేవిధంగా గ్రామ సమీపంలో పాలేరు వాగు ప్రవహిస్తుంటుంది. గ్రామానికి చెందిన వీరబోయిన సత్తయ్య, పూలమ్మ(34) దంపతులకు రెండు ఎకరాల పొలం అర కిలోమీటరు దూరంలో వాగు అవతల ఖమ్మం జిల్లా కాకరవాయి గ్రామశివారులో ఉంది. ప్రతి రోజూ పొలం వద్దకు వెళ్లేందుకు వాగు దాటాల్సి ఉంటుంది. ఒక వేళ వాగు నుంచి కాకుండా వెళ్లాలంటే ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటీవల ఇసుక మాఫియా ఇసుక కోసం వాగులో విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టటంతో పలుచోట్ల కందకాలు ఏర్పడ్డాయి. ఇటీవలి వర్షాలకు వాగులో నీటి ప్రవాహం పెరిగింది. 

పొలంలో నాట్లు వేసేందుకు వెళుతూ

పూలమ్మ తన స్వగ్రామం మహబూబాబాద్‌ జిల్లా ముడుపుగల్లు గ్రామం నుంచి తెచ్చిన వరి నారును శుక్రవారం ఉదయం వాగు దాటి తీసుకెళ్లి పొలం వద్ద ఉంచి ఇంటికి తిరిగివచ్చింది. నాట్లు వేసేందుకు కూలీలను పొలానికి పంపి భోజనం సిద్ధం చేసుకుని తాను బయలుదేరింది. వాగు మధ్యలోకి వెళుతూ రోజూ నడిచే దారి కాకుండా నీటి ప్రవాహం తక్కువగా ఉన్న దారిలో నడుస్తూ గుంతలోకి జారి పడింది. సమీపంలో తాటిచెట్టుపై ఉన్న గీత కార్మికుడు చామకూరి అంజయ్య నీటిగుంతలో పూలమ్మ పడిపోవడాన్ని గమనించి; చెట్టు దిగి వెళ్లి కాపాడేలోపు ఆమె మృతి చెందింది. పూలమ్మ భర్త సత్తయ్య గొర్లకాపరిగా కాగా రెండు ఎకరాల భూమిని కూలీల సహాయంతో పూలమ్మ సాగు చేస్తుంది. కుమారులు ఆరో తరగతి, నాలుగో తరగతి చదువుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఆర్‌ఐ రమేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపారు. 

యథేచ్ఛగా ఇసుక దందా 

ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని పాలేరు వాగు ఖమ్మం జిల్లా సరిహద్దు వరకు ప్రవహిస్తూ ఉంది. దీంతో ఇక్కడ ఏళ్ల తరబడి ఇసుక దందా కొనసాగుతోంది. ఇటీవలి వర్షాలకు వాగులో నీటి ప్రవాహం పెరిగి ఇటువైపు రైతులు వాగు అవతల ఉన్న పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో వాగు మోకాళ్ల లోపు ప్రవహించినా ధైర్యంగా దాటేవారు. ఇటీవల ఇసుక మాఫియా విచ్చలవిడిగా ఇసుక కోసం తవ్వకాలు చేపట్టడంతో చిన్నపాటి వరద ఉన్నా వాగు దాటాలంటే స్థానికులు జంకుతున్నారు. రోజూ ఇక్కడి నుంచే వెళ్తున్నా ఏ రాత్రి ఇసుక మాఫియా చేపడుతున్న తవ్వకాలతో ఎక్కడ లోతు ఉందో, ఎక్కడ గుంతలు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇసుక అక్రమ తరలింపుపై తరుచూ ముక్కుడుదేవులపల్లి, రామన్నగూడెం, పాతర్లపహాడ్‌, మక్తాకొత్తగూడెం గ్రామాల రైతులు, ప్రజలు, మండల, జిల్లా స్థాయిలో అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. చివరికి ఇసుక దందా తమ ప్రాణాల మీదికి తెస్తుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.



Updated Date - 2022-01-22T05:56:32+05:30 IST