నేటి నుంచే సచివాలయ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-20T09:20:02+05:30 IST

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఆదివారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

నేటి నుంచే సచివాలయ పరీక్షలు

పోస్టులు 1,585

అభ్యర్థులు 1,50,441

పరీక్ష కేంద్రాలు 277

తొలి రోజు 95 వేల మంది హాజరు

ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఏర్పాటు

రెండు గంటలు ముందు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని కలెక్టర్‌ సూచన


విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఆదివారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 1,585 పోస్టులకుగాను 1,50,441 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 277 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.


తొలిరోజు ఆదివారం ఉదయం జరిగే పరీక్షకు 73,246 మంది, మధ్యాహ్నం 21,297 మంది హాజరుకానున్నందున యంత్రాంగం విస్తృత ఏర్పాట్లుచేసింది. ఈ పరీక్షల నిర్వహణకు జీవీఎంసీ పరిధిలో కమిషనన్‌ సృజన, అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్‌లకు జేసీ వేణుగోపాల్‌రెడ్డి, పాడేరుకు ఐటీడీఎ పీవో వెంకటేశ్వర్లు నోడల్‌ అధికారులుగా ఉంటారు. ఇంకా 6,344 మందిని ఇన్విజిలేటర్లుగా, 2,200 మందిని చీఫ్‌ సూపరింటెండెంట్లుగా నియమించారు. 


అభ్యర్థులు రెండు గంటల ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ కోరారు. ముప్పావు గంట ముందు పరీక్ష హాలులోనికి అనుమతిస్తామన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బందిని నియమిస్తున్నారు. కొవిడ్‌ బారినపడిన అభ్యర్థులు పరీక్ష రాసే గదుల్లో ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు.


కాగా గ్రామీణ ప్రాంతంలో పరీక్షలకు అవసరమైన బందోబస్తు ఏర్పాటుచేసినట్టు ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సిద్ధం చేసింది.

Updated Date - 2020-09-20T09:20:02+05:30 IST