భూ మాయ

ABN , First Publish Date - 2020-06-06T11:20:54+05:30 IST

ఇప్పటికే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌ అదనపు భూముల కబ్జాపర్వం ఒక్కొక్కటిగా బయటపడుతున్న క్రమంలోనే మరో అక్రమభూ

భూ మాయ

నిర్మల్‌ జిల్లాలో ‘కాళేశ్వరం’ భూముల కబ్జా 

పరిహారం పొందిన భూమిపై పంజా  

28వ నంబర్‌ హైలేవల్‌ కాలువ భూ బాగోతం 

రెండోసారి తప్పుడు రిజిస్ర్టేషన్‌లు 

ఓ ప్రముఖ రాజకీయ నేత పుత్రుడి నిర్వాకం 

పోలీసులకు ఫిర్యాదు చేసిన ముథోల్‌ తహసీల్దార్‌ 


నిర్మల్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఇప్పటికే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌ అదనపు భూముల కబ్జాపర్వం ఒక్కొక్కటిగా బయటపడుతున్న క్రమంలోనే మరో అక్రమభూ భాగోతం వెలుగుచూసింది. ఈ భూ బాగోతానికి సూత్రధారి ముథోల్‌ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ నేత పుత్రుడికి సంబంధించిన సర్వేనంబర్‌ 62లోని 3ఎకరాల 2గుంటల భూమిని గతంలో కాళేశ్వరం హైలెవల్‌ కాలువ కోసం సేకరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ. 8,32,132లను నష్టపరిహారం కింద పొందారు. ఈయనతో పాటు నిజామాబాద్‌కు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి సర్వే నంబర్‌ 82కు చెందిన 8 గుంటల భూమిని కూడా హైలెవల్‌ కాలువ కోసం ప్రభుత్వానికి ఇచ్చారు. ఇతను కూడా రూ. 2,59,201లను పరిహారంగా పొందారు. ఇలా డబ్బులు తీసు కున్న ఈ ఇద్దరు వ్యక్తులు తిరిగి ఇదే సర్వేనంబర్‌లోని 3 ఎకరాల 10 గుంటల భూమిని వాయిదూద్‌ సోలార్‌ కంపెనీకి అమ్ముకున్నారు.


అలాగే ఈ కంపెనీ యజమానులకు సంబంధిత భూములను రిజిస్ర్టేషన్‌ చేసి కూడా ఇచ్చారు. ఈ తతంగమంతా 2016లో దర్జాగా జరిగింది. తీగలాగితే డొంక కదలిన చందంగా గత కొద్దిరోజుల నుంచి ప్రాజెక్ట్‌లు, చెరువులు , కాలువల భూముల ఆక్రమణపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావులు ఈ తతంగాన్ని బయటకు తీశారు. వెంటనే దీనిపై అదనపు కలెక్టర్‌ సంబంధిత ఇరిగేషన్‌ అధికారులతో మాట్లా డి పూర్తి వివరాలు సేకరించారు. ప్రస్తుతం హైలెవల్‌ కాలువల పర్యవేక్షణ చూస్తున్న కడెం ఈఈ ద్వారా సర్వేనంబర్‌ 62 లోని 3ఎకరాల 2గుంటలు, అలాగే సర్వేనంబర్‌ 82 లోని 8గుంటల భూమి వివరాలపై ఆరా తీశారు. దీంతో పూర్తి నివేదికను తీసుకున్న అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు ప్రాథమిక విచారణ జరిపించాల్సిందిగా ముథోల్‌ తహసీల్దార్‌ను ఆదేశించారు. తహసీల్దార్‌ విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. పరిహారం పొందిన భూమికి అప్పటి రెవెన్యూ అధికారులు భూ బదలాయింపు దృవీకరణతో పాటు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేశారు.


అధికారులు తాము సేకరించిన ఓ ప్రైవేటుభూమికి పరిహారం చెల్లించి కూడా ఆ భూమిని రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే దీని వెనక ఎంత పెద్ద మతలబు జరిగిందోనన్న ప్రచారం మొదలైంది. అధికారుల నిర్లక్ష్యం, చూసిచూడనట్లు వ్యవహరించడం అలాగే లంచాల వ్యవహారం లాంటి అంశాలన్నీ ఇలా భూ ఆక్రమణలకు దర్జాగా తావిస్తున్నాయన్న విమర్శలున్నా యి. కొంత రాజకీయ పలుకుబడి, పరపతి ఉంటే ఎలాంటి భూమినైనా ఆక్రమించుకునేందుకు మార్గం ఏర్పడుతుందని ఈ నిర్వాహకం ముథోల్‌ నియోజకవర్గంలో ప్రాజెక్ట్‌, కాలువల భూములను లక్ష్యంగా చేసుకొని గత కొంతకాలం నుంచి సాగుతుందన్న ఫిర్యాదులున్నాయి. 


పోలీసులకు డబుల్‌ రిజిస్ట్రేషన్‌లపై తహసీల్దార్‌ ఫిర్యాదు

ముథోల్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 62లో గల 3ఎకరాల2గుంటలకు భూమికి సంబంధించిన స్వీప్ట్‌ అగ్రిటెక్‌ యజమాని సంధీప్‌పవార్‌పైనా, అలాగే సర్వే నంబర్‌ 82 పరిధిలోని 8గుంటల భూమికి సంబంధించిన యజమాని పురుషోత్తంపైనా ముథోల్‌ తహసీల్దార్‌ పోలీసులకు ఈ నెల 4వ తేదీన ఫిర్యాదు చేశారు. కడెం ప్రాజెక్ట్‌ ఈఈ రిఫరెన్స్‌తో తహసీల్దార్‌ ఈ ఫిర్యాదును పోలీసులకు అందించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరా రు. సందీప్‌పవార్‌, పురుషోత్తం అనే వ్యక్తులు వాయిదూద్‌ సోలార్‌ కంపెనీకి పరిహారం పొందిన హైలేవల్‌ కాలువ భూమిని తిరిగి విక్రయించారని తహసీల్దార్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటు ప్రాజెక్ట్‌ అధికారులు, అటు రెవెన్యూ అధి కారులు దీనిపై పూర్తిగా విచారణ జరిపి పరిహారానికి సంబంధించిన చెక్‌నంబర్‌లను సైతం వెల్లడించారు. పూర్తి ఆధారాలతో తహసీల్దార్‌ పోలీసులకు ఈ ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు చేయడంతో నేడో రేపో ఆ ఇద్దరిపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. 


పథకం ప్రకారమే..

కాగా రాజకీయ పలుకుబడి, పరపతితోనే ఈ అక్రమ తతంగం కొనసాగిందన్న ఆరోపణలున్నాయి. పలుకుబడి, ప రపతి గల సందీప్‌పవార్‌ తన 3ఎకరాల 2గుంటల భూమికి రూ. 8,32,132 లక్షలను బ్యాంకుచెక్కు ద్వారా పరిహారంగా తీసుకున్నారు. ఈయనతో పాటు పురుషోత్తం అనే వ్యక్తి కూడా 8గుంటల భూమికి సంబందించి రూ.2,59,201 లక్షలను ఇదే పద్దతిలో పరిహారంగా దక్కించుకున్నారు. అయితే ఇలా పరిహారం పొందడంతో ఈ భూములపై వీరిద్దరు హక్కులు కోల్పోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల తరువాత వీరు పథకం ప్రకారం వాయిదూద్‌ సోలార్‌ కంపెనీకి ఈ భూములను తిరిగి అమ్మేందుకు పథకం సిద్ధం చేశారు. ముథోల్‌ నియోజకవర్గానికి చెందిన ప్రముఖవ్యక్తి ఈ భూములకు యజమాని కావడంతో వాయిదూద్‌ సోలార్‌ కంపెనీ యాజమాన్యం గుడ్డిగా నమ్మేసింది.


అలాగే రికార్డులను సైతం సదరు పెద్ద మనిషి తారుమారు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇలా వాయుదూద్‌ సోలార్‌ కంపెనీ యజమాన్యం ఈ బడా వ్యక్తులను నమ్మి భూమిని కొనుగోలు చేసింది. 2016లో ఈ వ్యవహారమంతా జరిగినప్పటికి నాలుగేళ్ల వరకు గుట్టురట్టు కాలేదు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు ఈ తతంగంపై విచారణ జరపడంతో అసలు రంగు బయటపడింది. దీనిపై ఎలాంటి పరిణామాలు, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు చోటు చేసుకుంటాయోననే అంశమే ప్రస్తు తం ముథోల్‌ నియోజకవర్గంలో హాట్‌టాఫిక్‌గా మారుతోంది. 


పరిహారం పొందిన భూములపై పట్టింపు కరువు

సంబంధిత ఇరిగేషన్‌ శాఖ అధికారుల నిర్వాహకం కారణంగా ప్రాజెక్ట్‌లు, చెరువులు, కాలువల భూముల రికార్డులు సక్రమంగా అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రాజెక్ట్‌లు, కాలువలు, చెరువుల కోసం లక్షల రూపాయల్లో పరిహారం చెల్లించి పెద్ద ఎత్తున భూములను సేకరిస్తున్నారు. అయితే ఇలా సేకరించిన భూములను మాత్రం సక్రమంగా అధికారులు కాపాడుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. సేకరించిన భూములను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయకపోవడం, మ్యూటేషన్‌లు అలాగే ఆ భూములపై నిఘా లాంటి చర్యలు తీసుకోకపోవడం ఆక్ర మణదారులకు వరంగా మారుతోంది. ముథోల్‌ నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ హద్దులు దాటిపోయిందన్న ఆరోపణలున్నాయి. పరిహారం చెల్లించిన భూములకు మ్యూటేషన్‌లు ఎప్పటికప్పుడు జరగకపోవడంతో ఆక్రమణదారులు ఏకంగా ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ అదనపు భూములను ఇప్పటికే పెద్ద ఎత్తున కబ్జా చేసిన సంగతి తెలిసిందే.


దీని వెనక పలువురు రాజకీయ ప్రముఖులు అలాగే కొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సారెస్పీ భూములను రక్షించుకోవడంలో సంబందిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు తలెత్తుతున్న క్రమంలోనే మరోసారి ఇదే ప్రాజెక్ట్‌కు సంబందించిన హైలెవల్‌ కాలువల భూములు సైతం రికార్డులు సక్రమంగా లేని కారణంగా ఆక్రమణలకు గురవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


అక్రమార్కులపై కఠినచర్యలు : ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, కలెక్టర్‌, నిర్మల్‌ జిల్లా 

ముథోల్‌ నియోజకవర్గంలో చేపడుతున్న ప్యాకేజీ నంబర్‌ 28వ కింద పరిహారం పొందిన భూములనే సదరు రైతులు మళ్లీ ఇతర ప్రైవేటు సంస్థలకు రిజిస్ర్టేషన్‌ చేయించిన మాట వాస్తవమేనన్నారు. డబుల్‌ రిజిస్ర్టేషన్‌ వ్యవహారంలో సదరు వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్యాకేజీ నంబర్‌ 28వ కింద సేకరించిన భూములను కూడా త్వరలో స్వాధీనం చేసుకొని పనులు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. 

Updated Date - 2020-06-06T11:20:54+05:30 IST