విలీనమైతే.. కష్టమే!

ABN , First Publish Date - 2021-08-20T05:01:27+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. నూతన విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు దూరంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు విలీనం కానున్నాయి. జిల్లాలో 437 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలకు కిలోమీటరు దూరంలో ఉన్నట్టు స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రాల విలీనంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

విలీనమైతే.. కష్టమే!
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు

-  జిల్లాలో 437 అంగన్‌వాడీ కేంద్రాలకు మంగళం

- పాఠశాలల్లో కలిపేందుకు రంగం సిద్ధం

- తల్లిదండ్రుల్లో ఆందోళన

- దూరంలో ఉన్న బడులకు చిన్నారులు ఎలా వెళ్తారని సందేహం 

- గర్భిణులు, బాలింతలది ఇదే పరిస్థితి 

(ఇచ్ఛాపురం)

ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. నూతన విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు దూరంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు విలీనం కానున్నాయి. జిల్లాలో 437 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలకు కిలోమీటరు దూరంలో ఉన్నట్టు స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రాల విలీనంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.  ప్రాఽథమిక పాఠశాలల్లో కేంద్రాలను విలీనం చేస్తే పిల్లలు ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నా, నిర్వహణపై తల్లిదండ్రుల్లో అపోహలు నెలకొన్నాయి. చిన్నారులు ఆటపాటలకు దూరమయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నివాసాలకు దగ్గర ఉన్న కేంద్రాలను తరలించడం వల్ల గర్భిణులు, బాలింతలకు కూడా అవస్థలు తప్పవని పేర్కొంటున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలను ఎత్తివేయడం సరికాదంటున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యను బలోపేతం చేస్తామన్న ప్రభుత్వ మాటలకు.. చేపడుతున్న చర్యలకు పొంతన లేకుండా పోతోందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. 


సందేహాలు ఎన్నో.. 

జిల్లాలో 4,192 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అద్దె భవనాల్లో 1,718 కేంద్రాలు, సొంత భవనాల్లో 1,216 కేంద్రాలు, కమ్యూనిటీ, ప్రభుత్వ భవనాల్లో 1,258 కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో ప్రస్తుతం బాలింతలు, గర్భిణులు 36,644 మంది, ఏడు నెలల నుంచి మూడేళ్ల చిన్నారులు 85,993 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 65,796 మంది ఉన్నారు. చిన్నారులకు బోధనతో పాటు గర్భిణులు, బాలింతలకు ఈ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా 437 అంగన్‌వాడీ కేంద్రాలు సమీప పాఠశాలల్లో విలీనం కానున్నాయి. ఈ కేంద్రాలను ప్రీప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2గా పేరు మార్చనున్నారు. పాఠశాలలకు దూరంగా ఉండే కేంద్రాలకు శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లుగా పేరు మార్చనున్నారు. పాఠశాలల్లో నిర్వహించే ప్రీప్రైమరీ కేంద్రాల నిర్వహణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ చూడనుంది. బోధనకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ వసతులు సమకూర్చి పర్యవేక్షించనుంది. మరోవైపు ఈ చర్యలపై ఉపాధ్యాయులు సైతం పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో 1, 2 తరగతులకు సంబంధించి సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు (ఎస్‌జీటీలు) ఉన్నారు. వీరు పాఠశాల విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్నారు. కొత్తగా ప్రీ ప్రైమరీ-1, ప్రీప్రైమరీ-2కు సంబంధించి అంగన్‌వాడీ టీచర్లు బోధించనున్నారు. వీరు మాత్రం ఐసీడీఎస్‌ పర్యవేక్షణలో విధులు నిర్వహించనున్నారు. ఇది భవిష్యత్‌లో ఇబ్బంది కాగలదని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అంగన్‌వాడీ సిబ్బంది సేవలను కొనసాగిస్తారా? కొత్త నియామకాలు చేపడతారా? అన్న అనుమానం కలుగుతోంది. కేంద్రాలు మూతపడితే బాలింతలు, గర్భిణులకు పోషకాహారం ఎలా అందజేస్తారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పాఠశాలలకు లబ్ధిదారులు వెళ్లి.. పౌష్టికాహారం తీసుకోవడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.  ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. 


సర్దుబాటు కష్టమే..

ఇప్పటికీ చాలా పాఠశాలల్లో తొలి విడత ’నాడు-నేడు‘ పనులు జరుగుతున్నాయి. తాజాగా రెండో విడత ప్రక్రియలో భాగంగా మరికొన్ని పాఠశాలల్లో పనులు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో తెరపైకి వచ్చిన అంగన్‌వాడీ కేంద్రాల విలీన ప్రక్రియ విద్యాశాఖకు భారంగా పరిణమించింది. వారికి వసతి ఎలా సర్దుబాటు చేయాలో తెలియక పాఠశాలల హెచ్‌ఎంలు సతమతమవుతున్నారు. పర్యవేక్షణ బాధ్యతలు ఐసీడీఎస్‌ది..వసతులు సమకూర్చడం తామా అంటూ పాఠశాల విద్యాశాఖ అధికారులు పెదవి విరుస్తున్నారు. 


విలీన కేంద్రాల నుంచే పోషకాహారం

ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి అంగన్‌డీ కేంద్రాల మ్యాపింగ్‌ పూర్తి చేశాం. విలీనం చేసిన కేంద్రాల నుంచే గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తాం. కేంద్రాలకు ఇళ్లు దూరంగా ఉండే గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కార్యకర్తలు పౌష్టికాహారం అందజేస్తారు. పాఠశాలల్లో ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తాం. కేంద్రాలకు దగ్గర ఉన్న పాఠశాలల్లో విలీనం అవుతుండడంతో సమస్య ఉత్పన్నం కాదు.

- జయదేవి, ఐసీడీఎస్‌ పీడీ, శ్రీకాకుళం

Updated Date - 2021-08-20T05:01:27+05:30 IST