ప్రతిష్టాత్మకం సీతమ్మసాగర్‌

ABN , First Publish Date - 2021-05-11T05:30:00+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో వ్యవసాయానికి సమృద్దిగా నీరందించేందుకు నిర్మిస్తున్న సీతమ్మసాగర్‌ బహుళార్ధక ప్రాజెక్ట్‌ ఎంతో ప్రతిష్టాత్మాకమైనదని,

ప్రతిష్టాత్మకం సీతమ్మసాగర్‌
సిఎంఓ కార్యదర్శి స్మితసబర్వాల్‌కు స్వాగతం పలుకుతున్న జిల్లా కలెక్టర్‌, అధికారులు

 నెలాఖారుకల్లా కాపర్‌ డ్యాం పనులు ప్రారంభించాలి

పనులను సమీక్షించిన సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ 

 కొత్తగూడెం/మణుగూరుటౌన్‌, మే 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో వ్యవసాయానికి సమృద్దిగా నీరందించేందుకు నిర్మిస్తున్న సీతమ్మసాగర్‌ బహుళార్ధక ప్రాజెక్ట్‌ ఎంతో ప్రతిష్టాత్మాకమైనదని, ఈ నెలాఖరులోగా కాపర్‌డ్యాం కాంక్రీట్‌ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సీతమ్మ సాగర్‌ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్‌ సీతారామ ఎత్తిపోతల పథకం, సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌ నిర్మాణ పనులపై మంగళవారం మణుగూరులోని సింగరేణి విశ్రాంతి భవనంలో జల వనరుల ఇంజనీరింగ్‌ అధికారులు, ఎల్‌ అండ్‌టీ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్మితాసబర్వాల్‌ మాట్లాడుతూ 36.57 టీఎంసీల నీటినిల్వ సామర్ధ్యంతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మించనున్నట్టు తెలిపారు. వ్యవసాయానికి సమృద్ధిగా సాగునీరందించేందుకు నీటి నిల్వ సామర్ధ్యం కోసం నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్ట్‌ పనులు యుద్ధ ప్రాతిపదిక చేపట్టాలని తెలిపారు. కొవిడ్‌ వల్ల పనులకు ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంట వేగవంతం చేయాలని ఆమె సూచించారు. సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌ ద్వారా రానున్న వ్యవసాయ సీజన్‌కు నీరందించే  విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వర్షాకాలంలో మెయిన్‌కెనాల్‌ ద్వారా సాగునీరిచ్చి అన్ని చెరువులు, కుంటలు నీటితో నింపనున్నట్టు తెలిపారు. బీజీ కొత్తూరు వద్ద సీతారామ ఎత్తిపోతల పథకానికి రెండు పంపు హౌస్‌ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని, నెలాఖరు వరకు 3వ పంపు హౌస్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. తరువాత డ్రైరన్‌ నిర్వహణకు సిద్ధం చేయాలన్నారు. పనుల్లో జాప్యం జరగకుండా షెడ్యూల్‌ ప్రకారం పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. సీతమ్మ సాగర్‌  ప్రాజెక్ట్‌కు రేడియల్‌ గేట్లతో బ్యారేజీని నిర్మించడం, బ్యారేజీకి రక్షణకు ఇరువైపులా గైడ్‌ బండ్ల ఏర్పాటుకు ప్రభుత్వ పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. కుడి గైడ్‌ బండ్‌కు 40.608, ఎడమ గైడ్‌ బండ్‌కు 55.822 కి.మీ. పొడవుతో వరద నీటిని సంరక్షణ చేసి బ్యారేజీ నుంచి సీతారామ ఎత్తిపోతల పథకానికి మళ్లించడానికి ప్రాజెక్ట్‌ ఏర్పాటు జరిగినట్లు తెలిపారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను సత్వరం పూర్తిచేసి ఇరిగేషన్‌ అధికారులకు భూమిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు వస్తే తక్షణం ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. సమావేశంలో భద్రాద్రి జిల్లా డాక్టర్‌ ఎంవీ. రెడ్డి, ఈఎస్‌సీ జనరల్‌ మురళీధర్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, సీఈలు శంకర్‌ నాయక్‌, శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈలు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆనంద్‌ కుమార్‌, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఎల్‌ అండ్‌ టీ జనరల్‌ మేనేజర్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T05:30:00+05:30 IST