ఇదేనా భరోసా?

ABN , First Publish Date - 2021-07-30T05:35:00+05:30 IST

‘అన్నదాతల కోసమే రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. విత్తనాలు, ఎరువులు, రసాయనాలు రైతుల ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తాం. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం. క్షేత్రస్థాయిలో సాగుకు సలహాలు, సూచనలు అందిస్తాం. మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వ్యయప్రయాసలకు గురికాకుండా ఆర్బీకేల ద్వారానే అన్ని సేవలు

ఇదేనా భరోసా?
మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచుకోని మెళియాపుట్టి ఆర్‌బీకే కార్యాలయం





రైతుభరోసా కేంద్రాల సేవలు అంతంతమాత్రం

పెదవి విరుస్తున్న అన్నదాతలు

‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో తేటతెల్లం


(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

‘అన్నదాతల కోసమే రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. విత్తనాలు, ఎరువులు, రసాయనాలు రైతుల ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తాం. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం. క్షేత్రస్థాయిలో సాగుకు సలహాలు, సూచనలు అందిస్తాం. మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వ్యయప్రయాసలకు గురికాకుండా ఆర్బీకేల ద్వారానే అన్ని సేవలు త్వరిగతిన అందిస్తాం’..అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఏడాదిన్నర కిందట సచివాలయం పరిధిలో రైతుభరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది.. ఇటీవలే 140 యంత్ర సేవా కేంద్రాలు, నాలుగు అగ్రిల్యాబ్‌లను ప్రారంభించింది. కానీ నెలలు గడుస్తున్నా సాంకేతిక సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు.. వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదు. నిబంధనలు ఒకవైపు, సాంకేతిక చిక్కులు ఒకవైపు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముందుగానే నగదు చెల్లిస్తేనే విత్తనాలు, ఎరువులను అందిస్తున్నారు. ఒకరిద్దరు రైతులు కాకుండా..పదుల సంఖ్యలో వెళ్లి నగదు చెల్లిస్తేనే విత్తనాలు తెప్పించి అందిస్తున్నారు. ఈక్రాప్‌, ఆధార్‌ సీడింగ్‌ వంటి విషయంలో కూడా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’ బృందం రైతుభరోసా కేంద్రాలను పరిశీలించగా ఎక్కడికక్కడే లోపాలు వెలుగుచూశాయి. 


ఆధార్‌ లింకు అగచాట్లు!

 ఎచ్చెర్ల రైతుభరోసా కేంద్రం వద్ద రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆధార్‌ లింకులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈక్రాప్‌ నమోదు సక్రమంగా జరగడం లేదు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి పరిశీలించే సమయంలో నేతింటి రాజారావు అనే రైతు ఆధార్‌ సమస్యపై అక్కడకు వచ్చాడు. ఆయన్ను పలకరించగా..రోజుల తరబడి సమస్యపై తిరుగుతున్నట్టు చెప్పాడు. భూమికి ఆధార్‌ అనుసంధానం కాకపోవడంతో ఈక్రాప్‌ నమోదు కావడం లేదని చెబుతున్నాడు. ఈక్రాప్‌ లేకపోతే ఎటువంటి రాయితీలు వర్తించవని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. వీఏఏ రేవతి దృష్టికి సమస్య తీసుకురాకాగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించనున్నట్టు చెప్పారు.


కానరాని సమయపాలన

 మెళియాపుట్టి రైతుభరోసా కేంద్రం గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచుకోలేదు. ఉదయం 10 గంటలకే కొందరు రైతులు వచ్చి సిబ్బంది లేకపోవడంతో వెనుదిరిగారు. అక్కడున్న రైతులను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించగా..ముందుగా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించిన వారికే విత్తనాలు, ఎరువులు అందిస్తున్నట్టు చెప్పారు. నగదు చెల్లింపులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


అన్నీ ప్రకటనలే..!

 పేరుకే రైతుభరోసా కేంద్రాలని..ఎటువంటి సేవలు కూడా అందించలేకపోతున్నాయని పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన రైతు మద్దిల రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కార్యాలయానికి వెళ్లి ఆధునిక వ్యవసాయ పరికరాల కోసం ఆరాతీస్తే అటువంటి ఏవీ లేవని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో ఆయన ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకొని అక్కడి నుంచి నిరాశతో వెనుదిరిగాడు. యంత్రాలు, పనిముట్లు వస్తాయని ఆశించానని..కానీ వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు కూడా బయట మార్కెట్‌ ధరలకే అందిస్తున్నారని రామారావు పెదవివిరిచాడు. 



Updated Date - 2021-07-30T05:35:00+05:30 IST