పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-10-22T05:02:15+05:30 IST

పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం

పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం
ఘట్‌కేసర్‌ : ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, విద్యార్థులు

  • ఎస్పీ నారాయణ 
  • పోలీసు అమరవీరులకు ఘన నివాళి
  • హాజరైన కలెక్టర్‌ నిఖిల, ఎమ్మెల్యే ఆనంద్‌


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) /ఘట్‌కేసర్‌: : దేశ, సమాజ రక్షణే కర్తవ్యంగా విధి నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన సాయుధ బలగాలు, పోలీసుల సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ ఎం.నారాయణ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఫ్లాగ్‌ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ నిఖిల, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా అమరులైన పోలీసులు, సైనికుల వివరాల పుస్తకాన్ని కలెక్టర్‌ నిఖిల ఆవిష్కరించి ఏఎస్పీ ఎంఏ రషీద్‌కు అందజేశారు. అనంతరం అమరవీరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ గతేడాది కాలంలో వీర మరణం పొందిన 377 మంది అమరులకు నివాళులర్పిస్తున్నామన్నారు. ప్రతిఏటా ఎంతోమంది పోలీసులు దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారని, ఎలాంటి సమయంలోనైనా మేమున్నామనే భరోసాను ప్రజలకు కల్పిస్తున్నారని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి మానవాళిని భయపెట్టిన సమయంలో పోలీసులు చూపి న తెగువ ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్‌ నిఖిల, ఎమ్మెల్యే ఆనంద్‌, ఎస్పీ నారాయణ, ఏఎస్పీ రషీద్‌, డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. పోలీసులు లేని సమాజాన్ని ఉహించడం  కష్టమని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని జంగయ్య యాదవ్‌ అన్నారు. గురువారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ కార్యాలయం నుంచి ప్రధాన రహదరి వరకు  ప్రజాప్రతినిధులు, పోలీసులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, ఉపాధ్యాయులు, నాయకులు, పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:02:15+05:30 IST