పోలీసు అమరుల సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2020-10-22T07:04:54+05:30 IST

ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు పోలీసు అమరులు చేసిన త్యాగాలు గొప్పవని, వారి సేవల్ని దేశం ఎన్నటికీ మరచిపోదని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం పోలీసు అమరుల

పోలీసు అమరుల సేవలు మరువలేనివి

 వారి త్యాగాల్ని దేశం మరువదు : సీఎం 

 రాష్ట్రంలో తగ్గిన నేరాలు : మహమూద్‌ అలీ

 సైబర్‌ నేరాల అదుపునకు చర్యలు : డీజీపీ

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు పోలీసు అమరులు చేసిన త్యాగాలు గొప్పవని, వారి సేవల్ని దేశం ఎన్నటికీ మరచిపోదని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం పోలీసు అమరుల సంస్మరణ దినం సందర్భంగా.. విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసు సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. అమరులు చూపిన ఉన్నతమైన ఆదర్శాలను పోలీసు బలగాలు స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని కోరారు. అమరుల కుటుంబ సభ్యుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు.


రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ తదితర కార్యక్రమాలను చేపడుతున్నామని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. ఎల్బీ ఇండోర్‌ స్టేడియంలో బుధవారం జరిగిన పోలీసు అమరుల సంస్మరణ సభలో.. అమరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నేరాల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు.


శాంతి, భద్రతల పరిరక్షణ కేవలం పోలీసులతోనే సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో పీపుల్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా మరణించిన 264 మంది పోలీసు అమరుల వివరాలతో కూడిన ‘‘అమరులు వారు’’ అనే పుస్తకాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు అమరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-10-22T07:04:54+05:30 IST