Advertisement
Advertisement
Abn logo
Advertisement

గ్రంథాలయాల్లో సమస్యల తిష్ఠ

- పఠనాసక్తి ఉన్నా...పట్టించుకునే వారేరి..?

- సిబ్బంది నామమాత్రం...నిధుల మంజూరులో జాప్యం

- అస్తవ్యస్తంగా నిర్వహణ

జగిత్యాల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): విజ్ఞాన నిలయాలుగా పేర్కొనే గ్రంథాలయాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పఠనాసక్తి ఉన్నప్పటికీ..పట్టించుకు నే వారు లేక  పాఠకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి విజ్ఞానం అందించేలా వీటిని అధునికీకరించాల్సిన అవసరముంది. పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సి ఉంది. అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయాలను పెంచకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల శిథిల భవనాలు, అద్దె భవనాల్లో నిర్వహిస్తుండడం, లైబ్రరీయన్‌లు సైతం సరిగా లేకపోవడంతో అటెండర్లతో నెట్టుకరావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

- జిల్లాలో 15 గ్రంఽథాలయాలు....

జిల్లాలో 15 గ్రంథాలయాలున్నాయి. బీర్‌పూర్‌, బుగ్గారం, జగిత్యాల రూరల్‌ మండలాల్లో గ్రంథాలయాలు లేవు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆద్వర్యంలో గ్రేడ్‌-2 గ్రంథాలయాలు 2, గ్రేడ్‌-3 గ్రంథాలయాలు 9, రికార్డు అసిస్టెంటు గ్రంథాలయాలు 2 నిర్వహిస్తున్నారు. అధికారులు గణాంకాల ప్రకారం.. జిల్లాలోని గ్రంథాలయాల్లో 1,71,737 పుస్తకాలున్నాయి. 10,360 మంది దరవాత్తు కలిగిన పాఠకులు సభ్యత్వం కలిగియున్నారు. 

- సొంత భవనాలు లేక ఇక్కట్లు..

జిల్లాలోని పలు గ్రంథాలయాలకు సొంత భవనాలు లేవు. పలు ప్రాంతాల్లో సొంత భవనాలున్నప్పటికీ శిథిలావస్థల్లో ఉన్నాయి. జిల్లాలో 5 గ్రంథాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రెండు గ్రంథాలయాలు అద్దెలేని ఇతర భవనాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 8 గ్రంథాలయాలు సొంత భవనాల్లో నడుస్తున్నాయి. జిల్లాలోని పెగడపల్లి, వెల్గటూరు, మేడిపల్లి, రాయికల్‌ మండలాల్లో గ్రంథలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొడిమ్యాల మండలంలో భవనానికి ఇటీవల ప్రభుత్వం రూ. 25 లక్షలు మంజూరు చేసింది. కోరుట్ల, మెట్‌పల్లి, పెగడపల్లిలలో కొత్త భవనాలకు నిర్మాణం కొనసాగుతోంది. సారంగపూర్‌లో సొంత భవనం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఉపయోగంలోకి రావడం లేదు. 

- అటెండర్లే దిక్కు..

జిల్లాలోని 15 గ్రంథాలయాల్లో కలిపి కేవలం నలుగురు మాత్రమే శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లాలో నలుగురు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ముగ్గురు పార్ట్‌ టైం వర్కర్లు పనిచేస్తున్నారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో 11 వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని పలు గ్రంథాలయాలు అటెండర్లతో పనిచేస్తున్నాయి. దీనికి తోడు ఒక్కో అటెండర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో రెండు, మూడు గ్రంథాలయాలకు కలిపి ఒక్క అటెండర్‌ పనిచేస్తున్నారు. మల్లాపూర్‌, మెట్‌పల్లి, కథలాపూర్‌లలో మాత్రమే రెగ్యూలర్‌ లైబ్రరీయన్‌లు పనిచేస్తున్నారు. పెగడపల్లిలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి పనిచేస్తున్నాడు. జిల్లాలోని మల్యాల, కొడిమ్యాల, సారంగపూర్‌లలో గ్రేడ్‌-3 లైబ్రరీయన్‌లు పనిచేయాల్సి ఉండగా అటెండర్‌ స్థాయి ఉద్యోగులయిన హెల్పర్‌లతో విధులు నిర్వహింపజేస్తున్నారు. వీరు సైతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సారంగపూర్‌లో పనిచేస్తున్న హెల్పర్‌కు ధర్మపురిలో అదనపు బాధ్యతలు, మల్యాల పనిచేస్తున్న హెల్పర్‌కు మేడిపల్లిలో అదనపు బాధ్యతలు అప్పగించారు. వెల్గటూరులో కేవలం పార్ట్‌ టైం వర్కర్‌ పనిచేస్తున్నారు. ధర్మపురి, రాయికల్‌, మల్యాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో రికార్డు అసిస్టెంట్‌ కేడర్‌ స్థాయి పోస్టులున్నప్పటికీ ఖాళీలు రాజ్యమేలుతున్నాయి. 

- పేరుకపోయిన సెస్సు బకాయిలు...

జిల్లాలోని గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాలు ఏటా వసూలు చేసే ఆస్థి పన్నులో 8 శాతం గ్రంథాలయ సెస్సును చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిధులను జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాకు జమ చేయాల్సి ఉంది. యేటా ఈ ప్రక్రియ వంద శాతం జరగకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సుమారు రూ. 1.50 కోట్ల సెస్సు వసూలు కావాల్సి ఉంది. సకాలంలో సెస్సు వసూలు కాకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. దిన, వార, మాస పత్రికలు, కుర్చీలు, టేబుళ్లు, అట్టలు, తాత్కాలిక ఉద్యోగుల జీతాలు, విద్యుత్‌ బిల్లులు చెల్లింస్తుంటారు. అభివృద్ధి పనులు, మరమ్మతులు, శాశ్వత భవనాలు, గదుల నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. జిల్లాలో లైబ్రరీ సెస్సు బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇటీవల పలువురు నేతలు సమస్యను కలెక్టరు దృష్టికి తీసుకెళ్లడంతో బకాయిల వసూలుపై అధికార యంత్రాంగం కొంత మేర దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

- ఏడేళ్లుగా రాని కొత్త పుస్తకాలు...

జిల్లాలోని గ్రంథాలయాలకు సుమారు ఏడేళ్లుగా కొత్త పుస్తకాల సరాఫరా కావడం లేదు. సంవత్సరాల క్రితం నాటి పాత పుస్తకాలు, దినపత్రికలతోనే గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. నిత్యం పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్న విద్యార్థులు, యువత నిరుత్సాహానికి గురికావాల్సి వస్తోంది. యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండడం లేదు. అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయాలను అధునికీకరించకపోవడం సమస్యగా మారింది. 

- పత్తాలేని ఈ-గ్రంథాలయ ఏర్పాటు...

జిల్లాలో ఈ-గ్రంథాలయ ఏర్పాటు పత్తాలేకుండా పోయింది. మారుతున్న సాంకేతిక కాలానికి తగ్గట్టుగా ఈ - గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. పలువురు నేతలు ఈ-గ్రంథాలయ ఏర్పాటు హామీనిచ్చినప్పటికీ ఆచరణలో నెరవేరడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్న యువత, విద్యార్థులు నిరాశలకు గురవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు లైబ్రరీల అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.


Advertisement
Advertisement