Abn logo
Oct 23 2020 @ 00:21AM

సర్వం శక్తిమయం!

Kaakateeya

భారతీయ పండుగలన్నీ ప్రకృతితో ముడి పడిన పర్వదినాలు. ఆనందాన్ని కలిగించి, ఆలోచనలను వికసింపజేసే ఈ పండుగలు ధర్మ, మోక్ష సాధనాలు కూడా! ‘పండా ఆత్మ విషయా బుద్ధిః’ అని గీతాభాష్యం. ఆత్మ విషయకమైన బుద్ధే ‘పండ’. ‘గ’ అంటే పొందడం. ఆత్మ విషయకమైన బుద్ధి దేని వల్ల పొందగలుగుతామో అదే పండుగ. ఆత్మ జ్ఞానం పొందేలా చేయడమే పండుగల పరమార్థం. అలాంటి పండుగల్లో... విజయానికీ, శౌర్యానికీ చిహ్నంగా, శుభారంభానికి అనువైన రోజుగా విజయదశమి ఖ్యాతి పొందింది. భారతీయ పర్వదినాల్లో దీనికి విశిష్టమైన స్థానం ఉంది.  • ఈనెల 25న విజయదశమిత్రిమూర్తుల అంశలతో, త్రిజగన్మాతలైన సరస్వతి, లక్ష్మి, పార్వతుల తేజో విభవ సంపత్తితో, సృష్టిలో స్త్రీశక్తి వైశిష్ట్య ప్రతీకగా ఆదిపరాశక్తి ఆవిర్భవించింది. సకల రాక్షస సంహారం చేసింది. ఆ మహాశక్తి ఆవిర్భావ గాథలు ‘దేవీ భాగవత’ గ్రంథంలో అభివర్ణితమయ్యాయి. మహా విష్ణువు కోరికపై, ఆయన అంశతో ‘మహామాయ’గా అమ్మవారు అవతరించి, మధు కైటభులను సంహరించింది. మహిషాసురుణ్ణి సంహరించి ‘మహిషాసుర మర్దని’ అయింది. శుంభ నిశుంభులను వధించి, ‘చాముండి’గా పేరు పొందింది. రక్తబీజుడి రక్తం నేల మీద పడకుండా తాగి... ‘మహాకాళి’ అవతారం ఎత్తింది. జగత్తులో కరువు కాటకాలను నిర్మూలించి, ప్రజలకు శాకాలను ఇచ్చి ‘శాకంబరి’ అయింది. ఈ విధంగా జగతిలో ధర్మరాజ్య విధాత్రిగా, జగన్మాతగా అవతరించి... ధర్మపరులైన భక్తులకు ఐహిక, ఆముష్మిక ఫలాలను అందించింది. 


  • దానవ కోట్లతో దర్పించి యెదిరిన మహిషాసురుని రూపు మాపలేదొ;
  • శుంభ నిశుంభుల గాంభీర్య మెడలెంచి రక్తబీజుని నేల రాయలేదొ;
  • చండ ముండాది రాక్షసుల నుక్కడగించి ధూమ్ర లోచను తల ద్రుంచలేదొ;
  • దుర్ముఖ దుస్సహాదులఁ దునుమాడి క రాళు నంతకపురి దోలలేదొ
  • జనని నీచేత ద్రెళ్ళిన దనుజులెంద
  • రో వచింపగ దరమె? భూదేవి భార
  • మును హరింపగదమ్మ! మా మొక్కులను గ్ర
  • హింపఁ గదవమ్మ! నీకెన్న నెరుగమమ్మ!

- అంటూ తమ ‘దేవీ భాగవతం’ గ్రంథంలో తిరుపతి వెంకట కవులు అమ్మవారిని స్తుతించారు.

అనేక మంది రాక్షసులను సంహరించి, భూలోకంలో ధర్మసంస్థాపన చేసిన అమ్మవారిని ఆధునిక కాలంలోని మానవుల రాక్షస ప్రవృత్తులను రూపుమాపాలని అమ్మవారిని కోరుకోవాలి.


ఇంటింటా కొలువై ఉంటుంది...

కృతేచ రేణుకా శక్తిః త్రేతాయాం జానకీ తథా!

ద్వాపరే ద్రౌపదీ శక్తిః కలౌ శక్తిః గృహే గృహే!!


కృత యుగంలో రేణుకా దేవి, త్రేతా యుగంలో సీత, ద్వాపర యుగంలో ద్రౌపది శక్తి స్వరూపిణులు. కానీ కలియుగంలో ఇంటింటా శక్తి రూపిణులు కొలువై ఉంటారు. మహిళను తల్లిగా, సృష్టి, స్థితి, లయ కారిణిగా, పరమ పూజనీయురాలుగా భావించాలి. దానికి మాతృ ఆరాధన మూలం. శక్తి లేనిదే జీవికి మనుగడ లేదు. ఆమెను మాతృమూర్తిగా ఆరాధించేవారికి తన ప్రేమామృతాన్ని ఆమె పంచుతుంది. వారి యోగ క్షేమాలను చూస్తూ ఎల్లవేళలా కాపాడుతుంది.


వైష్ణవి... శివాని... సర్వమంగళ...


సర్వ స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే

భయేభ్యః త్రాహినో దేవి దుర్గాదేవీ నమోస్తుతే


‘అన్నిటా, అన్ని రూపాల్లో నువ్వే ఉన్నావు. సర్వాన్నీ నువ్వే నియంత్రిస్తున్నావు. సర్వ శక్తులు కలదానవు. అన్ని భయాల నుంచి నువ్వు మమ్మల్ని కాపాడతావు. సర్వ దుఃఖాలనూ హరించే తల్లీ! నీకు ప్రణామాలు’ అని భావం.

సృష్టి మొత్తం శక్తి నుంచే ఆవిర్భవించింది. ఆ శక్తిని బ్రహ్మలో సృజన శక్తిగా, విష్ణువులో పాలనాశక్తిగా, రుద్రునిలో సంహార శక్తిగా, సూర్యుడిలో ప్రకాశ శక్తిగా, అగ్నిలో దాహక శక్తిగా, గాలిలో ప్రేరణాత్మక శక్తిగా, సర్వ ప్రాణులలో జీవశక్తిగా పూర్వులు సంభావించారు. విశ్వ, విశ్వాతీతాలకు సర్వాధారమైన ఆ శక్తి నిర్గుణోపాసన ద్వారా ‘దివ్యత్వం’గా, సగుణోపాసన ద్వారా ‘దేవి’గా ఆరాధనలు అందుకుంటోంది. ఆ శక్తి విష్ణు సంబంధమైన వ్యాపకత్వంతో ‘వైష్ణవి’గా, శివ సంబంధమైన విశ్వచైతన్యంతో ‘శివాని’గా పూజలు పొందుతోంది. లోకమాత అయిన ఆ తల్లి ‘సర్వమంగళ’గా ప్రార్థనలు అందుకుంటోంది. త్రికరణశుద్ధిగా జగన్మాతను విశ్వసించి ఆరాధించేవారికి కన్నతల్లిలా కారుణ్యాన్నీ, వాత్సల్యాన్నీ ఆమె అనుగ్రహిస్తుంది.

- ఆచార్య శ్రీవత్స


Advertisement
Advertisement