ఆకాశమే హద్దుగా..!

ABN , First Publish Date - 2021-04-04T07:32:46+05:30 IST

హైదరాబాద్‌ మహానగరం చుట్టూ రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది.

ఆకాశమే హద్దుగా..!

  • ‘రీజినల్‌’తో రియల్‌ బూమ్‌
  • కేంద్రం ప్రకటనతో గ్రామాల్లో సర్వే
  • రేఖాంశాలు, అక్షాంశాల ఆధారంగా భూసేకరణకు సన్నాహాలు
  • అమాంతం పెరిగిన భూముల ధరలు
  • ప్రతిపాదిత ప్రాంతాల్లోనైతే రెండింతలు
  • పెట్టుబడులు పెడుతున్న బడా సంస్థలు 
  • హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీల ఆసక్తి
  • 25 వేల ఎకరాల భూమి కొనుగోలు
  • 8 జిల్లాల్లో 340 కి.మీ. మేర నిర్మాణం
  • 10వేల ఎకరాల సేకరణకు సన్నాహాలు
  • రీజినల్‌ రింగురోడ్డుపై వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షఙ


రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని కిషన్‌నగర్‌లో మూడు నెలల కిందట ఎకరా భూమి ధర 40లక్షలకు మించి లేదు. ఇటీవల రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ పనుల కోసం ఈ గ్రామంలో అధికారులు సర్వే చేశారు. దీంతో ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఎకరా భూమికి 1.5 కోట్లు చెబుతున్నారు. 3 నెలల్లోనే ధరలు 3 రెట్లు పెరిగాయి. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): హైదరాబాద్‌ మహానగరం చుట్టూ రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. కరోనాతో దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైనప్పటికీ హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల మీదుగా ఈ రింగ్‌ రోడ్డు వెళుతుండడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతాల్లో రియల్‌ బూమ్‌ వచ్చింది. రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై కేంద్రం ప్రకటన తరువాత 35-40శాతం వరకు భూముల ధరలు పెరగడం గమనార్హం. శ్రీశైలం హైవేపై ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 50ు పెరిగాయి. వికారాబాద్‌ జిల్లా పరిధిలోని అంగడిచిట్టంపల్లిలో రీజినల్‌ రింగురోడ్డు ప్రకటనకు ముందు ఎకరా రూ.1.25 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.2కోట్లు పలుకుతోంది. మన్నెగూడ వద్ద రూ.80లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్న భూమి విలువ ఇప్పుడు రూ.1.50కోట్లకు చేరింది. అమన్‌గల్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ భూముల ధరలకూ రెక్కలొచ్చాయి. తలకొండపల్లి పరిసర ప్రాంతాల్లో 3 నెలల క్రితం ఎకరా రూ.50లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.కోటి పలుకుతోంది.


10 వేల ఎకరాల సేకరణ

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం కోసం పదివేల ఎకరాల భూమిని సేకరించనున్నారు. ప్రతి కిలోమీటర్‌కు 25-30 ఎకరాల భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భూసేకరణ వ్యయంలో 50ు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. రింగ్‌రోడ్డు నిర్మాణానికి 500మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని కేంద్రం కోరగా.. ఆ స్థాయిలో సాధ్యం కాదని 100 మీటర్ల వెడల్పు వరకైతే చేయగలమని రాష్ట్రం తెలిపింది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం తొలుత ఆరు లైన్ల నిర్మాణం చేపడుతున్నా.. భవిష్యత్తులో దీన్ని ఎనిమిది లైన్లకు విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.16,241 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మిస్తున్న ఈ రింగ్‌ రోడ్డు 8 జాతీయ రహదారులు, 25 పట్టణ ప్రాంతాలు, 300 గ్రామాలను కలుపుతూ వెళ్తుంది. రాష్ట్ర జనాభాలో 40% మంది ఈ రింగు రోడ్డు లోపలే ఉంటారు. దీంతో ఈ ప్రాంతాల్లో మౌలికసదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. భూసేకరణ కోసం 3 వారాల్లో సర్వేనంబర్లు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే రేఖాంశాలు, అక్షాంశాలు గుర్తించారు. వీటి ఆధారంగా భూసేకరణ చేస్తారు.

 

ఏపీలో అమరావతి మార్పుతో...

పొరుగున ఉన్న ఏపీలో రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలించడంతో విజయవాడ-గుంటూరు ప్రాంతాల్లో ఒక్కసారిగా రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలింది. అక్కడి ప్రభుత్వం సంక్షేమంపై పెడుతున్న శ్రద్ధ అభివృద్ధిపై పెట్టకపోవడంతో పెట్టుబడుదారులంతా మళ్లీ హైదరాబాద్‌ వైపు చూస్తున్నారు. కొత్త గా రీజినల్‌ రింగ్‌రోడ్డుపై కేంద్రం నుంచి వచ్చిన ప్రకటన పెట్టుబడుదారులను ఆకర్షిస్తోంది. గతంలో ఏపీలో భూములను కొన్నవారు ఎంతో కొంతకు తెగనమ్ముకుని హైదరాబాద్‌ చుట్టు పక్కల కొనుగోలు చేస్తున్నారు. 


భారీగా పెట్టుబడులు

రీజినల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయితే శివార్లలో కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో బడా వ్యక్తులు, వ్యాపార సంస్థలు భారీగా భూములు కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా రంగానికి చెందిన వారు రూ.వేల కోట్లు భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే ఆ రంగానికి చెందిన వారు గత ఆరునెలల్లోనే దాదాపు 25వేల ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అసలు భూములు దొరకడం లేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కంటే కూడా ఇతర వ్యాపారాలు చేసే వారు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఇపుడు భూములపై పెట్టుబడి పెడుతున్నారు.


దక్షిణ భాగం ఇలా..

రెండోదశలో హైదరాబాద్‌కు దక్షిణ ప్రాంతంలోని కంది నుంచి చౌటప్పల్‌ వరకు 182 కి.మీ మేర రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.4,633 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుండగా, భూసేకరణకు రూ.1748కోట్లు కలిపి మొత్తం రూ.6,881 కోట్లు వ్యయం చేయనున్నారు. 


ఉత్తర భాగం ఇలా...

రెండు భాగాలుగా చేపట్టనున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించి హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతంలోని సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-యాదాద్రి-భువనగిరి- చౌటుప్పల్‌ వరకు 158కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. దీనికి ఎన్‌హెచ్‌ 161ఏఏ నంబరింగ్‌ ఇచ్చారు. ఈ భాగం నిర్మాణానికి కేంద్రం రూ.7,561 కోట్లు ఖర్చు చేయనుండగా భూసేకరణ కోసం మరో రూ.1,961 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇలా.. తొలి దశ ఉత్తర భాగం నిర్మాణానికి రూ.9,522 కోట్ల వ్యయం కానుంది.


  మారిన ముఖ చిత్రం

ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న హైదరాబాద్‌ ఫార్మాసిటీ (హెచ్‌పీఎ్‌స)కు అడ్డు రాకుండా రీజినల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకు ముందు కంది నుంచి చేవెళ్ల, షాబాద్‌, షాద్‌నగర్‌, కడ్తాల్‌, యాచారం మీదుగా చౌటుప్పల్‌ వరకూ రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలని భావించారు. అయితే, ప్రతిపాదిత రోడ్డుకు ఇరువైపులా ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు ఉండడంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. పోలేపల్లి సెజ్‌కు కూడా అనుకూలంగా ఉండేలా ప్రతిపాదనల్లో మార్పులు చేశారు. తాజాగా చేసిన మార్పుల ప్రకారం రీజినల్‌ రింగ్‌రోడ్డు.. సంగారెడ్డి నుంచి మహబాత్‌ఖాన్‌గూడ, తంగెడపల్లి, మన్నెగూడ- చేవెళ్ల, తంగెడిపల్లి, చెన్‌గోముల్‌, కొందుర్గు, రాయకల్‌, బోదానంపల్లి, విఠాయిపల్లి (ఆమన్‌గల్లు సమీపంలో) సత్తుపల్లి, గొల్లపల్లి, శివన్నగూడ మీదుగా చౌటుప్పల్‌లో కలుస్తుంది.

Updated Date - 2021-04-04T07:32:46+05:30 IST