మామిడి మార్కెట్‌లో మందగమనం

ABN , First Publish Date - 2020-03-24T11:39:24+05:30 IST

జగిత్యాల జిల్లాలోని మామిడి మార్కెట్‌పై కరోనా ఎఫెక్ట్‌ కనబడుతోంది. పంట అమ్మకాలకు గడువు సమీపిస్తున్నా, వ్యాపారులు మామిడి మార్కెట్‌ వైపు చూడడం లేదు.

మామిడి మార్కెట్‌లో మందగమనం

కరోనా ఎఫెక్ట్‌తో మొదలు కాని ఏర్పాట్లు.. జగిత్యాలకు 8 రాష్ట్రాల నుంచి వ్యాపారులు

రూ.100 కోట్ల లావాదేవీలు

సీజన్‌ సమీపిస్తుండటంతో ఆందోళన


జగిత్యాల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని మామిడి మార్కెట్‌పై కరోనా ఎఫెక్ట్‌ కనబడుతోంది. పంట అమ్మకాలకు గడువు సమీపిస్తున్నా, వ్యాపారులు మామిడి మార్కెట్‌ వైపు చూడడం లేదు. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి కొనుగోళ్లు మొదలు కావాల్సి ఉంది. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడంతో ఈసారి మామిడి మార్కెట్‌ పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళనలో ఉన్నారు. 


జిల్లా నుంచి దేశవ్యాప్తంగా సరఫరా

జగిత్యాల మామిడి మార్కెట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ సాగైన మామిడి రకాలు దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంటాయి. బంగినపల్లి రకానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి. పంజాబ్‌, ఢిల్లీ, హర్యానా, జమ్మూ కశ్మీర్‌, డెహ్రాడూన్‌, లూథియానా, బెంగళూర్‌, ఉత్తప్రదేశ్‌, జార్ఖండ్‌, జైపూర్‌, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి పంట కొనుగోలు చేసుకుని ఆయా రాష్ట్రాలకు తరలిస్తారు. మార్చి చివరి వారంలోనే జగిత్యాలకు చేరుకుని మూడు మాసాల పాటు ఇక్కడే ఉండి పంటను కొనుగోలు చేస్తూ ఉంటారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇతర రాష్ట్రాల వ్యాపారులదే పెద్ద బిజినెస్‌. యేటా 100 కోట్లకు పైగా మామిడి వ్యాపారం సాగుతుంది. అయిఏ ప్రస్తుతం సీజన్‌ దగ్గర పడుతున్నా మామిడి మార్కెట్‌లో హడావుడి లేదు. కరోనా వైరస్‌ ప్రభావం వల్లే మామిడి వ్యాపారులు రావడం లేదని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు.


ఆందోళనలో మామిడి రైతులు

జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. ఐదారు సంవత్సరాలుగా మామిడి విక్రయం జూదంలా మారింది. ఈ ఏడాది పూత ఆలస్యంగా రావడంతో పాటు తక్కువగా ఉండటంతో దిగుబడి తగ్గుతుందని ఓవైపు రైతులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. గత ఏడాది బంగినపల్లి రకం కిలోకు రూ.30 నుంచి రూ.35 వరకు ధర పలికింది. ఈసారి పంట దిగుబడి తక్కువగా ఉండగా కిలోకు రూ.50 నుంచి రూ.55 వరకు వస్తుందని రైతులు భావిస్తున్నారు.


పరిస్థితులు ఇలాగే ఉంటే ఇబ్బందికరమే

కరోనా ప్రభావం మామిడి మార్కెట్‌పై తీవ్రంగా కనిపిస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అందరికీ ఇబ్బందికరమే. ఇతర రాష్ట్రాల నుంచి పంట కొనుగోలుకు ఇక్కడికి వ్యాపారులు ఎక్కువగా వస్తుంటారు. అయితే, ఈ సారి ఇప్పటికీ ఎవరూ రాలేదు. కరోనా ప్రభావంతో ఎవరూ కొనుగోలుకు ముందుకు రావడం లేదు. పరిస్థితులు ఇలాగే ఉంటే రైతులు, స్థానిక వ్యాపారులకు ఇబ్బందులు తప్పవు.

ఎండీ మోయిన్‌, మామిడి మార్కెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, జగిత్యాల

Updated Date - 2020-03-24T11:39:24+05:30 IST