దీపం దొర్లిన వాసన

ABN , First Publish Date - 2020-08-31T06:34:19+05:30 IST

ఈ దీపం నిద్రపోదు నన్ను నిద్రపోనీదు ఇది నా దేహం నా జీవిత ఊరేగింపుకి కాగడై ముందు నడుస్తుంది ఈ దీపం నిద్రపోదు...

దీపం దొర్లిన వాసన

ఈ దీపం నిద్రపోదు

నన్ను నిద్రపోనీదు

ఇది నా దేహం

నా జీవిత ఊరేగింపుకి

కాగడై ముందు నడుస్తుంది

ఈ దీపం నిద్రపోదు

నిలువెల్లా కాలిపోతుంది

దేశం మీద దేశం

రాజ్యం మీద రాజ్యం

జాతి మీద జాతి

జనం మీద జనం

విజృంభించినప్పుడైనా

ఓ రెప్పేస్తుందేమో - అయినా కునకదు

దారి పొడవునా ఎన్ని దేహాలు రాలిపోలేదు?

దృశ్యం వైపు దృష్టి మళ్లినప్పుడు

నా కళ్ళల్లో వొత్తులేసుకొని

కన్నీటి సముద్రాలని తైలంగా జేసింది - నేనే!

ఈ దీపం నిద్రపోనీదు

నన్ను నిద్రపోనీదు

తనువుకి తీరానికి మధ్య

తనువుకి ఆకాశానికి మధ్య

నీటి నుండి మొలిచే నిప్పురవ్వ కదా? ఈ దీపం

తగలబడిపోతున్న తాత్విక

చింతనలన్నీ ఓ చోట పోగేసి

నిప్పురవ్వనైతే అది దీపమై వెలుగుతుంది

తడవదు, తగలబడదు

అది నిద్రపోదు నన్ను నిద్రపోనీదు

నా దేహం అనేక దీప స్తంభాలు

బహు, బాహులుగా చాచి

చీకటి చిట్లిన దేహాల్లోకి ప్రవేశిస్తా

తెల్లవారిన వెలుతురు పొద్దుకుంకిన చీకటి

నా దేహాన్ని తీరాలకు

తరతరాలకు మోసుకుపోతుంది

ఈ దీపం నిద్రపోదు నన్ను నిద్రపోనీదు

ఎక్కడో దొర్లిన దేహాల కమురు కంపు

తల్లి బిడ్డ సజీవ దహనం

ఓ వృద్ధురాలు, ఓ బాలింత, ఓ పసిబిడ్డ

ఇక్కడ ఓ పెత్తందారి ఖడ్గంలా మొలకెత్తుతాడు

ఓ పరిశ్రమలా విస్తరిస్తాడు

ఎక్కడో దీపం దొర్లిన వాసన

నేను దీపధారిని

దౌర్భాగ్యం నిండిన కళ్ళల్లో

కూసింత కాంతి నింపుతా

మోకులతోలాగి, మేకులతో దిగగొట్టి

హైలెస్సా పాటలతో

ఏటిగట్టుకు లాగుతున్న కాంతిమూట నేను

ఏవో నాలుగు పాదాల గుర్తులు 

నా దేహాన్ని తొక్కిన జ్ఞాపకం

నా కూట్లో, సట్లో, నట్టింటిలో

నా సర్వస్వాలు దొర్లిన వాసన

ఎక్కడో నే దీపాన్నై దొర్లిన వాసన

అంతా కమురు కంపు అయినా

నేను వెలుగుతూనే ఉంటా

సరిహద్దులు విడిపోతున్నప్పుడు

నే తొలిపొద్దునౌతా

నేను దీపాన్ని

దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి

80962 25974


Updated Date - 2020-08-31T06:34:19+05:30 IST