చర్చలకు వస్తే పరిష్కారం

ABN , First Publish Date - 2022-01-25T08:04:26+05:30 IST

‘‘ప్రభు త్వం ఉద్యోగుల విషయంలో ఏం చేస్తోందో ఇంటింటింకీ చెబుతోంది. అందులో తప్పు లేదు’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.

చర్చలకు వస్తే పరిష్కారం

  • ఉద్యోగులకు ఏమిచ్చామో ఇంటింటికీ వెళ్లి చెబుతున్నాం!
  • అందులో తప్పేమీ లేదు.. 
  • కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు: సజ్జల


అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభు త్వం ఉద్యోగుల విషయంలో ఏం చేస్తోందో ఇంటింటింకీ చెబుతోంది. అందులో తప్పు లేదు’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని ఉద్యోగులకు సూచించారు. పీఆర్సీ జీవోలపై ఉన్న అపోహలు తొలగించేందుకే ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల కమిటీతో చర్చలకు రమ్మన్నామని తెలిపారు. సోమవారం ఆయన సచివాలయంలో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వస్తే ప్రభుత్వం తరఫున తమ నిర్ణయాలను వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చర్చలకు వస్తేనే మిగతా అంశాలు మాట్లాడగలమని తెలిపారు. సోమవారం వాళ్లు వస్తారని ఎదురుచూసినా రాలేదని, మంగళవారం కూడా చర్చల కోసం సచివాలయానికి వస్తామని వివరించారు. జీఏడీ సెక్రటరీ ఫోన్‌ చేసి చెప్పినా అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారన్నారు. గతంలో చర్చలు జరిపినప్పుడు, లేఖలు ఇచ్చినప్పుడు లేని అధికారికం ఇప్పుడెందుకు గుర్తొచ్చిందని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సం ఘాలతో చర్చిస్తామని చెప్పారు. ట్రెజరీ ఉద్యోగులు కొత్త పీఆ ర్సీ ప్రకారం వేతనాలు చేయమంటున్నారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటప్పుడు నోటీసు పీరియడ్‌కు అర్థం ఉండదన్నారు. అలా చేస్తే క్రమశిక్షణలో పెట్టే ప్రక్రియ ప్రారంభవుతుందని సజ్జల హెచ్చరించారు. ఈ నెలాఖరులోగా జీతా ల బిల్లులు చేయని పరిస్థితి రాదనుకుంటున్నానని చెప్పారు.  ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Updated Date - 2022-01-25T08:04:26+05:30 IST