నితీశ్ కుమార్ తనయుడు తండ్రిని మించిపోయాడు

ABN , First Publish Date - 2022-01-02T16:30:04+05:30 IST

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆయన మంత్రివర్గ

నితీశ్ కుమార్ తనయుడు తండ్రిని మించిపోయాడు

పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆయన మంత్రివర్గ సహచరుల ఆస్తుల వివరాలను డిసెంబరు 31న రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. ఈ వివరాలను పరిశీలించినపుడు నితీశ్‌కు రూ.75.36 లక్షల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు, దీనికి ఐదు రెట్ల విలువైన ఆస్తులు నిషాంత్‌కు ఉన్నట్లు వెల్లడైంది. నితీశ్ కుమార్ వద్ద నగదు రూపంలో రూ.28,385; బ్యాంకు డిపాజిట్ల రూపంలో రూ.42,763 ఉన్నాయి. నిషాంత్ వద్ద నగదు రూపంలో రూ.16,549; బ్యాంకు డిపాజిట్ల రూపంలో రూ.1.28 కోట్లు ఉన్నాయి. 


నితీశ్ చరాస్తుల విలువ రూ.16.51 లక్షలు కాగా, స్థిరాస్తుల విలువ రూ.58.85 లక్షలు. ఆయన తనయుడు నిషాంత్ చరాస్తుల విలువ రూ.1.63 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ.1.98 కోట్లు. నితీశ్ కుమార్‌కు న్యూఢిల్లీలోని ద్వారకలో ఓ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఓ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉంది. నిషాంత్‌కు నలంద జిల్లాలో, పాట్నాలోని కంకర్‌బాగ్‌లలో వ్యవసాయ భూమి, ఇళ్ళు ఉన్నాయి. నిషాంత్‌కు ఈ వ్యవసాయ భూమి ఆయన పూర్వీకుల స్వస్థలం కల్యాణ్ బిఘాలో ఉంది. ఆయనకు ఈ గ్రామంలో వ్యవసాయేతర భూమి కూడా ఉంది. నితీశ్ కుమార్‌‌కు రూ.1.45 లక్షల విలువైన 13 ఆవులు, తొమ్మిది దూడలు ఉన్నాయి. 


ప్రతి సంవత్సరం డిసెంబరు 31న ఆస్తులను వెల్లడించాలని నితీశ్ కుమార్ ప్రభుత్వం తన కేబినెట్ మంత్రులకు ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి కన్నా మంత్రుల్లో కొందరు సంపన్నులు కావడం విశేషం. వికాశ్‌శీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు, పశు సంవర్ధక శాఖ మంత్రి ముకేశ్ సహానీకి ముంబైలో ఉన్న ఆస్తుల విలువ రూ.7 కోట్ల పైమాటే. అంతేకాకుండా ఆయనకు బ్యాంకు డిపాజిట్ల రూపంలో రూ.23 లక్షలు ఉంది. ఆయనకు, ఆయన భార్యకు చెరొక ఫ్లాట్ ఉన్నాయి. 


Updated Date - 2022-01-02T16:30:04+05:30 IST