ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. మున్నా దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్వీ బాబు విలేకర్లతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఓటీటీలో విడుదల చేయడానికి చర్చలు జరిగాయి. కానీ మా సినిమా మీద ఉన్న నమ్మకంతో థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నాం. అల్లు అరవింద్‌గారు, బన్నీవాసు గారు ఈ సినిమా చూశారు. నచ్చడంతో వారి సొంత బేనర్లో విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
గతేడాది జనవరి 30న ‘నీలి నీలి ఆకాశం..’ సాంగ్‌ను విడుదల చేశాం. ఈ జనవరి 30కు 365 రోజులవుతుంది. దానికి ఒక రోజు ముందు జనవరి 29న సినిమాను విడుదల చేస్తున్నాం.
‘నీలి నీలి ఆకాశం’ పాటను ఇంతపెద్ద హిట్ చేసిన తెలుగు ప్రజలకు ధన్యవాదాలు. భాషలకు అతీతంగా ప్రజలు ఈ పాటను ఆదరించారు కాబట్టే యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ వచ్చాయి. ‘30 రోజుల్లో...’ సినిమా నిర్మాతను నేనే అని తెలియక ఈ పాట గురించి కన్నడవాళ్లు నన్ను అడిగారు. తెలుసుకున్నాక నన్ను అభినందించారు. ఈ పాటే సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళుతుందని నా నమ్మకం.
మా ప్రొడక్షన్లో ఇది 18వ సినిమా. సినిమా షూటింగ్ ఆలస్యమయినా ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం. తొలి చిత్రమే అయినా ఎంతో అనుభవమున్న దర్శకుడిలా మున్నా సినిమాను తెరకెక్కించారు. సెంటిమెంట్, కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రదీప్‌కి హీరోగా తొలి చిత్రమే అయినా బాగా నటించాడు. పోసాని గారు, హేమ... ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇవన్నీ తప్పకుండా సినిమాకు ప్లస్ అవుతాయి.
పాటలు బాగున్నా, కథాబలం లేక చాలా చిత్రాలు ప్లాపయ్యాయి. అందుకే మా సినిమా విషయంలో అలా జరగకూడదని భావించి పలు జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా బోర్ కొట్టకుండా, ప్రేక్షకుడిని నిరాశ పరచకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మా సినిమా కథ కూడా ప్రేమతోనే మొదలవుతుంది. ఆ ప్రేమ ఇద్దరు వ్యక్తులను ఎంతవరకూ తీసుకెళ్లింది అనేది తెరమీద చూడాలి.