స్థలాల క్రమబద్దీకరణ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-09-30T05:46:16+05:30 IST

పట్టణాల్లో ఖాళీగా ఉన్న స్థలాలన్నింటినీ క్రమబద్ధీకరించుకొనేలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని, అంతేగాక ఈ

స్థలాల క్రమబద్దీకరణ పూర్తి చేయాలి

 జిల్లా కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పట్టణాల్లో ఖాళీగా ఉన్న స్థలాలన్నింటినీ క్రమబద్ధీకరించుకొనేలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని, అంతేగాక ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ మొత్తం అక్టోబర్‌ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయాల్లో మున్సిపల్‌, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌, సబ్‌ రిజిస్టర్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ప్రస్తుతం పట్టణాల్లో చాలా వరకు క్రమబద్ధీకరణలు లేవని, తద్వారా రాబోవు కాలంలో అలాంటి వాటిని అమ్మాలన్నా, ఇతరులకు బదిలీ చేయించాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అలాగే ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ప్లాట్లు, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ వలన ప్రజలకు పూర్తి హక్కులు సంభవిస్తాయని, కాబట్టి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధథిలోని వారందరూ వారి వారి ఇండ్లు, ఖాళీ స్థలాలు క్రమబద్దీకరించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.


క్రమబద్ధీకరణ ప్రక్రియ మొత్తం అక్టోబర్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించినవి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మున్సిపల్‌, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సమన్వయంతో కార్పొరేటర్ల సహకారంతో వార్డుల వారీగా పరిశీలించి ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. అలాగే నివాస గృహాలు, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయా లేక ప్రైవేట్‌ స్థలాల్లో ఉన్నాయా అనేది క్షుణ్ణంగా పరిశీలించాలని, ఖాళీ స్థలాల విస్తీర్ణం ఎంత ఉందనేది వెంటనే గుర్తించవచ్చని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, రాష్ట్ర మంత్రిగంగుల కమలాకర్‌ సూచించిన ప్రకారం ఇంచు భూమి కూడా ఖాళీగా లేకుండా ప్రతి ఒక్కరూ ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకునే విధంగా చూడాలన్నారు.


గుర్తించిన భూములను దసరా నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభిస్తారని, అదేరోజు నుంచి జిల్లాలో ధరణి వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ ప్రారంభమవుతాయని, కాబట్టి గుర్తించిన ఇండ్లు, భూములు, ఖాళీ స్థలాలకు రిజిస్ర్టేషన్లు చేసి మెరూన్‌ కలర్‌ పాస్‌బుక్‌లు అందించుటకు సిద్ధంగా ఉండాలని అన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పాస్‌బుక్‌ కల్పించే విధంగా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో సహాయ కలెక్టర్‌(ట్రైనీ) అంకిత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి, నాలుగు మున్సిపాలిటీల కమిషనర్లు, తహసీల్దార్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సబ్‌ రిజిస్ర్టార్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-30T05:46:16+05:30 IST