మనో దర్శనం

ABN , First Publish Date - 2020-07-11T05:53:33+05:30 IST

ఈ రోజెందుకో అద్దం అబద్ధంలా తోస్తోంది నా ప్రతిబింబమే నన్ను గుచ్చి ప్రశ్నిస్తున్నట్లు వుంది....

మనో దర్శనం

ఈ రోజెందుకో అద్దం 

అబద్ధంలా తోస్తోంది

నా ప్రతిబింబమే నన్ను 

గుచ్చి ప్రశ్నిస్తున్నట్లు వుంది.

ముడతలు పడిన నా 

ముఖ కవళికలన్నీ

వార్థక్యపు ఛాయలు 

దాయలేకపోతున్నయ్‌


కరోనా కాలంలో 

అడ్డగోలుగా పెరిగి

కొసదిరిగిన మీసమిపుడు 

ప్రశ్నిస్తా ఉంది

అంటరాని కులంనుండి 

అరుణతారనవుతానని

కలలుగన్న నీకిప్పుడు 

ఏమైందని అడుగుతోంది

కళ్ళముందరే జరిగిన 

అన్యాయాలను సైతం

ప్రశ్నించని పిరికితనపు 

ఆనవాలు అడుగుతోంది


మట్టివాసనలో పుట్టి 

మరిచినట్టి నీ మనుషుల

వెట్టిచాకిరీల వెతలు 

తీర్చలేకపోయావంది

చెప్పులు కుట్టినట్టి 

ముత్తాతల వృత్తినుండి

వచ్చినట్టి నీ విప్పుడు 

మోసం చేశావంది

పేబ్యాంక్‌ టు సొసైటీ అని 

అంబేడ్కర్‌ ఇచ్చినట్టి

సందేశపు మాట ఇప్పుడు 

గుండెలోన గుచ్చుతోంది.


నేచదివిన చదువులన్ని

నా గొప్పని తలపోసిన

బిరుసెక్కిన తలపులన్ని

తలంటు పోసింది అద్దం


– ఆదూరి వెంకట రత్నం

Updated Date - 2020-07-11T05:53:33+05:30 IST