‘బార్డోలీ’ స్ఫూర్తి సజీవం!

ABN , First Publish Date - 2021-10-09T06:34:13+05:30 IST

‘మీరుఒక సామాన్య రైతును, ఏ భారతీయుడైనా ఆకాంక్షించే అత్యున్నత పదవికి ఎన్నుకున్నారు. ప్రథమ సేవకుడిగా నన్ను ఎంపిక చేసుకోవడంలో మీ నిర్ణయం, దేశానికి నేను చేసిన కొద్దిపాటి సేవకు కాకుండా...

‘బార్డోలీ’ స్ఫూర్తి సజీవం!

‘మీరుఒక సామాన్య రైతును, ఏ భారతీయుడైనా ఆకాంక్షించే అత్యున్నత పదవికి ఎన్నుకున్నారు. ప్రథమ సేవకుడిగా నన్ను ఎంపిక చేసుకోవడంలో మీ నిర్ణయం, దేశానికి నేను చేసిన కొద్దిపాటి సేవకు కాకుండా, గుజరాత్ ప్రజల అనుపమాన త్యాగనిరతికి గుర్తింపుగానే అనే విషయం నాకు బాగా తెలుసు. ఎంతో ఉదారభావంతో, విశాల హృదయంతో గుజరాత్‌కు మీరు ఈ గౌరవం ఇచ్చారు. నిజానికి, మహోన్నత ఆధునిక భారత జాతీయ పునర్జాగృతికి ఆసేతు హిమాచలం ప్రతి ప్రాంతమూ అనితర సాధ్యమైన దోహదం చేసింది’- కరాచిలో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక మహాసభ అధ్యక్షోపన్యాసంలో సర్దార్ వల్లభ్ భాయి పటేల్ అన్న మాటలవి. 1931 కరాచి మహాసభ నాటికి కాంగ్రెస్‌కు నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాంగ్రెస్‌కు అధ్యక్షుడు కావడం అనేది అదే మొదటిసారి. అప్పటికి చాలా సంవత్సరాలుగా, ‘భారతదేశం తన గ్రామాలలో నివశిస్తున్నదని’ మహాత్మాగాంధీ పదేపదే ఘోషిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కరాచి కాంగ్రెస్ మహాసభకు ముందు ఆ మహాసంస్థకు అధ్యక్షుడయిన ప్రతి నాయకుడూ నగరంలో పుట్టి నగరంలో పెరిగిన వాడే. 


భారత స్వాతంత్ర్యోద్యమ ప్రధాన సారథులలో గ్రామీణ నేపథ్యం నుంచి ప్రభవించిన మొట్టమొదటి మహానాయకుడు సర్దార్ వల్లభ్ భాయి పటేల్. రైతులను సంఘటితపరచిన మొట్టమొదటి జాతీయ నాయకుడు కూడ ఆయనే. రైతుల ఉద్యమాన్ని అద్వితీయంగా నిర్వహించి, వలసపాలకుల మెడలు వంచిన స్వాతంత్ర్యవీరుడిగా గుజరాత్ రైతులోకం గౌరవాదరాలను పొందిన తొలి మహానేత సైతం ఆయనే. ఆ మహానాయకుని చారిత్రక వారసత్వం గురించి ఇటీవల జరుగుతున్న చర్చలలో, స్వాతంత్ర్యానంతరం వందలాది సంస్థానాలను విలీనం చేయడంలోనూ, ఆ తరువాత జాతీయ సమైక్యతను పటిష్ఠం చేయడంలోనూ ఆయన అసాధారణ కృషే ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. స్వతంత్ర భారతదేశానికి ఆయన అందించిన సేవలను మాత్రమే గుర్తు చేసుకోవడం వల్ల తొలినాళ్ళలో రైతుఉద్యమ నేతగా ఆయన నిర్వహించిన నిర్మాణాత్మక కృషి మరుగున పడిపోయింది. ఇది సమంజసం కాదు. నిజానికి కిసానుల సర్దార్ (నాయకుడు)గా ఆయన ఉపయుక్తత నేటి పరిస్థితులలో విశేషంగా ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. ఇంచుమించు ఒక సంవత్సర కాలంగా ఉత్తర భారతావనిలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న సత్యాగ్రహోద్యమం పటేల్ స్మృతిని మరింత సజీవమూ, స్ఫూర్తిదాయకమూ చేస్తోంది. 


1928లో సర్దార్ పటేల్ నాయకత్వంలో చరిత్రాత్మక బార్డోలీ సత్యాగ్రహం జరిగింది. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో అహింసాత్మక పోరాట పద్ధతుల ప్రభావశీలతను బార్డోలీ సత్యాగ్రహం తిరుగులేని విధంగా నిరూపించింది. వ్యవసాయరంగంలో వలసపాలకులు నిరంకుశంగా అమలుపరుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గుజరాత్ గ్రామ సీమలలో ఒక మహోద్యమం దావానలంలా వ్యాపించింది. నెలల తరబడి సాగిన ఆ శాంతియుత సమరంలో పటేల్ ప్రసంగాలు ఇప్పటికీ ఎంతో ఉత్తేజపూర్వకమైనవిగా ఉన్నాయి. ‘బార్డోలీ తాలూకాలోని ప్రతి గ్రామానికి చెందిన రైతు నాయకులతో పటేల్ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నార’ని గూఢచార విభాగం ప్రభుత్వానికి నివేదించింది.


1928 ఏప్రిల్ చివరి వారంలో నాటి ప్రముఖ దినపత్రిక ‘బాంబే క్రానికల్’, ‘వరాద్‌లో జరిగిన రైతుల సమావేశంలో వల్లభ్ భాయి పటేల్ పట్ల రైతు కుటుంబాల ఆరాధనాభావం బాగా వ్యక్తమయిందని పేర్కొంది. ఒక ఉద్యమ వేడుకగా గాక ఒక మత సంబంధితమైనదిగా భాసిల్లిన ఆ కార్యక్రమంలో రెండున్నరవేల మందికి పైగా పాల్గొన్నార’ని తెలిపింది. అదే సంవత్సరం ఆగస్టులో సత్యాగ్రహులకు, ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం కుదిరిందని ఆ పత్రిక పేర్కొంది. సత్యాగ్రహుల డిమాండ్ మేరకు వివాదాస్పద అంశాలన్నిటిపై విచారణకు ఒక న్యాయాధికారిని నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. జైలులో ఉన్న సత్యాగ్రహులు అందరినీ విడుదల చేయడంతో పాటు ఉద్యోగాలకు రాజీనామా చేసిన గ్రామాధికారులు అందరినీ మళ్ళీ అదే ఉద్యోగాలలో నియమించింది. 


బార్డోలీ పోరాట పవనాలు ఇంకా వీస్తూనే ఉన్నాయి సుమా! ఆ చరిత్రాత్మక సత్యాగ్రహం జరిగిన దాదాపు వంద సంవత్సరాలకు ఉత్తర భారతావనిలో కిసాన్ ఆందోళన ప్రజ్వరిల్లుతోంది. ఈ రెండు ఘటనలకు మధ్య సాదృశ్యాలను చూడడం కష్టమేమీ కాదు. అప్పుడూ ఇప్పుడూ నిరసనలను కొనసాగించడంలో మహిళలు ముఖ్యపాత్ర వహిస్తున్నారు. నాటి సత్యాగ్రహుల ప్రశాంత ధీరోదాత్తత ప్రశంసనీయమైనది. చలిగాడ్పులు, గ్రీష్మజ్వాలలు, కుండపోతలు, అన్నిటికీ మించి మహమ్మారినీ తట్టుకుని నేటి ఉద్యమకారులు తమ లక్ష్యసాధనలో నిమగ్నులయ్యారు. ఇక పాలకులు నాడూ నేడూ నిరసనలను నిలిపివేయించేందుకు, ఉద్యమంలో చీలికలు తెచ్చేందుకు నానాప్రయత్నాలు చేశారు. ఉద్యమ నాయకుల గురించి అసత్యాలు ప్రచారం చేశారు. 


1920 దశకంలో పరాయి పాలకులకు సహకరించిన వారు బ్రాహ్మిణ్ రెవెన్యూ అధికారులు, గుజరాత్ వెలుపలి ప్రదేశాల నుంచి రప్పించిన గూండాలు. ఇప్పుడు 2020లలో వలసపాలనానంతర రాజ్యవ్యవస్థకు తోడ్పడుతున్నది పోలీసులు, గోడీ మీడియా (విధేయ మీడియా). రైతులను అణచివేయడంలో పోలీసులు, ఉద్యమ లక్ష్యాలను వక్రీకరించడంలోనూ, ఉద్యమనేతలను అప్రతిష్ఠ పాలుచేయడంలోనూ గోడీ మీడియా సహకరిస్తున్నాయి. నిజానికి రైతులపై దమనకాండకు కఠిన పద్ధతులను అనుసరించడంలో మోదీ-షా ప్రభుత్వం శ్వేత జాత్యహంకార పాలకులను సైతం మించిపోయింది.


‘సత్యాన్ని సంరక్షించేందుకు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైనవారే అంతిమ విజయం సాధించి తీరుతారని గుర్తుంచుకోండి. పాలకులతో కుమ్మక్కయిన వారు తమ చర్యలకు విచారించే రోజు వస్తుంద’ని సత్యాగ్రహులకు సర్దార్ పటేల్ పదే పదే చెబుతుండేవారని ఆయన తొలి జీవిత చరిత్రకారుడు నరహరి పారీఖ్ ఉటంకించారు. సత్యాగ్రహ శక్తిని, అహింసాత్మక పోరాట మహత్వాన్ని ప్రభుత్వం గుర్తించి తీరుతుందని, రైతుల ఉద్యమ సహేతుకతను పాలకులు అంగీకరిస్తారని గాంధీ అనుయాయుడిగా పటేల్ విశ్వసించారు. ‘ప్రభుత్వ వైఖరి మారినప్పుడు సంతృప్తికరమైన పరిష్కారం లభిస్తుంది. హృదయపరివర్తన జరిగినప్పుడు ప్రభుత్వం కాఠిన్యం, ప్రాతికూల్యాన్ని విడనాడి సానుభూతి, అవగాహనతో వ్యవహరిస్తుందని’ ఒక ఉపన్యాసంలో పటేల్ అన్నారు. 


ఉత్తర భారతావనిలో ప్రస్తుత రైతు ఉద్యమ నేతలు కూడా అదే అహింసాత్మక స్ఫూర్తితో, అదే పరిపూర్ణ ఆశాభావంతో వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే సానుభూతి, అవగాహన అనేవి నేటి స్వదేశీ పాలకులలో నాటి బ్రిటిష్ పాలకులలో కంటే కూడా చాలా అరుదు అని చెప్పక తప్పదు. 


1931 కరాచీ కాంగ్రెస్ మహాసభ అధ్యక్షోపన్యాసం నుంచి ఉటంకింపుతో ఈ వ్యాసాన్ని ప్రారంభించాను. అదే ఉపన్యాసం నుంచి మరో ఉటంకింపుతో ఈ వ్యాసాన్ని ముగించదలిచాను. గాంధీ నాయకత్వంలో వెల్లువెత్తిన జాతీయ చైతన్యాన్ని గురించి ప్రస్తావిస్తూ పటేల్ ఇలా అన్నారు: ‘ఒక మహా లక్ష్య సాధనకు అహింసాత్మక పద్ధతులలో ప్రజాపోరాటాన్ని నిర్వహించడం అనేది ఇంకెంతమాత్రం ఒక దార్శనికుని స్వప్నం కాదని భారతదేశం అద్వితీయంగా నిరూపించింది. ఇది ఎవరూ నిరాకరించలేని వాస్తవం. హింసారాధనలో మునిగిపోయిన మానవాళికి భారతదేశం తన సత్యాగ్రహ ఉద్యమంతో అనేక వెలుగుదారులు చూపుతోంది. సత్యాగ్రహంపై సంశయవాదుల భయాలు నిరాధారమైనవని రైతులు రుజువు చేయడమే మన అహింసా పోరాట మార్గ విశిష్టతకు గొప్ప రుజువు. అహింసాత్మక కార్యాచరణలో రైతులను సంఘటితపరచడం చాలా కష్టమని చాలా మంది అన్నారు. అయితే అది ఒక తప్పుడు భావన అని రైతులు రుజువు చేశారు. మహిళలు, బాలలు కూడా తమ వంతు తోడ్పాటు నందించారు. అహింసను ఒక ప్రామాణిక పోరాట పద్ధతిగా నిలబెట్టి, ఉద్యమాన్ని విజయవంతం చేసిన ఘనతలో పెద్ద వాటాను వారికి ఇవ్వడం ఎంత మాత్రం తప్పు కాదని నేను భావిస్తున్నాను’. 1931లో సర్దార్ పటేల్ పలికిన ఈ మాటలు నిరంకుశ, నిర్లక్ష్య పాలనాయంత్రాంగంపై హుందాగా, దృఢసంకల్పంతో రైతులు మరొకసారి పోరాడుతున్న 2021లో కూడా ఉత్తేజకరంగా లేవూ?


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2021-10-09T06:34:13+05:30 IST