రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య లక్షణాన్ని కోల్పోతే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం : మోదీ

ABN , First Publish Date - 2021-11-26T19:48:09+05:30 IST

రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య లక్షణాన్ని కోల్పోతే రాజ్యాంగ

రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య లక్షణాన్ని కోల్పోతే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం : మోదీ

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య లక్షణాన్ని కోల్పోతే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అటువంటి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించగలవని ప్రశ్నించారు. భారత రాజ్యాంగ దినోత్సవాల సందర్భంగా శుక్రవారం పార్లమెంటులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందం ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. 


ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాలు

నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా మోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసినవారందరికీ నివాళులర్పించారు. రాజ్యాంగానికి రాజ్యాంగ సభ 1949లో ఆమోదం తెలిపిందని, ఆ తర్వాత ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాలను నిర్వహించి, దీని నిర్మాణం వెనుక జరిగిన కృషి గురించి అందరికీ తెలియజేసి ఉండవలసిందని అన్నారు. కొందరు వ్యక్తులు అలా చేయలేదని దుయ్యబట్టారు. ‘‘మనం చేస్తున్నది తప్పు? ఒప్పు? అనే అంశాలను తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 


ఆ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలవా?

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల బృందం ఈ కార్యక్రమాలను బహిష్కరించడంతో, రాజకీయ పార్టీలు తమ ప్రజాస్వామిక లక్షణాన్ని కోల్పోకూడదని చెప్పారు. అలాంటి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా కాపాడగలుగుతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఎంసీ సహా 14 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. 


కుటుంబ పార్టీలతో ముప్పు

కాంగ్రెస్ పార్టీని నేరుగా ప్రస్తావించకుండా మోదీ మాట్లాడుతూ, కుటుంబాలు నాయకత్వం వహించే పార్టీలు రాజ్యాంగానికి అంకితమైనవారికి, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కలవారికి ఓ సమస్యగా మారుతున్నట్లు తెలిపారు. ‘‘కుటుంబం కోసం, కుటుంబం ద్వారా, కుటుంబం యొక్క పార్టీ... మరింత చెప్పవలసి ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అన్నారు. ఒకే కుటుంబంలోని అనేక తరాలు నిర్వహించే పార్టీ ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ముప్పు అని హెచ్చరించారు. రాజ్యాంగ దినోత్సవాలను నిర్వహించడమంటే పార్లమెంటుకు గౌరవ వందనం చేయడమని పేర్కొన్నారు. మన రాజ్యాంగం కేవలం అనేక అధికరణల సమాహారం మాత్రమే కాదని, వేలాది సంవత్సరాల సమున్నత సంప్రదాయమని చెప్పారు. మన వైవిద్ధ్యభరితమైన దేశాన్ని మన రాజ్యాంగం సమైక్యంగా ఉంచుతోందని తెలిపారు. అనేక అడ్డంకులు, అవరోధాల అనంతరం దీనిని రూపొందించారని తెలిపారు. దేశంలోని అనేక రాజవంశాల ఏలుబడిలోని రాజ్యాలను ఏకం చేసిందన్నారు. రాజ్యాంగ దినోత్సవాల నిర్వహణ ఏదో ఓ ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి లేదా ప్రధాన మంత్రికి సంబంధించిన విషయం కాదన్నారు. స్పీకర్, రాజ్యాంగం, డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్‌లను గౌరవించుకోవడమని చెప్పారు.


ముంబై దాడుల మృతులకు నివాళులు

ముంబైలో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడుల మృతులకు నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఉగ్రవాదులతో పోరాటంలో అమరులైన సైనికులకు కూడా నివాళులర్పించారు. 


Updated Date - 2021-11-26T19:48:09+05:30 IST