Abn logo
Aug 2 2020 @ 05:06AM

మీరు మారరా నాయకా?

తిరుపతి, (ఆంధ్రజ్యోతి): గంగాధరనెల్లూరు బస్టాప్‌ కూడలిలో ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీరు. మూడు రాజధానుల బిల్లును ఆమోదించడం అన్యాయం అంటూ నిరసన వ్యక్తం చేయడానికి రోడ్ల మీదకు వచ్చారు. కరోనా వేళ కనీస జాగ్రత్తలు పాటించాలనే సంగతి మాత్రం మరిచారు. వీరే కాదు జిల్లాలో అనేక చోట్ల  టీడీపీ కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమాల్లో భౌతికదూరం పాటించనే లేదు.


 వైరస్‌ వ్యాప్తి తొలినాళ్ళలో జాగ్రత్తలు చెబుతూ ప్రజల్ని అప్రమత్తం చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కూడా ఇంతేనా...సగటు నాయకుడేనా అనిపించింది శనివారం తిరుపతిలో ఆయన పాల్గొన్న రాజధాని బిల్లు ఆమోద సంబరాలు చూస్తే. గుంపులుగట్టి పోటెత్తిన కార్యకర్తలతో కలిసి ఆయన ఇలా కనిపించారు. జిల్లాలో అనేక చోట్ల వైసీపీ శ్రేణులు ఇలాగే కార్యక్రమాలు నిర్వహించారు.


వైరస్‌ విరుచుకుపడుతూనే ఉంది. వేలకు వేలు కరోనా బారినపడుతూనే ఉన్నారు. మరణమృదంగం మోగుతూనే ఉంది. అయినా మన నాయకులకు మాత్రం ఒంట్లో భయం లేదు. బాధ్యతగా ఉండాలనే స్పృహ అసలే లేదు. జాగ్రత్త తప్ప మందులేని జబ్బు ముట్టడించినపుడు ప్రజలను హెచ్చరించవలసిన నాయకులే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మొన్నటిదాకా ముక్కుకు మాస్కు కూడా పెట్టుకోకుండానే జనంలో తిరిగినవారు తమను కూడా వైరస్‌ వదలదని అర్థమయ్యాక తిరుగుడు కాస్త తగ్గించారు. మాస్క్‌లతో కనిపిస్తున్నా గుంపుగట్టడం మాత్రం మానడం లేదు. అది సంబరమైనా, నిరసన అయినా తీరు మారడం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు లెక్కలేనితనంలో అందరొక్క తీరే అని నిరూపిస్తున్నారు. '


శనివారం జిల్లాలో అనేక చోట్ల ఇవే దృశ్యాలు కనిపించాయి. మూడురాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదాన్ని పండగ చేసుకుంటూ వైసీపీ నాయకులు, నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి భౌతికదూరం అనే మాటనే మరచి కనిపించారు.ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ప్రజలను నియంత్రిస్తున్న పోలీసులు, ఊళ్ళను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగుల సేవలను ఎగతాళి చేస్తున్న తీరుగా నాయకుల కార్యక్రమాలు సాగుతుండడం పట్ల ఆలోచనాపరులు ఆవేదన చెందుతున్నారు. చెప్పవలసినవారి చేతలే ఇలా ఉంటే జనం ఏమవుతారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement