కరోనాతో క్రీడారంగం కుదేలు

ABN , First Publish Date - 2021-10-18T06:07:29+05:30 IST

కరోనా మహమ్మారి క్రీడారంగాన్ని అస్తవ్యస్తం చేసింది. దీంతో జిల్లాలోని ప్రతిభాక్రీడాకారులు నిరాశ, నిస్పృహతో విలవిలలాడిపోతున్నారు.

కరోనాతో క్రీడారంగం కుదేలు

‘ఆటల’కు పూర్వవైభవం వచ్చేనా

రెండేళ్లుగా ఆగిన క్రీడాపోటీలు

నిలిచిపోయిన ఖేలో ఇండియా గేమ్స్‌

నిధుల లేమితో స్కూల్‌గేమ్స్‌ నిర్వహణపై నిరాసక్తి

శాఖల మధ్య  కొరవడిన సమన్వయం


అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 17 : కరోనా మహమ్మారి క్రీడారంగాన్ని అస్తవ్యస్తం చేసింది. దీంతో జిల్లాలోని ప్రతిభాక్రీడాకారులు నిరాశ, నిస్పృహతో విలవిలలాడిపోతున్నారు. ఇటీవలే క్రీడామైదానంలో తెరుచుకోవడంతో క్రీడాకారులు స్టేడియం వైపు అడుగులు వేస్తున్నారు. సుమారు ఏడాదిన్నరగా క్రీడాకారులు సాధనకు దూరం కావడం, ఫిట్‌నెస్‌ కోల్పోయారు. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి చేసిన కసరత్తులు, కోవిడ్‌ ప్రభావంతో వృథా అవుతున్నాయి. బాలలకు శిక్షణ కార్యక్రమాలతో ఒకటిన్నరసంవత్సరం పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న స్టేడియాలలో పూర్తిస్థాయిలో క్రీడాకారులు పాల్గొనేందుకు ఆసక్తిచూపడం లేదు. జిల్లాకు 2016లో క్రీడా అకాడమీలు మంజూరు చేశారు. కరోనా ప్రభావం, పాలకులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లాలో నిర్వహిస్తున్న ఆరు క్రీడా అకాడమీలకు మంగళం పాడారు. దీంతో సుమారు వందల సంఖ్యలో క్రీడాకారులకు అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 


క్రీడాకారులకు ప్రోత్సాహకం కరువు 

ఓ వైపు కరోనాతో క్రీడలకు దూరమైన క్రీడాకారులకు.. మరోవైపు ప్రభుత్వాల నుంచి కనీస ప్రోత్సాహకం అందడం లేదు. గతంలో క్రీడావిజేతలను ప్రోత్సాహించేవారు. అయితే  రెండున్నరేళ్ళుగా ప్రోత్సాహించేనాథుడే కరువయ్యారు. కలెక్టర్‌ మొదలు ఏ అధికారి కూడా క్రీడలను పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా క్రీడాభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. కరువు జిల్లాలో అక్కడక్కడా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులు స్వయంకృషితో రాణిస్తున్నారు. అయినా అటువంటి వారికి జిల్లాస్థాయి అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఎటువంటి ప్రోత్సాహమూ ఇవ్వడం లేదు. దీనిపై క్రీడాకారులు, కోచలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.  


పైకాకు మంగళం...ఖేల్‌ ఖతం  

 14 ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో 16 ఏళ్ల లోపు ఉన్న  బాల, బాలికల క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు రూరల్‌ ఉమెన గేమ్స్‌ ప్రవేశపెట్టారు. రెండేళ్లలోనే ఆ క్రీడలను రద్దు చేశారు. 2006లో పంచాయతీ యువ క్రీడాఔర్‌ ఖేల్‌ అభియాన-పైకా ప్రారంభించారు. 2010లో పైకా రద్దు చేసి రాజీవ్‌ఖేల్‌ అభియానను ప్రారంభించారు. 2015లో దాన్ని కూడా రద్దు చేసి ఖేలో ఇండియా ప్రారంభించారు. నాలుగేళ్లలో ఒక సారి అంటే 2016లో మాత్రమే ఖేలో ఇండియా మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించారు.  రెండేళ్ళుగా ‘ఖేలో ఇండియా ఖేల్‌ ఖతం దుకాన బంద్‌..’ చందంగా మారింది. పథకాల సంగతి అలా ఉంచినా నిధులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

 

నిధుల లేమి..

ఏటా స్కూల్‌గేమ్స్‌ కింద వాలీబాల్‌, పుట్‌బాల్‌, హాకీ, అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బాక్సింగ్‌, వెయిట్‌ లిప్టింగ్‌, కబడ్డీ క్రీడాపోటీలు నిర్వహించేవారు. మండలానికి మండలస్థాయి పోటీలకు రూ.50వేలు, జిల్లా స్థాయి పోటీలకు రూ.5లక్షలు, రాష్ట్రస్థాయి పోటీలకు రూ.10 లక్షలు ప్రభుత్వం చెల్లించేది. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో ఆ పోటీలను నిర్వహించడం లేదు. తద్వారా విద్యార్థులను క్రీడల పట్ల ఆసక్తి రానురాను సన్నగిల్లుతోంది.  


కేవీకేల నిర్మాణంలో నిర్లక్ష్యం

క్రీడా వికాస కేంద్రం (కేవీకే)ల నిర్మాణాల్లోనూ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. రెండేళ్ళు నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటికి కూడా నిధులు చెల్లించ కపోవడంతో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొదట నియోజకవర్గానికి ఒక కేవీకే (మినిస్టేడియం) నిర్మించాలని గత ప్రభుత్వం భావించింది. అయితే తరువాత ప్రతి మండలానికి ఒక కేవికే నిర్మించాలని నిర్ణయించింది.  పుట్టపర్తి, కనగానిపల్లి, చెన్నేకొత్తపల్లి, గార్లదిన్నె కలూ ్లరు, రాయదుర్గంలలో కేవీకేల నిర్మాణాలు ప్రారంభించారు. ఒక్కో క్రీడా వికాస కేంద్రానికి రూ.2 కోట్లు నిధులు కేటాయించారు. అయితే ఇటీవల జీఎస్టీ సమస్యతోనే టెండర్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మొత్తం 19 కేవీకేలకు సంబంధించి రూ.38 కోట్లు నిధులు కేటాయించారు. అయితే నాలుగు మాత్రమే పూర్తి అయ్యాయి.  అయిన సుమా రు రూ.4కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక మిగలిన 15 ఎప్పటికి పూర్తి అవుతాయో చూడాలి మరి.


ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు

- జగన్నాథ్‌రెడ్డి, చీఫ్‌కోచ, జిల్లా క్రీడా, యువజన సంక్షేమశాఖ

కరోనా ప్రభావంతో క్రీడలు కుదేలయ్యాయి. క్రీడాకారులు నిరాశలో ఉండిపోయారు. కరోనా సెకండ్‌వేవ్‌ తరువాత ఇప్పుడిప్పుడే స్టేడియా లు తెరుచుకుని, క్రీడాకారులు ఆటల బాట పడుతున్నారు. కీడలకు, క్రీడాకారులను ప్రోత్సాహిస్తే సత్ఫలితాలు సాధించే అవకాశముంది. క్రీడాకారులు కొవిడ్‌ నిబంధనలకు లోబడి స్టేడియాల్లో సాధన చేయాలని ఇప్పటికే కోచలకు సూచించాం. కరోనా ప్రభావంతో పూర్తిస్థాయిలో క్రీడాకారులు సాధన, శిక్షణకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఉన్న క్రీడాకారులతోనే సాధన చేస్తున్నాం. ఇక క్రీడావికాస కేం ద్రాల నిర్మాణాలపై ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలో పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  


Updated Date - 2021-10-18T06:07:29+05:30 IST