Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ రంగంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి

కడప (మారుతీనగర్‌), డిసెంబరు 4: నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏకైక ఆధారంగా ఉన్న ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే జిల్లాలో ఏర్పాటు చేయాలని ఉక్కు సాధన జిల్లా కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉక్కు సాధన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనలో మరో రెండున్నరేళ్లు శంకుస్థాపనలకే కాలం గడిచిపోయిందన్నారు. ప్రైవేట్‌ రంగంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. వెనుకబడిన ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ రంగంలోని సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం వలన సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. సమావేశంలో ఉక్కుసాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు బి.నారాయణ (సీపీఎం), వి.ఎస్‌.అమీర్‌బాబు (టీడీపీ) ఎస్‌.ఎ.సత్తార్‌, బండి జకరయ్య (కాంగ్రెస్‌), సగిలి గుర్రప్ప (బీఎస్పీ), అవ్వారు మల్లికార్జున (ఏపీ బీసీ మహాసభ), సి.ఆర్‌.వి. ప్రసాద్‌ (హేతువాదసంఘం), బి.మనోహర్‌ (సీఐటీయూ)తో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement