ఆసిఫాబాద్‌ జిల్లా పంచాయతీరాజ్‌శాఖలో అవినీతి కంపు

ABN , First Publish Date - 2022-01-25T04:17:55+05:30 IST

జిల్లా పంచాయతీరాజ్‌శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏజెన్సీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని జిల్లా పంచాయతీరాజ్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు సర్పంచ్‌లపై పెత్తనం సాగిస్తున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లా పంచాయతీరాజ్‌శాఖలో అవినీతి కంపు

- సర్పంచ్‌లకు సంబంధం లేకుండా సామగ్రి కొనుగోలు, చెల్లింపులు

- ఏజెన్సీలో ఆదివాసీ సర్పంచ్‌లే టార్గెట్‌

- ప్రజాప్రతినిధుల అండతో పెట్రేగుతున్న ఇద్దరు ఉద్యోగులు

- జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో నిధుల అవకతవకలు

- విజిలెన్స్‌, ఏసీబీకి ఫిర్యాదు 

- జిల్లా అధికారికి సరెండర్‌ చేసినా చర్యలు శూన్యం

ఆసిఫాబాద్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లా పంచాయతీరాజ్‌శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏజెన్సీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని జిల్లా పంచాయతీరాజ్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు సర్పంచ్‌లపై పెత్తనం సాగిస్తున్నారు. వారికి సంబంధం లేకుండానే పంచాయతీలకు అవసరమైన విద్యుత్‌, శానిటేషన్‌, నర్సరీలకు అవసరమైన వస్తువులు, ట్రీగార్డుల వంటి సామగ్రి కొనుగోలు కోసం అని చెక్‌లు రాయించుకుంటూ దర్జాగా నిధులు డ్రా చేస్తున్నట్టు ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో బయటపడింది. ముఖ్యంగా జిల్లాలోని ఏజెన్సీ మండలాలే టార్గెట్‌గా కొంత మంది పంచాయతీరాజ్‌ అధికారులు కమీషన్ల దందాలో దిగారు. నేరుగా వ్యాపారులతో సంబంధాలు పెట్టుకొని కొనుగోళ్ల పేరుతో పంచాయతీలకు వచ్చే నిధులు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తిర్యాణి మండలంలో ఈ తరహా దందా పెద్దఎత్తున జరిగినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా నిజాలను నిగ్గుతేల్చేందుకు ప్రయత్నించిన ఐదుగురు ఎంపీడీవోలను బదిలీ పేరుతో వేటు వేసి వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలు జిల్లాలో సంచలనం రేకేత్తిస్తోంది. తిర్యాణిలో పనిచేస్తున్న ఎంపీవో సహాయంతో జిల్లా కార్యాలయంలో పనిచేసే మరో ఉద్యోగి చేతులు కలిపి ఈ తతంగం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లలో ఈ తరహాలో సుమారు రూ.2.కోట్లకుపైగా నిధులు నొక్కేసినట్టు ఆరోపణలున్నాయి. నెలకు లక్ష రూపాయలు జీతం పొందుతూ రోజుల తరబడి విధులకు గైర్హాజరు అవుతూ కాంట్రాక్టర్‌, కమీషన్‌ ఏజెంటు సప్లయిర్‌గా పంచాయతీల తీర్మానాలు లేకుండానే నేరుగా సామగ్రిని కొనుగోలు చేసి బలవంతంగా అంటకడుతున్నారు. అంతేకాకుండా సర్పంచ్‌లను నయానో, భయానో ఒప్పించి నిబంధనలకు విరుద్దంగా చెక్‌లపై సంతకాలు తీసుకొని ట్రెజరీ ద్వారా నిధులు డ్రా చేస్తున్నట్టు ఇటీవల అక్కడ పనిచేసే ఓ అధికారి కలెక్టర్‌ సహా పంచాయతీ అధికారులకు సమాచారం అందించారు. అంతేకాదు ఈ మండలానికి చెందిన 29 గ్రామాల ప్రజాప్రతినిధులు గతంలో సదరు అధికారిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా జిల్లా ఉన్నతాధికారులు కనీసం చర్యలు చేపట్టలేదు. పోగా అక్కడపని చేసే ఎంపీడీవోలను బదిలీ చేయడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై వివిధ ఆదివాసీ సంఘాలు సమాచార హక్కు చట్టం ద్వారా విద్యుత్‌ పరికరాలు, శానిటరీ సామగ్రి, ట్రీగార్డులు, నర్సరీలకు మట్టి సరఫరా, శ్మశాన వాటికల నిర్మాణాల వంటి అంశాల్లో కూపీలాగగా సదరు అధికారి లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నట్టు చెబుతున్నారు. అయితే సదరు మండల అధికారికి జిల్లా కేంద్రంలో పనిచేసే మరో అధికారి అండదండలతోపాటు రాజకీయ ప్రముఖుల ఆశీస్సులున్నట్టు చెబుతున్నారు. ఈ కారణంగానే జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోగా విషయాలను వెలుగులోకి తెచ్చిన వారిని బలిపశువులగా మారుస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయిలో అందరి హస్తం ఉందని అంటున్నారు. ప్రతి నెలా జిల్లాస్థాయి వరకు ముడుపులు ముడుతుండడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని ఆదివాసీ సంఘాల నేతలు చెబుతుండగా, ఈ వ్యవహారం కాస్త ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు సదరు అధికారితో పాటు జిల్లా ఉన్నతాధికారుల వ్యవహారశైలి, ప్రజాప్రతినిధులపైన కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అటు విజిలెన్స్‌ ఇటు ఇంటిలిజెన్స్‌ కూపీలాగుతున్నట్టు సమాచారం. 

చెప్పిన మాట వినకుంటే చెక్‌ పవర్‌ రద్దు చేయిస్తా

తిర్యాణి మండలంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు పంచాయతీరాజ్‌ అధికారిపై ఫిర్యాదు చేసిన సర్పంచ్‌లను లక్ష్యంగా చేసుకొని కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నట్టు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సర్పంచి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే సదరు మండల అధికారి తమ చెక్‌ పవర్‌ రద్దు చేయిస్తామంటూ బెదిరింపులకు దిగినట్టు చెపుతున్నారు. మండలంలోని 29పంచాయతీల్లో సదరు అధికారి అవినీతి కార్యకలాపాలు సాగినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యుత్‌ పరికరాల కొనుగోలుకు సంబంధించి జిల్లా కేంద్రంలో ఉన్న ఒకే ఏజెన్సీకి రూ.2కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. ఇందులో ఏ ఒక్క గ్రామ సర్పంచికి ఏం కొనుగోలు చేశారన్నదానిపై ఇంతవరకు అవగాహన లేదు. బలవంతంగా చెక్‌లు రాయించుకొని సదరు అధికారి చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సుమారు రూ.50లక్షలకుపైగా అక్రమాలు జరిగినట్టు సమాచారం. 29 పంచాయతీకు ట్రాక్టర్‌ ట్రాలీలు, ట్యాంకర్ల కొనుగోళ్లను కూడా సదరు అధికారే జగిత్యాలలో స్వయంగా తయారు చేసి సరఫరా చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇందులో అధిక ధరలను కోట్‌చేసి పంచాయతీల నుంచి నిధులు చెల్లించటం ద్వారా కమీషన్‌ రూపేణ రూ.6నుంచి రూ.10లక్షలు నొక్కేశారని చెబుతున్నారు. అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా అందుబాటులోని లేని కొన్ని రకాల మొక్కలను కొనుగోలు చేసేట్టు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకొన్న సదరు అధికారి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక నర్సరీ నుంచి రూ.50 నుంచి రూ.60 వేలతో 30వేల మొక్కలు కొనుగోలు చేసి అన్ని పంచాయతీల్లో మొక్కలను పంపిణీ చేసినట్టు తప్పుడు రికార్డులు సృష్టించి సుమారు రూ.15 నుంచి రూ.18లక్షలు కాజేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే నర్సర్సీల్లో మొక్కల పెంపకం కోసం అవసరమైన ఎర్రమట్టి ఒక ట్రిప్పుకు రూ.ఏడువేలు చెల్లించాల్సి ఉండగా 29పంచాయతీ నుంచి ఒక్కో ట్రిప్పుకు రూ.15,500చొప్పున చెక్‌లను రాయించుకొని ట్రెజరీ ద్వారా నిధులను డ్రా చేశారు. అంతేకాదు ముల్కల మంద, కన్నేపల్లి, మేస్రంగూడ, భీంజిగూడ, సుంగాపూర్‌, మందగూడ, గడలపల్లి, పంగిడి మాదర, రొంపెల్లి, మాణిక్యాపూర్‌, మొర్రిగూడ గ్రామాల్లో  శ్మశాన వాటికల నిర్మాణాలకు కూడా సిమెంటు మొదలుకొని అన్ని రకాల మెటీరియల్‌ను సదరు అధికారే సమకూర్చి ఇష్టం వచ్చిన రేట్లను కోట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే మొక్కల రక్షణకు ఏర్పాటు చేసే ట్రీగార్డుల కొనుగోళ్లకు సంబంధించి గ్రామ పంచాయతీల నుంచి రూ.12.60లక్షలు డ్రా చేయగా, ఈజీఎస్‌ నుంచి అంతే మొత్తం డ్రా చేసి పంచాయతీలకు జమ చేయకుండా జేబులో వేసుకున్నట్టు తేలింది. ఇలా చెప్పుకుంటూ పోతే సదరు అధికారి లీలలు కోకొల్లలుగా బయట పడుతున్నాయి. పూర్తిస్థాయిలో విజిలెన్స్‌ విచారణ జరిపితే తప్ప ఈ వ్యవహారం వెనుక ఎవరి హస్తం ఉందనేది బయటపడే అవకాశం లేదు.

Updated Date - 2022-01-25T04:17:55+05:30 IST