కథ ఒక నెపం, తలపోత ముఖ్యం

ABN , First Publish Date - 2020-08-31T06:48:59+05:30 IST

రాయాలంటే ముందు రాయాలి. అంతేతప్పించి, రాతకి దన్నుగా అభిప్రాయాల పట్టికనొకటి పరికల్పిద్దామని కూర్చుంటే, తీరా రాస్తున్నప్పుడు ఆ అభిప్రాయాలు మనకే అడ్డుపడి ఊపిరాడకుండా...

కథ ఒక నెపం, తలపోత ముఖ్యం

మన అనుభవ ప్రపంచం మరొకరి అనుభవ ప్రపంచంతో సాంతం అనుకంపించే ఇలాంటి సందర్భాలు మాజికల్‌! ఆయన వెంట ఎంతో ఇంటిమేట్‌ దూరాల్లోకి పోగలిగాను. జీవితమొక జ్ఞాపకం కాబట్టి-- ఆయన చూపించినవన్నీ, అక్కడ కనిపించినవన్నీ, నాకు చాలా ముఖ్యం అనిపించాయి. త్రిపుర రచనా సర్వస్వాన్ని ఎత్తి పట్టుకోవటానికి రెండు వేళ్ళ మధ్య తేలికపాటి ఒత్తిడి చాలు. అయినా త్రిపుర పుస్తకాలు నాకు స్పిరిచ్యువల్‌ హోం అనిపిస్తాయి.


రాయాలంటే ముందు రాయాలి. అంతేతప్పించి, రాతకి దన్నుగా అభిప్రాయాల పట్టికనొకటి పరికల్పిద్దామని కూర్చుంటే, తీరా రాస్తున్నప్పుడు ఆ అభిప్రాయాలు మనకే అడ్డుపడి ఊపిరాడకుండా చేస్తాయి. ఇలాంటి అవస్థలో ఉన్నప్పుడు నాకు త్రిపుర పుస్తకం దొరికింది. కొత్తగూడెంలో, గుమ్మంలోంచి చూస్తే కొండలు కనపడే ఊరి చివర ఇంట్లో, కొన్ని వేసవి రాత్రులు వరుసగా కొవ్వొత్తి ముందు కూర్చుని, పుస్తకం మొత్తం చదివాను. చదివాక ఏమనిపించింది? ...స్వేచ్ఛ! ఏంతెలిసింది? ...ఇంటిమేట్‌ విషయాలు చెప్పుకుందామని కూర్చున్నప్పుడు కాయితం మీద పెద్ద పథకాలేవీ పన్నాల్సిన అవసరం లేదని. త్రిపురని చదివింతర్వాత నేను రాసినవేవీ చదవక ముందు రాసినవాటిలా లేవు. అందుకే త్రిపుర నాకు ముఖ్యం.


త్రిపురని ‘‘కాఫ్కా ప్రభావంతో కథలు రాసిన ఒక రచయిత’’ అన్నట్టు తేల్చిపడేస్తూంటారు కొంతమంది. ఈ విషయంలో త్రిపుర ఏం పెద్ద ఇబ్బంది పడినట్టులేడు. పైగా తన వంతు సాయం కూడా చేశాడు. ‘కాఫ్కా కవితలు’ అని పుస్తకం వేసి అందులో చాలా కవితల్లో కాఫ్కా డైరీ వాక్యాల్నే పంక్తులుగా విడదీసి కవితలుగా పేర్చాడు. తన సొంత కథ మధ్యలో కాఫ్కా స్కెచెస్‌ని అనువదించి కలిపేసి ‘వలస పక్షుల గానం’ అల్లాడు. బహుశా కాఫ్కాని చదివినవారెవరైనా ఆయన్నుంచి తను తీసుకున్నది పెద్దగా ఏం లేదని గ్రహిస్తారని ఆయనకూ తెలుసనుకుంటాను. ఆయన కాఫ్కాని విపరీతంగా ఇష్ట పడ్డాడు. కానీ అనుకరించలేదు. కాఫ్కా శైలి గురించి ఆయనే ఒక చోట ఇలా చెప్తాడు: ‘‘కాఫ్కా రచన - భూమికి రెండు అడుగుల పైన మెల్లగా నడుస్తున్న నడకలా ఉంటుంది.’’


ఇది చాలా మంచి పోలిక: భూమికి రెండడుగుల పైన నడక. అలాగని ఆ నడకలో తొట్రుపాటు ఏం లేదు. ఆ నడక మెల్లగా ఉంది. కాఫ్కాది చాలా స్పష్టమైన నేరేషన్‌ (స్పష్టమైన అర్థాన్నివ్వదు, అది వేరే సంగతి), కాఫ్కా వాక్యాలు వ్యాకరణబద్ధమై ముగుస్తాయి, కాఫ్కా భాష సాహిత్య భాష, కాఫ్కా సన్నివేశాలు- మన భూమిలాగే ఉన్నా కొద్దిగా లెక్కలు వేరైన మరో గ్రహం మీద జరుగు తున్నట్టు ఉంటాయి. ఈ లక్షణాలు వేటినీ త్రిపుర కథలకు అన్వయించలేం.


కాఫ్కా రచన ‘‘భూమికి రెండడుగుల పైన మెల్లగా నడిచే నడక’’ ఐతే, త్రిపుర రచన మాత్రం- చెరువునీటి మీదకు ఏటవాలుగా విసిరిన చిల్లపెంకు వేసే గెంతులు. ఈ పోలికని ఇంకా విస్తరించి అన్వయించవచ్చు. అసలక్కడ నిజంగా జరిగిన కథని చెరువు అనుకుంటే, దాని మీద చిల్లపెంకు గెంతులే త్రిపుర నేరేషన్‌. త్రిపుర ఏదీ కళ్లకు కట్టినట్టు చెప్పే ప్రయత్నం చేయడు. అయినా ఎసెన్షియల్‌ సరంజామా మాత్రం అక్కడ సమకూరుతుంది. అలా ఎలా అంటే, త్రిపుర కథలన్నీ జీవితంలోంచి వచ్చినవే కాబట్టి.


కల్పించి రాసే రచయిత ఆ కల్పిస్తున్న కథని తాను కూడా అప్పుడే చూస్తాడు. కాబట్టి తన కోసమైనా సరే దాన్ని స్పష్టంగా నిర్మించుకుంటాడు. కానీ జీవితంలోంచి రాసే రచయితకి కథ అంతా ముందే సిద్ధంగా ఉంటుంది. అందులోంచి కొన్ని ఎసెన్షియల్‌ వివరాల్ని మాత్రం ఎన్నుకుంటే అతనికి చాలు. అప్పుడు కూడా, పాఠకుల స్పృహ పెద్దగా లేని రచయిత ఐతే, ఆ వ్యక్తీకరణ మరీ క్లుప్తంగా టెలిగ్రామ్‌ మెసేజుల్లాగ మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ రచయితకి కథ అల్లడం కన్నా, తలపోత ముఖ్యం కాబట్టి. 


త్రిపుర ఎప్పుడూ le mot juste (ఒక్కగానొక్క సరైన పదం)కోసం వెతుక్కుని చెమట్లు పట్టించుకున్న రచయిత అనిపించడు. ఇలా వెతుక్కోవటంలో ఒక ఇబ్బంది ఉంది. అనుభవాన్ని కచ్చితంగా రిప్రెజెంట్‌ చేసే ఒకేవొక్క పదాన్ని మనం ఎక్కణ్ణుంచో వెతికి తేవచ్చు; కానీ ఆ అపరిచిత పదం అనుభవానికీ మనకీ మధ్య ఇంటిమసీని పోగొడుతుంది. త్రిపుర పదాలు అనుభవాన్ని ఒడ్డునే నిలబడి తోడేవి కాదు. అసలు రాసేటప్పుడు ఆయనా అనుభవమూ వేరు కాదు. అనుభవ తటాకంలోకి మరలా దూకితే కాయితంపైకి చిప్పిల్లే నీటి తుంపరలే ఆయన పదాలు. 


ఈ లక్షణాలన్నీ ఈ టెలిగ్రాఫిక్‌ స్టయిల్‌ నేరేషన్‌, తడుములాట లేకుండా తెరతెరలుగా వచ్చిపడే ఇంటిమేట్‌ భాష ఇవన్నీ-- త్రిపురకి కాఫ్కా నుంచి వచ్చినవి కాదు. త్రిపుర తన ప్రభావాల గురించి వివరంగా ఎక్కడా మాట్లాడ లేదు. కానీ ఇంటర్వ్యూల్లో ప్రస్తావించిన కొన్ని పేర్లను బట్టి కొంత గ్రహించవచ్చు. ఇక్కడ నా ఉద్దేశం ప్రభావాల వేట కాదు. ప్రపంచ సాహిత్యంలో ఆయన సహోదరులెవరో గమనించడం. ఫ్రెంచ్‌ రైటర్‌ సెలీన్‌ తన అభిమాన రచయిత అని త్రిపుర ఒక చోట చెప్పుకున్నాడు. సెలీన్‌ ‘డెత్‌ ఇన్‌ ఇన్‌స్టాల్మెంట్‌ ప్లాన్‌’ చదువుతున్నప్పుడు ఆ వ్యక్తీకరణ శైలి త్రిపుర వ్యక్తీకరణ శైలికి ఎంత దగ్గరగా ఉందో కదా అనిపించింది. అలాగే త్రిపుర ప్రస్తావించిన రచయితల్లో బీట్‌ జెనరేషన్‌ రచయిత జాక్‌ కురవాక్‌ కూడా ఉన్నాడు. అతను ‘‘స్పాంటేనియస్‌ ప్రోజ్‌’’ అన్న పద్ధతిని పాటించి ప్రకటించాడు. స్పాంటేనియస్‌ వచనం అంటే ఒక పథకం లేకుండా తట్టింది తట్టినట్టు రాస్తూపోవటం; సబ్‌ కాన్షస్‌తో ఒక డీప్‌ కనెక్షన్‌ కుదిరినప్పుడు, కాన్షస్‌ ఉద్దేశాలన్నింటినీ రద్దు చేసుకోగలిగినప్పుడు, బుద్ధికి ఎప్పటికీ వీలుకాని పరిపూర్ణతతో వెల్లువెత్తే వచనం. ఇది త్రిపుర శైలి. 


త్రిపుర కథలు రాయటం మానుకోవటం వెనుక రచయిత అనే ఐడెంటిటీ అంటే ఆయనకు లెక్కలేకపోవటాన్నీ, దరిమిలా ఆయన్ను ఆవరించిన జెన్‌ మౌనాన్నీ కారణంగా చెప్తారు. నిజమే అయ్యుండొచ్చు. కానీ తన కథలపై విమర్శకులు వేసిన సంబంధంలేని ముద్రలతోపాటు (అబ్సర్డిటీ, సర్రియలిజం, ఎగ్జిస్టెన్షియలిజం), ఎక్కువమంది పాఠకుల నుంచి వచ్చిన అవి అర్థం కావన్న ఆరోపణ కూడా ఆయన్ని ఎంతో కొంత నిరాశపరచి ఉండదా అనిపిస్తుంది. ఏ రచయితైనా తనలాంటి వాళ్లు కొంతమంది ఉంటారన్న నమ్మకంతో రాస్తాడు. త్రిపుర తను ఎక్కడకు వెళ్ళినా తనతోపాటు వచ్చే పాఠకులు కొందరైనా ఉంటారని రాశాడు. తనకు ఇష్టమని చెప్పుకున్న పొయెటిక్‌, ఇన్‌కంప్లీట్‌ వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి పాఠకులలో ఉంటుందని ఆశించాడు. కానీ, తన దగ్గరవాళ్ళకి కూడా అవి పెద్దగా అర్థంకాకపోవటం ఆయన్ని నిరాశపరిచి ఇకచాల్లే అనిపించేలా చేసిందా అనిపిస్తుంది. తన మిత్రుడైన ఒక కవికి తన కథలు అర్థం కాలేదని ఇలా వాపోతాడు: ‘‘కథలు మెచ్చుకుంటాడు. కాని, కథల ఫ్రేమ్‌ అర్థం కాదు. త్రిపురగార్ని ఎవరో ఆవహించి రాయించారంటారు.’’  


సినిమా అనే కళ పుట్టిన కొత్తలో కెమెరా వైపుకి రైలు వస్తున్న షాట్‌ ప్రదర్శించగానే థియేటర్లో ప్రేక్షకులు భయంతో బైటికి పరిగెట్టారట. అలాగే అప్పటిదాకా స్టేజీ మీద నాటకాలు మాత్రమే చూసిన అనుభవంతో సినిమాలో క్లోజప్‌ షాట్‌ రాగానే నటుల మొహాలు అంత దగ్గరగా కనిపించటం ప్రేక్షకులకి కొత్తగా ఉండేదట. సినిమా గ్రామర్‌ అభివృద్ధి చెందినకొద్దీ, ప్రేక్షకులు ఆ గ్రామర్‌కి అలవాటు పడినకొద్దీ, సంక్లిష్టమైన పద్ధతుల్లో చెప్పిన నెరెటివ్స్‌ కూడా సులువుగా ఇంకుతున్నాయి. మరి అలాగ సాహిత్యానికి కూడా ఒక గ్రామర్‌ ఉంటుంది. త్రిపుర కథలు అర్థం కాకపోవటం అంటే అలాంటి సాహితీ వ్యాకరణంలో ఆ పాఠకుడు ఒక స్థాయి వరకే వచ్చి ఆగిపోయాడని అర్థం. న్యూస్‌ పేపర్ల స్థాయి వచనంతోనే అందరూ అన్ని కథలూ చెప్పలేరు. అలా చెప్పివుంటే అవి త్రిపుర కథలు అయివుండేవి కాదు. వాటి ప్రభావం--అచ్చయిన తర్వాత ఈ ముప్ఫై ఏళ్ళల్లోనూ అవి సమకూర్చుకుంటూ వస్తున్న అతికొద్దిమంది పాఠకుల పైన-- అంత గాఢంగా ఉండేది కాదు. అసలు త్రిపుర కథల గురించి వస్తువనీ, శిల్పమనీ ద్వంద్వాల్లో మాట్లాడలేము. అవి అలా తప్ప ఇంకెలానూ బైటపడే అవకాశమే లేదు. 


‘‘స్టోరీలు ఆటోబయోగ్రఫికల్‌గా ఉండాలి. కన్ఫెషనల్‌ ఎలిమెంట్‌ లేని సాహిత్యం సాహిత్యం కాదు’’ అన్న త్రిపుర, అలాంటి వ్యక్తీకరణకు అనువుగా తన ఇన్‌స్ర్టుమెంట్‌ని సవరించు కున్నాడు. అదేమంత సులువుగా అయింది కాదు. కథలు రాయటం మొదలుపెట్టేనాటికి త్రిపురకి తెలుగు ప్రపంచంతో, తెలుగు భాషతో సంబంధం తెగిపోయింది. మరి అనర్ఘళంగా ఇంగ్లీషులో రాయగలిగిన ఈ ఇంగ్లీషు లెక్చరర్‌కి తెలుగులోనే ఎందుకు రాయాలనిపించింది? విపరీతంగా కవిత్వాన్ని చదివిన ఈ కవిత్వ ప్రేమికుడికి కథలే ఎందుకు రాయాల నిపించింది? తన తండ్రి చనిపోవటానికీ, తనకి తెలుగులో కథలు రాయాలనిపించటానికీ తనకే తెలియని సంబంధం ఏదో ఉందంటాడు త్రిపుర. ‘‘మా నాన్నగారు మరణించటం రకరకాలుగా నన్ను విడదీసింది. దివాళా తీయించినట్లు చేసింది,’’ అంటాడు. ఆ ఖాళీతనంలోంచి ఆయన కథలు రాయటం మొదలుపెట్టాడు. కానీ రాయటం సులువు కాలేదు. భాష సాయపడలేదు. ప్రక్రియ అలవాటైంది కాదు. ఒకచోట ‘‘ముప్ఫై భారతి పత్రికలు చదివి తెలుగు నేర్చుకున్నాను’’ అంటాడు. కొన్ని ఇంగ్లీషు పదాలకి తెలుగు పదాలని వెతుక్కుని వాటితో సొంతంగా చిన్న నిఘంటువు తయారు చేసుకున్నాడు (‘‘కర్లీ హెయిర్‌ పక్కన వంకుల జుత్తు అని రాసుకునేవాణ్ణి’’). అప్పటికీ కథల్లో కొన్ని ఇంగ్లీషు ఇడియమ్స్‌ తెలుగులోకి యథాతథంగా అనువాదం కావటం మనకి తెలుస్తుంది. ఉదాహరణకి ""paint the town red'' అన్న అర్థంలో జర్కన్‌ కథలో వీరాస్వామి ‘‘మీ చేత రంగూన్‌కి ఎర్ర రంగు పూయిస్తాను’’ అంటాడు. అలాగే ఇంకోచోట ""poet at heart'' అన్న ఎక్స్‌ప్రెషన్‌ ‘‘అతను హృదయంలో కవి’’ అని మారుతుంది. మొత్తానికి ఇలా భాషని కష్టం మీద సమకూర్చుకుని రాయటంలోకి దిగాడు. అయినా వెంటనే ఒకేసారి మనకు పరిచయమైన లోతుల్లోకి దిగిపోలేదు. ఆయన కథలు పబ్లిష్‌ అయిన క్రానాలజీని బట్టి ఆయన మెల్లగా తన ఇన్‌స్ర్టుమెంట్‌ని సవరించుకున్న తీరు తెలు స్తుంది. మొదట జేమ్స్‌ థర్బర్‌ ఇంగ్లీషు కథ ‘సీక్రెట్‌ లైఫ్‌ ఆఫ్‌ వాల్టర్‌ మిట్టీ’కి స్వేచ్ఛానువాదంతో రాయటం మొదలు పెట్టాడు. తర్వాత తనకు గతంలో పరిచయమున్న ఒక చిత్రమైన వ్యక్తిలోకి శేషు పేరుతో ‘పాము’ కథ ద్వారా పరకాయ ప్రవేశం చేశాడు. తర్వాత ఏదో ‘హోటల్లో’ కూర్చుంటే చెవిన పడ్డట్టనిపించే వొట్టి సంభాషణా శకలాల్తో మరో కథ పేర్చాడు. ఇక అప్పుడు, ‘ప్రయాణీకులు’ కథతో కాన్ఫిడెంట్‌గా ‘నేను’ అని తన అనుభవాన్ని ఆవిష్కరించటం మొదలు పెట్టాడు. అక్కడ నుంచి ఒక్కో కథనీ ఎంతో లోతుల్లోంచి కన్ఫెస్‌ చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇన్‌స్ర్టుమెంట్‌ ఆయన అధీనంలోకి వచ్చేసింది. రాతతో సులభమైన, ఎంతో సౌకర్య వంతమైన సంబంధం ఏర్పడింది. ఇక వరుసగా ‘భగవంతం కోసం’, ‘చీకటిగదులు’, ‘కేసరివలె కీడు’, ‘జర్కన్‌’, ‘కనిపించని ద్వారం’, ‘వంతెనలు’... ఒక్కో కథ ఒక్కో ఆణిముత్యం. 


‘‘...(కథ రాసే ప్రాసెస్‌) ఇలా అని కచ్చితంగా ఏమీ వుండదు. ఒక ఆర్డర్‌ వుంటుంది. నాకు తెలిసిన అనేక విషయాల్ని దాంట్లో చేరుస్తూ పోతాను. కొన్ని వాటంతటవే వచ్చి చేరుతూ వుంటాయి.... అంటే అవేం గాలిలోంచి వూడిపడవు. మనం కాస్త ఫ్లెక్సిబుల్‌గా వుంటే, కలైడోస్కోప్‌లో ఏర్పడతాయి చూడండి... డిఫరెంట్‌ డిఫరెంట్‌ కాంబినేషన్స్‌... మనం డిక్టేట్‌ చెయ్యకుండానే ఏర్పడతాయి. ఏర్పడనివ్వాలి చేత్తో అలా తిప్పి.’’ 

త్రిపుర 


ఈ పుస్తకంలోని కథల్లో త్రిపుర తన అంతరంగపు లోతుల్లోకి ఏ ఆసరా లేకపోయినా, కింద ఏ వలా లేకపోయినా సర్కస్‌లో ్టట్చఞ్ఛ్డ్ఛ ్చట్టజీట్ట లాగా సాహసంతో నమ్మకంతో దూకు తాడు, మనల్నీ దూకమంటాడు. ఇది జ్ఛ్చూఞ ౌజ జ్చజ్టీజి... ఆయన వైపు నుంచీ, మన వైపు నుంచీ కూడా. అర్థరాహిత్యంలోకి పడిపోతున్నామేమో అనిపించే ఆఖరి క్షణంలో మన చేతులు అందుకుంటాడు, ప్రతి సారీ, ప్రతి వాక్యంలోనూ! రాస్తూ రాస్తూ ఆయన తన అంతరంగం లోని ఎంతెంతటి లోతుల్లోకి దూకుతాడంటే, చివరికి మన అంతరంగంలోంచి పైకి తేలతాడు. మన అనుభవ ప్రపంచం మరొకరి అనుభవ ప్రపంచంతో సాంతం అనుకంపించే ఇలాంటి సందర్భాలు మాజికల్‌! ఆయన వెంట ఎంతో ఇంటిమేట్‌ దూరాల్లోకి పోగలిగాను. జీవితమొక జ్ఞాపకం కాబట్టి- ఆయన చూపించినవన్నీ, అక్కడ కనిపించినవన్నీ, నాకు చాలా ముఖ్యం అనిపించాయి. త్రిపుర రచనా సర్వస్వాన్ని ఎత్తిపట్టుకోవటానికి రెండు వేళ్ళ మధ్య తేలిక పాటి ఒత్తిడి చాలు. అయినా త్రిపుర పుస్తకాలు నాకు స్పిరిచ్యువల్‌ హోం అనిపిస్తాయి.


(త్రిపుర పుట్టిన రోజు సెప్టెంబర్‌ 2న ఆయన కథల సంపుటి నాల్గవ ముద్రణ అనల్ప పబ్లికేషన్స్‌ ద్వారా విడుదలవుతోంది. అమెజాన్‌లో లభ్యం. ముందుమాట నుంచి కొన్ని భాగాలివి.)

మెహెర్‌


Updated Date - 2020-08-31T06:48:59+05:30 IST