స్నేహితుడు

ABN , First Publish Date - 2020-10-28T06:09:53+05:30 IST

చదువైపోయి... కెరీర్‌ వేటలో పడ్డవాడికి కేరాఫ్‌ అడ్రెస్‌ హైదరాబాదే కదా! అలా మహానగరానికి తొలిసారి వచ్చిన ఓ కుర్రాడి కథే ‘హైదరాబాదీ ఫ్రెండ్‌’. ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ఊరు నుంచి హైదరాబాద్‌ వస్తాడు ఓ కుర్రాడు. దిగగానే తన స్నేహితుడికి ఫోన్‌ చేస్తాడు...

స్నేహితుడు

చదువైపోయి... కెరీర్‌ వేటలో పడ్డవాడికి కేరాఫ్‌ అడ్రెస్‌ హైదరాబాదే కదా! అలా మహానగరానికి తొలిసారి వచ్చిన ఓ కుర్రాడి కథే ‘హైదరాబాదీ ఫ్రెండ్‌’. ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ఊరు నుంచి హైదరాబాద్‌ వస్తాడు ఓ కుర్రాడు. దిగగానే తన స్నేహితుడికి ఫోన్‌ చేస్తాడు... ఫలానా చోట ఉన్నాను... రమ్మని! అనుకోకుండా అదే సమయంలో స్నేహితుడు పని మీద వేరే ప్రాంతానికి వెళుతుంటాడు. అయితే ‘నీకేం ఇబ్బంది లేదు... రూమ్‌లో పాండు గాడు ఉన్నాడు. వెళ్లు’ అంటాడు స్నేహితుడు.


‘వాడెవడు?’. ‘నా రూమ్‌మేట్‌లే’... బదులిస్తాడు స్నేహితుడు. ‘నన్ను రమ్మని నువ్వు ఎక్కడికో వెళ్లిపోతావేమిటిరా’ అంటూ స్నేహితుడిపై గరం అవుతాడతడు. ‘అనుకోకుండా పని పడింది. ఏం పర్లేదు... పాండుగాడు చూసుకొంటాడు పో’ అంటూ ఫోన్‌ పెట్టేస్తాడు స్నేహితుడు. రూమ్‌కు వెళ్లగానే అతడిని ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు పాండు. టిఫిన్‌ పెట్టి, హైదరాబాద్‌ ముచ్చట్లు చెబుతాడు. నగర అందాలనే కాదు... అక్కడ దొరికే ఇరానీ చాయ్‌, రాత్రి వేళల్లో వడ్డించే హోటళ్లు... ఇలా అన్నింటినీ ఆస్వాదిస్తుంటాడు పాండు. తనలా నగరాన్ని ఆస్వాదించాలని కొత్త ఫ్రెండ్‌కు కూడా చెబుతాడు. కళ్లు మూసి తెరిచినట్టు గిర్రున వారం తిరిగిపోతుంది. మనోడు ఇంటర్వ్యూకు బయలుదేరుతుంటాడు. ఇంతలో స్నేహితుడు వస్తాడు. జాబ్‌ రాగానే రాత్రి మందు పార్టీ చేసుకొందామంటాడు. కానీ కొత్త ఫ్రెండ్‌కి ఉద్యోగం రాదు. ఇంటికి తిరిగి వెళ్లిపోతానంటే... ‘అదేం వద్దు... రూమ్‌కు రా’ అంటాడు స్నేహితుడు. రూమ్‌కు రాగానే... అంతా కలిసి పార్టీ చేసుకొంటారు. ‘ఉద్యోగం వచ్చినా... రాకపోయినా... ఈ దావత్‌లు ఉంటూనే ఉంటాయి’ అని ముగ్గురు స్నేహితులు అంటుండగా శుభం కార్డు పడుతుంది. స్నేహంలోని గొప్పతనాన్ని, మాధుర్యాన్ని చెప్పే ఈ లఘుచిత్రానికి రచన, దర్శకత్వం శశాంక్‌ భాస్కర్‌. యూట్యూబ్‌లో విడుదలైన గంటల వ్యవధిలోనే యాభై వేలకు పైగా వ్యూస్‌ సంపాదించిదీ చిత్రం.

Updated Date - 2020-10-28T06:09:53+05:30 IST