ఓహో.. గులాబి బంతి!

ABN , First Publish Date - 2020-12-16T06:05:24+05:30 IST

ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా భారత జట్టు డే/నైట్‌ టెస్టుకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి అడిలైడ్‌లో జరిగే ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం ఆరంభమై ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ముగుస్తుంది...

ఓహో.. గులాబి బంతి!

ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా భారత జట్టు డే/నైట్‌ టెస్టుకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి అడిలైడ్‌లో జరిగే ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం ఆరంభమై ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ముగుస్తుంది. అయితే టెస్టుల్లో సంప్రదాయకంగా ఉపయోగించే ఎరుపు బంతిని ఈ తరహా మ్యాచ్‌ల్లో వాడరు. మైదానంలో ఉన్న ఆటగాళ్లకు కృత్రిమ వెలుతురులోనూ బంతి స్పష్టంగా కనిపించేందుకు గులాబీ బంతిని వాడడం ఆనవాయితీ. ఈనేపథ్యంలో ప్రపంచ క్రికెట్‌లో ఈ ‘గులాబీ’ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే.. 


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

  1. 2009లో తొలిసారిగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మహిళల వన్డేలో గులాబీ బంతిని ప్రయోగాత్మకంగా వాడారు.
  2. 2010, జనవరిలో గయానా-ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో జట్ల మధ్య జరిగిన ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ కూడా పింక్‌ బాల్‌తోనే జరిగింది. అలాగే ఇతర దేశాల్లోనూ ఈ తరహా ప్రయోగాలు ఊపందుకున్నాయి. 
  3. మొదటి నుంచీ డే/నైట్‌ టెస్టులపై ఆసక్తి ఉన్న ఆసీస్‌ 2014లో షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌ను పూర్తిస్థాయిలో గులాబీ బంతితోనే నిర్వహించింది.  
  4. ఇక అంతర్జాతీయస్థాయిలో తొలి డే/నైట్‌ టెస్టు 2015, అడిలైడ్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగింది. ఇందులో ఆతిథ్య జట్టు ఆసీస్‌ మూడో రోజే 3 వికెట్ల తేడాతో గెలిచింది.
  5. భారత్‌ విషయానికి వస్తే.. చాలా ఆలస్యంగానే గులాబీ టెస్టుల్లోకి అడుగుపెట్టింది. అప్పట్లో డీఆర్‌ఎ్‌సతో పాటు డే/నైట్‌ టెస్టులపైనా అనాసక్తి చూపించింది. క్రితంసారి (2018-19) ఆసీస్‌ పర్యటనలో గులాబీ టెస్టు ఆడేందుకు కూడా భారత్‌ నిరాకరించింది. అయితే బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ రాకతో పరిస్థితులు మారాయి. గతేడాది తొలిసారిగా ఈడెన్‌లో కోహ్లీ సేన బంగ్లాదేశ్‌తో ఆడగా మ్యాచ్‌ను రెండు రోజుల్లోనే ముగించింది. ఓవరాల్‌గా ఇలాంటి మ్యాచ్‌ ఆడిన తొమ్మిదో జట్టుగా భారత్‌ నిలిచింది. 
  6. 1997లో ముంబై-ఢిల్లీ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ను రాత్రి వేళ జరిపారు. అయితే ఇందులో తెలుపు బంతిని వినియోగించారు.
  7. గులాబీ, ఎరుపు, తెలుపు బంతుల్లో ప్రధాన భాగమంతా ఒక్కటే. కానీ పింక్‌ బాల్‌పై ఉన్న లెదర్‌కు పింక్‌ పిగ్మెంట్‌తో కోటింగ్‌ చేస్తారు. మ్యాచ్‌ ఆరంభంలో ఇతర బంతులకన్నా ఎక్కువగా ఇవి స్వింగ్‌ అవుతుంటాయి.
  8. ప్రస్తుతం కూకాబుర్రా గులాబీ బంతులకు నల్లటి దారాలతో కుట్టు వేస్తున్నారు. గతంలో ఆకుపచ్చ, తెలుపుతో కూడిన సీమ్‌ ఉండేది. తొలి గులాబీ టెస్టులో ఈ కాంబినేషన్‌ స్పష్టంగా కనిపిస్తూ ఆటగాళ్లకు చికాకు పెట్టింది. దీంతో అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌ ఫిర్యాదు మేరకు 2016 నుంచి సీమ్‌లో మార్పు చేశారు.
  9. ఎరుపు బంతితో పోలిస్తే రంగు, మెరుపు ఎక్కువ సేపు ఉండేందుకు గులాబీ బంతిపై అదనంగా లక్కతో పూత పూస్తారు. 

Updated Date - 2020-12-16T06:05:24+05:30 IST