రామ చిలుకలు

ABN , First Publish Date - 2020-12-13T06:12:53+05:30 IST

ఒక చెట్టుపై రెండు రామచిలుకలు గూడు కట్టుకుని పిల్లలతో కలిసి సంతోషంగా ఉండేవి. ఒకరోజు అవి ఆహారం కోసం బయటకు వెళ్లినప్పుడు వేటగాడు చెట్టుపైన ఉన్న వాటి పిల్లలను తీసుకెళ్లాలని చూశాడు...

రామ చిలుకలు

ఒక చెట్టుపై రెండు రామచిలుకలు గూడు కట్టుకుని పిల్లలతో కలిసి సంతోషంగా ఉండేవి. ఒకరోజు అవి ఆహారం కోసం బయటకు వెళ్లినప్పుడు వేటగాడు చెట్టుపైన ఉన్న వాటి పిల్లలను తీసుకెళ్లాలని చూశాడు. అప్పుడు ఒక చిలుక వేటగాడి చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. దగ్గరలో ఉన్న ఆశ్రమంలోని చెట్టుపై ఆశ్రయం పొందింది. మరో చిలుక మాత్రం వేటగాడి చేతుల్లో నుంచి తప్పించుకోలేకపోయింది.


వేటగాడు ఆ చిలుకను ఇంటికి తీసుకెళ్లి పంజరంలో పెట్టాడు. కొన్నాళ్లకు ఆ రెండు చిలుకలు పెద్దవయ్యాయి. ఒకరోజు ఒక బాటసారి ఆ వేటగాడి ఇంటికొచ్చాడు. వాణ్ణి చూసిన చిలుక ‘‘ఓరి మూర్ఖుడా! ఇక్కడ నీకేం పని. ఇంకొద్ది సేపు ఇక్కడ ఉన్నావంటే నీ తల పగలగొడతా!’’ అని పలికింది. దాంతో బాటసారి భయపడిపోయి అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు. చివరకు ఆశ్రమాన్ని చేరి కాసేపు సేదతీరాలని నీడ కోసం అటూ ఇటూ చూస్తుండగా, అదే చెట్టుపై ఉన్న మరో చిలుక ‘‘స్వాగతం మానవా! రండి, మా ఆశ్రమంలో సేద తీరండి’’అని పలికింది. ఆ మాటలు విన్న బాటసారి ‘‘ఓ చిలుకా! నీవు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. ఇందాకే వేటగాడి ఇంటి దగ్గర ఒక చిలుకను చూశాను. ఆ చిలుక మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి’’ అన్నాడు. వేటగాడి దగ్గర ఉన్న చిలుక తన సోదరుడే అని గ్రహించింది. వేటగాడి ఇంట్లో ఉండడం వల్ల చిలుక అతడి లాంటి మాటలే నేర్చుకుంది. మరో చిలుక ఆశ్రమంలో ఉండటం వల్ల మంచి మాటలు నేర్చుకుంది. అందుకే మంచి సాంగత్యం వల్ల మంచి అలవాట్లు అబ్బుతాయంటారు.

Updated Date - 2020-12-13T06:12:53+05:30 IST