న్యాయభారతంలో జరుగుతున్న కథ!

ABN , First Publish Date - 2022-01-19T05:43:09+05:30 IST

ఇదిఎక్కడో ఉత్తరాఖండ్‌లో పనిచేసిన జర్నలిస్టు కథ కావచ్చు. ఆయన పద్నాలుగేళ్ల కింద అబద్ధపు ఆరోపణలతో ఒక కేసులో నిందితుడై, సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు నిర్దోషిగా కేసు నుంచి విముక్తుడై...

న్యాయభారతంలో జరుగుతున్న కథ!

ఇదిఎక్కడో ఉత్తరాఖండ్‌లో పనిచేసిన జర్నలిస్టు కథ కావచ్చు. ఆయన పద్నాలుగేళ్ల కింద అబద్ధపు ఆరోపణలతో ఒక కేసులో నిందితుడై, సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు నిర్దోషిగా కేసు నుంచి విముక్తుడై ఉండవచ్చు. ఈలోగానే బనాయించిన మరొక అబద్ధపు కేసులో యావజ్జీవ శిక్ష పడి అరవై రెండేళ్ల వయసులో మహారాష్ట్రలోని అమరావతి జైలులో ఏకాంతవాస శిక్షలో మగ్గిపోతుండవచ్చు. దీనంతటితో మనకేం సంబంధమని అనిపించవచ్చు. కాని ఇవాళ ఇది దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా జరిగే అవకాశం ఉన్న కథ. విస్తరిస్తున్న రాజ్య బీభత్సానికి చిహ్నమైన కథ. జవాబుదారీతనం లేని, పారదర్శకత లేని, సత్యాన్వేషణ నియమం లేని, అబద్ధాల కల్పనే అలవాటైపోయిన భారత రాజ్యాంగ యంత్రపు రథచక్రాల కింద నలిగిపోతున్న అసంఖ్యాక అభాగ్యులకు ప్రతీక అయిన కథ.


ఆయన పేరు ప్రశాంత్ రాహీ. మహారాష్ట్రలో పుట్టిన ప్రశాంత్ రాహీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని ఐఐటీలో ఎంటెక్ చదువుతున్నప్పుడే ప్రగతిశీల, ప్రత్యామ్నాయ విద్యార్థి రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. ఎంటెక్ తర్వాత డెహ్రాడూన్ నుంచి వెలువడే హిమాచల్ టైమ్స్ విలేఖరిగా కొన్ని సంవత్సరాలు పని చేసి, ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక ఇంగ్లిష్ దినపత్రిక ది స్టేట్స్‌మన్‌కు ఉత్తరాఖండ్ రాష్ట్ర విలేఖరి అయ్యారు. స్టేట్స్‌మన్‌ విలేఖరిగా ఉన్న రోజుల్లోనే, 1990ల్లో ఉధృతంగా సాగుతుండిన ఉత్తరాంచల్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మేధావిగా, పత్రికారచయితగా మాత్రమే కాక కార్యకర్తగా కూడ క్రియాశీలంగా పాల్గొన్నారు. స్టేట్స్‌మన్‌ ఉద్యోగం వదిలేసి స్వతంత్ర జర్నలిస్టుగా, ఉత్తరాఖండ్ సంయుక్త సంఘర్ష్ సమితి అనే ప్రజా సంఘాల సమాఖ్యలో పూర్తికాలం సామాజిక కార్యకర్తగా మారారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ద్రోహం చేసిన పాలకులు 2005లో ప్రజాఉద్యమాల మీద విరుచుకుపడి, ప్రత్యేక అణచివేత చట్టాలు తెచ్చి వందలాది మందిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు, ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా గొంతెత్తారు.


అలా ప్రశాంత్ రాహీ రెండు దశాబ్దాల పాటు సాగించిన నిర్విరామ కృషికి ఆగ్రహించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2007 డిసెంబర్‌లో ఆయనను, మరొక ముగ్గురిని మావోయిస్టులుగా చూపుతూ రాజద్రోహం, రాజ్యం మీద యుద్ధం, కుట్ర వంటి భారత శిక్షాస్మృతి ఆరోపణలతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (అన్‌ లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్ – యుఎపిఎ) కింద కూడా కేసు బనాయించింది. పద్నాలుగేళ్ల విచారణ తర్వాత మొన్న జనవరి 7న ఉద్ధమ్‌సింగ్‌నగర్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ప్రేమ్‌సింగ్ ఖిమాల్ నిందితుల మీద ఏ ఒక్క ఆరోపణనూ పోలీసులు రుజువు చేయలేకపోయారని, కేసు కొట్టివేసి, వారిని నిర్దోషులుగా ప్రకటించారు. ఈ న్యాయమూర్తి ఈ తీర్పు వెలువరించడానికి ముందే వాదనలన్నీ విని, విచారణ పూర్తి చేసిన ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయిపోగా, చివరికి నాలుగో న్యాయమూర్తిగా ఖిమాల్ మళ్లీ విచారణ జరిపి ఈ తీర్పు ఇవ్వవలసి వచ్చింది.


ఈ కేసు బనాయించినప్పుడు, ఇది ఉత్తరాఖండ్‌లో నక్సలిజం మీద గొడ్డలిపెట్టు అనీ, ఇది తాము సాధించిన గొప్ప విజయమనీ పత్రికా సమావేశాల్లో ప్రగల్భాలు పలికిన పోలీసులు, ఇది అబద్ధపు కేసు గనుక ఒక్కటంటే ఒక్కటైనా సక్రమమైన సాక్ష్యాధారం సమర్పించలేకపోయారు. పోలీసు సాక్షులు కాకుండా, పోలీసులు ప్రవేశపెట్టిన ముగ్గురు సాక్షుల్లో ఒకరు 2004లో జరిగిన సంఘటన గురించి తనతో సాక్ష్యం చెప్పించి దాన్ని 2007 సంఘటనగా చూపుతున్నారని అనడంతో ఆ సాక్ష్యం ఎగిరిపోయింది. మిగిలిన ఇద్దరు సాక్షులు పోలీసులు చెప్పమన్న అబద్ధాలు చెపుతున్నారని క్రాస్ ఎగ్జామినేషన్‌లో బైటపడి, స్వతంత్ర సాక్ష్యాలన్నీ చెల్లకుండాపోయాయి. ఇటువంటి సాక్ష్యాలు చెప్పమని పోలీసులు తమ మీద ఒత్తిడి తెచ్చారని సాక్షులు న్యాయస్థానం ముందు ఒప్పుకున్నారు. చివరికి పోలీసు సాక్షుల్లో కూడ ఒకరు చెప్పినదానికీ, మరొకరు చెప్పినదానికీ పొంతన లేక, అవి కూడా నమ్మశక్యమైనవి కావని న్యాయస్థానం భావించింది. ఏడుగురు సాయుధ పోలీసుల బృందం నిరాయుధులైన ఐదుగురు మావోయిస్టులు అడవిలో ఉండగా గుర్తించి, వారిలో ఒక్క ప్రశాంత్ రాహీనే పట్టుకోగలిగిందనీ, మిగిలిన వారు పారిపోయారనీ పోలీసులు చెప్పిన కథనం నమ్మశక్యంగా లేదని న్యాయస్థానం భావించింది. 2007 డిసెంబర్‌లో డెహ్రాడూన్‌లో రోడ్డు మీద నడిచి వెళ్తుండగా మఫ్టీలో ఉన్న ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు తనను ఎత్తుకుపోయి, అయిదురోజులు అక్రమ నిర్బంధంలో ఉంచి, చిత్రహింసలు పెట్టారని ప్రశాంత్ రాహీ న్యాయస్థానానికి చెప్పారు.


ప్రశాంత్ రాహీ దగ్గర దొరికిన నిషిద్ధ సాహిత్యం అని పోలీసులు చూపిన పుస్తకాలలో నిషేధానికి గురి అయినది ఒక్కటి కూడా లేదని న్యాయస్థానం నిర్ధారించింది. ప్రశాంత్ రాహీ దగ్గర హరిద్వార్ జైలు పటం ఉన్న ఒక సిడి దొరికిందని, జైలులో ఉన్న నక్సలైట్ ఖైదీలను విడిపించడానికి ఆయన పథకం రచిస్తున్నాడని పోలీసులు చేసిన ఆరోపణను కొట్టివేస్తూ, ఆ సిడిలో బైటి నుంచి హరిద్వార్ జైలు గోడ మాత్రమే ఉందని, పైగా ఎవరిని జైలు నుంచి తప్పించడానికి ప్రశాంత్ పథక రచన చేశాడని ఆరోపిస్తున్నారో, వాళ్లు అంతకు ముందే విడుదలైపోయారని న్యాయస్థానం గుర్తించింది. ఇది ఎంతో కీలకమైన కేసు అని చెప్పుకున్న పోలీసులు, కేసు నమోదు చేయడంలో, ఆధారాలు సేకరించడంలో, ప్రభుత్వ అనుమతులు తీసుకోవడంలో కనీసపు చట్టబద్ధమైన పద్ధతులను కూడా పాటించలేదని న్యాయస్థానం ఎత్తిచూపింది.


ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసుల కేసు తప్పుల తడక, అబద్ధాల పోగు అని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇది ఈ దేశంలో ఈ ఒక్క కేసుకు సంబంధించినది మాత్రమే కాదు. ప్రభుత్వ వ్యతిరేకుల గొంతు వినిపించకుండా చేయడానికి పాలకుల ఆదేశాల మీద పోలీసులు బనాయిస్తున్న కేసులన్నీ ఇటువంటివే. ఎన్ని అబద్ధపు ఆరోపణలైనా చేయవచ్చు, తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించవచ్చు, భారీ పత్రికా సమావేశాలు పెట్టి అభూతకల్పనలతో బ్రహ్మాండం బద్దలు చేయవచ్చు. నిందితులను నాలుగేళ్లో, అయిదేళ్లో, ఇంకా అంతకన్న ఎక్కువో జైలులో నిర్బంధించవచ్చు. ఈ కేసులో లాగ ఏ పద్నాలుగేళ్లకో పోలీసులు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని రుజువైనా పోలీసులకు పోయేదేమీ ఉండదు. ఉద్దేశపూర్వకంగా నిరపరాధుల కాలమూ, జీవితమూ, శక్తులూ, వనరులూ, కొన్నిసార్లు ప్రాణాలూ కొల్లగొట్టినా పోలీసులు ‘బారా ఖూన్ మాఫ్’గా తప్పించుకోవచ్చు.


ఈ ఉత్తరాఖండ్ అబద్ధపు కేసు విచారణ జరుగుతుండగా, నాలుగేళ్ల నిర్బంధం తర్వాత, ఆగస్ట్ 2011 లో బెయిల్ మీద బైటికి వచ్చిన ప్రశాంత్ రాహీ, అప్పటికే అనుభవించిన జైలు జీవితం వల్ల రాజకీయ ఖైదీల విడుదల కమిటీలో పని చేయాలనుకున్నారు. ఆ పనిలో దేశమంతా తిరిగారు, హైదరాబాద్‌లో కూడా ఒకటి రెండు సభల్లో మాట్లాడారు. అప్పటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతుండడం వల్ల, ఉత్తరాంచల్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన భాగస్వామ్యపు అనుభవాలు వినడానికి, వీక్షణం కార్యాలయంలో ఆ రోజుల్లో జరుగుతుండిన నెలవారీ సమావేశాల్లో ఆయనతో ఇష్టాగోష్ఠి కూడా ఏర్పాటు చేశాను.


అలా బెయిల్ మీద ఉండి, దేశవ్యాప్తంగా తిరుగుతూ, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ పని మీద ఛత్తీస్‌గడ్ రాజధాని రాయపూర్‌లో న్యాయవాదులను కలవడానికి వెళ్తున్నప్పుడు ఆయనను 2013 సెప్టెంబర్‌లో మళ్లీ అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో అరెస్టు చేశామనే అబద్ధంతో మరొక కేసులో ఇరికించారు. గడ్చిరోలీ జిల్లాలో నమోదైన ఈ కొత్త కేసులో ఆయన సహనిందితులు ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జిఎన్ సాయిబాబా, జెఎన్‌యు విద్యార్థి హేమ్ మిశ్రా, ఆదివాసులు మహేష్ టిర్కి, పాండు నరోటే, విజయ్ టిర్కి. ఈ కేసులో కూడా అవే తప్పుడు ఆరోపణలు, అవే అబద్ధాలు, అదే సాక్ష్యాధారాల కల్పన. కాని అక్కడి సెషన్స్ న్యాయమూర్తి అతి వేగంగా కేసు విచారణ జరిపారు. ఆ జడ్జి ఎప్పటికీ రాయలేని భాషలో రాసిన (బహుశా మరొకరు రాసి పెట్టిన) 980 పేజీల తీర్పును 2017 మార్చిలో ప్రకటించి ఐదుగురు నిందితులకు యావజ్జీవ శిక్షలు, ఒకరికి పది సంవత్సరాల శిక్ష విధించారు. అలా ప్రొఫెసర్‌ సాయిబాబాతో పాటు ప్రశాంత్ రాహీకి యావజ్జీవ శిక్ష పడింది. ఆ తీర్పు మీద హైకోర్టుకు అప్పీలుకు వెళ్లడంతో పాటు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా, వారి న్యాయవాది సురేంద్ర గడ్లింగ్‌ను కూడ అరెస్టు చేసి భీమా కోరేగాం కేసులో నిందితుడిగా నాలుగు సంవత్సరాలుగా జైలులో ఉంచారు. గడ్చిరోలీ సెషన్స్ కోర్టు తీర్పు మీద అప్పీలు ఇంకా హైకోర్టు బెంచి ముందుకు రానేలేదు. అలా ఉత్తరాఖండ్ కేసులో ఇప్పుడు నిర్దోషిగా రుజువైనప్పటికీ, మహారాష్ట్ర కేసు యావజ్జీవ శిక్ష వల్ల ప్రశాంత్ రాహీ ఇంకా జైలులోనే మగ్గిపోవలసి వస్తున్నది.

ఇదీ ఈ దేశంలో అమలవుతున్న నేర విచారణా, న్యాయ వ్యవస్థల పని తీరు!

ఎన్. వేణుగోపాల్

Updated Date - 2022-01-19T05:43:09+05:30 IST