వాగ్దానాల నయవంచన

ABN , First Publish Date - 2020-11-25T06:14:30+05:30 IST

ఎన్నికలలో ఓట్లు అడగటానికి వచ్చేవారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. మరుసటి ఎన్నికల్లో మళ్ళీ ఓట్లడగటానికి ఆ మహానుభావులు వచ్చినప్పుడు...

వాగ్దానాల నయవంచన

విశ్వ నగరంలో పౌర సౌకర్యాలు, మెరుగైన పాలన, పారిశుద్ధ్యం, రవాణా, విద్య, ఉద్యోగకల్పన, వైద్యం, ఆరోగ్యం, పారదర్శక అభివృద్ధి, అవినీతి రాహిత్యం వంటి ఏ ఒక్క సూచిక తీసుకున్నా, ఈ ఆరు సంవత్సరాలలో దిగజారుడే కనబడుతున్నది తప్ప, అభివృద్ధి లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి 2016 మున్సిపల్‌ ఎన్నికల ప్రణాళిక ఒక అబద్ధాల కుప్ప, ఒక ప్రగల్భాల పుట్ట. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా మళ్ళీ తిరిగి అవే హామీలతో ఇప్పుడు మళ్ళీ ఓటర్ల వద్దకు వస్తోంది!


ఎన్నికలలో ఓట్లు అడగటానికి వచ్చేవారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. మరుసటి ఎన్నికల్లో మళ్ళీ ఓట్లడగటానికి ఆ మహానుభావులు వచ్చినప్పుడు, పాత వాగ్దానాల సంగతి ఏమయింది అని నిలదీసి ప్రశ్నించడం ఓటర్ల బాధ్యత, హక్కు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రస్తుతం ఓట్లు అడగటానికి వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో ఇది పూర్తిగా వర్తిస్తుంది. ఆ పార్టీ 2014 జూన్ 2న అధికారాన్ని చేపట్టింది. రాష్ట్రంలో నాలుగోవంతు జనాభా హైదరాబాద్‌లోనే ఉంది గనుక రాష్ట్రం మీద అధికారం అంటే హైదరాబాద్ మీద అధికారం కూడ అవుతుంది. అందువల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారానికి వచ్చిన మర్నాటి నుంచే హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. మంత్రివర్గంలో కీలకమైన పురపాలక శాఖను తన కుమారుడికే అప్పగించారు. అంటే హైదరాబాద్ మీద అధికారం ఆరు సంవత్సరాలుగా తండ్రీతనయుల చేతుల్లోనే ఉంది. హైదరాబాద్ నగరాభివృద్ధికి వారు ఏమి చేయదలచుకున్నా ఆటంకాలే లేవు. అయితే 2016 మున్సిపల్‌ ఎన్నికల ప్రణాళికలో టిఆర్‌ఎస్ చేసిన వాగ్దానాలలో పూర్తిగా అమలయిన వాగ్దానం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. 


‘నాలుగు వందల సంవత్సరాల ఘన వారసత్వానికి నిలయంగా నిలిచిన హైదరాబాద్ చరిత్రలో నూతన శకానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాంది పలుకుతున్నది’ అని 2016 మున్సిపల్‌ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. నూతన శకం ఎక్కడ మొదలైందో, ఏ మూసీ వరదల్లో కొట్టుకపోయిందో, ఏ సెక్రటేరియట్ విధ్వంసంలో కూలిపోయిందో, ఏ రోడ్ల గతుకుల్లో నడుములు విరిగి పడిపోయిందో తెలియదు. 


ఈ వాగ్దానాల పత్రానికి ముందుమాటగా టిఆర్‌ఎస్ ఏం రాసిందో చూడండి: ‘సమస్యలు ఉత్పన్నమవగానే హడావిడిగా, అవకతవక పరిష్కారాలు వెతికిన గత పాలకుల భావదారిద్ర్యం నగరాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టింది. సంకుచిత ప్రయోజనాల కోసం అనేక అక్రమాలకు పాల్పడ్డ పాత ప్రభుత్వాలు హైదరాబాద్ ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేసినాయి. నగర జీవనాన్ని నరకప్రాయంగా మార్చినాయి’. మరి గత పాలకుల గురించి చెప్పిన ప్రతి ఒక్క మాటా టిఆర్‌ఎస్ పాలకులకూ వర్తించేది కాదా? 


నోరు తెరిస్తే తండ్రీతనయులు విశ్వనగరం అంటూ ఉంటారు. విశ్వనగరమంటే ఎటువంటి పౌరసౌకర్యాలు ఉండాలో, ఎటువంటి గృహవసతి, తాగు నీటి వసతి, ఎటువంటి పారిశుద్ధ్య సౌకర్యాలు, ఎటువంటి రవాణా సౌకర్యాలు ఉండాలో, శాంతిభద్రతల స్థితి ఎలా ఉండాలో కనీస అవగాహన కూడా వీళ్లకు లేదని గత ఆరు సంవత్సరాల పాలన అడుగడుగునా రుజువు చేసింది. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు చాలినంత నీటిని సరఫరా చేస్తామనేది తెరాస 2016లో చేసిన ఎన్నికల వాగ్దానం. కృష్ణా, గోదావరి జలాలను నగరానికి తీసుకువచ్చి రాచకొండ, షామీర్ పేట రిజర్వాయర్లలో నిల్వ చేస్తామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. ఆ రెండు రిజర్వాయర్లకు డిపిఆర్‌లు కూడ తయారయ్యాయి. కాని ఐదేండ్లు గడిచినా పని మొదలు కాలేదు. ఇప్పటికీ హైదరాబాద్ ప్రజలకు అందుతున్న నీళ్లు గత ప్రభుత్వాల పథకాల పున్యమే కాని ఈ ప్రగల్భాల వీరులు అందించినవి కావు. ఎన్నికల ముందు 32 వేల కొత్త మంచినీటి కనెక్షన్లు ఇస్తామని, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ అని వాగ్దానం చేసిన వారు, ఆ వాగ్దానంలో పావువంతు కూడ పూర్తి చేయలేదు. 


మెరుగైన పారిశుద్ధ్యం అందిస్తామనేది తెరాస మరో వాగ్దానం. నగరంలో ఎక్కడ చూస్తే అక్కడ వందలాది చోట్ల రోడ్లపక్కన, వీథుల చివర మురికి కుప్పలు దర్శనమిస్తాయి. దోమల ఆవాసాలు చూడడానికి మనం ఎక్కువ దూరం పోనక్కరలేదు. మూసీ, హుస్సేన్‌సాగర్‌ల ప్రక్షాళన కార్యక్రమాలు ఆకర్షణీయమైన వాగ్దానాలకే పరిమితమైపోయాయి. కుంచించుకుపోయిన చెరువులు, కుంటలు కాలుష్య భరితంగా మారిపోయాయి. కొత్త డంప్‌యార్డులను ఏర్పాటు చేస్తామని, తడి, పొడి వ్యర్థ పదార్థాలను వేరు వేరుగా సేకరించే ఏర్పాట్లు చేస్తామని, తద్వారా నగర పరిశుభ్రత పెంచుతామని టిఆర్‌ఎస్ పెగ్గెలు పలికింది. తొలిరోజుల్లో ప్రతి ఇంటికీ చెత్తడబ్బాలను కూడ సరఫరా చేసింది. ఆ చెత్తడబ్బాల తయారీలో, కొనుగోలులో, పంపిణీలో ఏ కాంట్రాక్టర్లు లాభపడ్డారో గాని, ఇప్పుడు చూస్తే ఆ చెత్తడబ్బాలు వాడుతున్న ఇల్లు ఒక్కటి కూడ లేదు. కొత్త డంప్ యార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కాని, ప్రతి సందు చివరా, బహిరంగస్థలాల్లో డంప్ యార్డులు కుప్పతెప్పలుగా వెలిశాయి.


నగరంలో ప్రస్తుతమున్న 3,500 కిమీ పొడవైన మురుగునీటి వ్యవస్థను తెరాస ప్రభుత్వం ఆధునికీకరించి, దానిని శివారు కాలనీలకు విస్తరిస్తుంది. చిన్నపాటి వర్షానికే జలమయం అవుతున్న నగరం దుస్థితిని మార్చడానికి వరదనీటి కాలువల నిర్మాణం, నాలాల పరిరక్షణ చేపడుతుంది’ అని 2016 నాటి ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానం మొన్నటి వరదల్లో మూసీలో కొట్టుకుపోయి ఎక్కడ చెత్తకుప్పలో తేలిందో వెతకాలి. 


నగరం చెరువుల నగరంగా ప్రసిద్ధికెక్కిందని, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో చెరువులు కనుమరుగయ్యాయని, వాటిని పునరుద్ధరిస్తామని టిఆర్‌ఎస్ వాగ్దానం చేసింది. ఈ ఆరు సంవత్సరాల పాలనలోనే నగరంలో కబ్జాలు పెరిగిపోయాయని, చెరువులు, కుంటలు కాలనీలుగా మారిపోయాయని మొన్నటి వరదలే రుజువు చేశాయి. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు పూర్వవైభవం తెచ్చేదిశగా కృషి చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఆ రెండు జలాశయాలకు నీటిని సరఫరా చేసే వాగులను, వంకలను అడ్డుకున్న లే ఔట్లకు పెద్దఎత్తున అవకాశం కల్పించడంతో పాటు వాటి విస్తీర్ణం తగ్గిపోవడానికి కారణమయింది.


2016 ఎన్నికల ప్రణాళికలోని ఒకే ఒక్క వాగ్దానం కొంతవరకైనా అమలు చేసినట్టు కనబడుతున్నది.  ‘టిఆర్‌ఎస్ ప్రభుత్వ జిహెచ్‌ఎంసి పరిధిలో 1100 పర్యావరణ అనుకూల టాయిలెట్ల ఏర్పాటును మొదలు పెట్టింది’ అని తమ ప్రణాళికలో రాసుకున్నారు. మరి అంత సంఖ్యలో నిర్మించారో లేదో గాని, ఏర్పాటుచేసిన వంద రెండు వందల టాయిలెట్ల మీద పెద్దపెద్దగా కెటిఆర్ బొమ్మలు మాత్రం చిత్రించుకున్నారు! ప్రతి పదివేల జనాభాకు ఒక ఆదర్శ మార్కెట్ ఏర్పాటు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని, మొదటి దశలో 200 ఆదర్శ సమీకృత మార్కెట్లను జిహెచ్‌ఎంసి నిర్మిస్తుందని, రెండు అంతస్థులుగా నిర్మించే ఈ మార్కెట్లలో కూరగాయలు, ఫార్మసీలు, తినుబండారాలు, ఎటిఎంలు, మాంసం, నిత్యావసర వస్తువులు, కిరాణా సామాను వంటివి అందుబాటులో ఉంటాయని 2016 ప్రణాళిక పెగ్గెలు పలికింది. రెండు వందల మార్కెట్ల సంగతి అలా ఉంచి, రెండు మార్కెట్లు కూడా నిర్మించలేదు. 


ఒక్కమాటలో చెప్పాలంటే నగరంలో పౌర సౌకర్యాలు, మెరుగైన పాలన, పారిశుద్ధ్యం, రవాణా, విద్య, ఉద్యోగకల్పన, వైద్యం, ఆరోగ్యం, పారదర్శక అభివృద్ధి, అవినీతి రాహిత్యం వంటి ఏ ఒక్క సూచిక తీసుకున్నా, ఈ ఆరు సంవత్సరాలలో దిగజారుడే కనబడుతున్నది తప్ప, అభివృద్ధి లేదు. ఇప్పుడు 2016 ఎన్నికల ప్రణాళికను చదివితే అది గొప్ప హాస్య పత్రంగా కన్పిస్తుంది. అది ఒక అబద్ధాల కుప్ప, ఒక ప్రగల్భాల పుట్ట. అది నీటి మీది రాత. టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా మళ్ళీ తిరిగి అవే హామీలతో ఈ ఎన్నికలలో ఓట్ల కోసం విజ్ఞప్తి చేయడానికి తిరిగి వస్తోంది. ఇది నయ వంచన కాక మరేమిటి?

కె. లక్ష్మణ్‌

బీజేపీ నాయకులు

Updated Date - 2020-11-25T06:14:30+05:30 IST