Abn logo
Oct 23 2021 @ 02:23AM

ది ‘నవ భారత్‌’ విజయం

100 కోట్ల టీకాలు అంకె కాదు దేశ ప్రజల బలం.. భారతచరిత్రలోనే ఇది సరికొత్త అధ్యాయం

ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, అక్టోబరు 22: కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రశ్నించిన వారికి.. 100 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసుల మైలురాయి తగిన సమాధానం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. టీకా పంపిణీలో వంద కోట్ల డోసులు ఒక నంబర్‌ మాత్రమే కాదని.. ఇది దేశ ప్రజల బలమని, దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయమని వ్యాఖ్యానించారు. ‘నవ భారత్‌’ విజయమని కొనియాడారు. టీకా డోసులు 100 కోట్లు దాటిన సందర్భంగా ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడుతూ.. భారత్‌ కష్టమైన లక్ష్యాలను సైతం నిర్దేశించగలదని, వాటిని చేరుకోగలదని వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిరూపించిందన్నారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే నేడు 100 కోట్ల వ్యాక్సిన్‌ మైలురాయిని చేరుకోగలిగామని, పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందించామని మోదీ వెల్లడించారు. కొవిడ్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని దీపావళిని దేశప్రజలంతా జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన సూచించారు.


మా భాగస్వామ్యం కొనసాగుతుంది

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల డోసుల మైలురాయిని దాటిన సందర్భంగా భారత్‌కు శాభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలందరికీ ప్రధాని మోదీ శుక్రవారం ధన్యవాదాలు చెప్పారు. కొవిడ్‌పై పోరాటం దిశగా ప్రపంచ దేశాలు చేసే ప్రయత్నాల్లో భారత్‌ స్థిరమైన భాగస్వామిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. వంద కోట్ల మార్కు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జుగ్‌నాథ్‌, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ ప్రధాని తిమోతి హారిస్‌, డోమినికా ప్రధాని రూస్‌వెల్డ్‌ స్కెరిట్‌, మంగోలియా అధ్యక్షుడు ఉఖ్‌నాగిన్‌ ఖురేల్‌సుఖ్‌, మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా షాహిద్‌, మైక్రోసాఫ్ట్‌ దిగ్గజం బిల్‌ గేట్స్‌ తదితరులు సోషల్‌ మీడియాలో భారత్‌ను అభినందించారు. వారందరికీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇక.. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌.. స్వయంపూర్ణ గోవా’ లబ్ధిదారులు, వాటాదారులతో ప్రధాని శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. 


‘మేడ్‌ ఇన్‌ ఇండియా’పై ద్వంద్వ వైఖరి: రాహుల్‌ 

మేడ్‌ ఇన్‌ ఇండియా నినాదంపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ యేడాది తొలి తొమ్మిది నెలల్లో చైనాతో భారత దేశ వాణిజ్యం 49 శాతం పెరిగిందని విదేశాంగ కార్యదర్శి హర్షా శ్రింగ్లా వెల్లడించిన నేపథ్యంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో భారత వాణిజ్యం పెరిగిందని మీడియా ఇచ్చిన నివేదికను శుక్రవారం ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. ఆ నివేదిక ప్రకారం ఈ యేడాది తొలి తొమ్మిది నెలల్లో చైనాతో భారత వాణిజ్యం 90 బిలియన్ల అమెరికా డాలర్ల(రూ.6 లక్షల 73 వేల కోట్లు)కు చేరింది. కాగా, భారత దేశ జనాభాలో కేవలం 21 శాతం మంది ప్రజలకే కొవిడ్‌ టీకా అందిందని, వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. ఈ యేడాది చివరి నాటికి దేశంలోని వయోజనులందరికీ టీకా అందిస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం అందుకు సంబంధించిన కార్యాచరణపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.  


సురక్షితమని తేలితేనే టీకాలకు అనుమతి

హైదరాబాదీ కంపెనీ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన మేడ్‌ ఇన్‌ ఇండియా టీకా ‘కొవాక్సిన్‌’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అత్యవసర వినియోగ అనుమతుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈనేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో అత్యవసర ఆరోగ్య కార్యక్రమాల విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మైక్‌ ర్యాన్‌ స్పందించారు. వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతుల మంజూరులో కొన్నిసార్లు ఈవిధమైన జాప్యం జరుగుతుంటుందన్నారు. టీకా ఒక్కదాని గురించే కాకుండా దాని ఉత్పత్తితో ముడిపడిన అన్ని అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని తగిన నిర్ణయాన్ని వెలువరిస్తామని వెల్లడించారు. 


మరో కరోనా వేవ్‌ రాకపోవచ్చు

కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే తప్ప.. దేశంలో మరో కరోనా వేవ్‌ వచ్చే అవకాశాలు దాదాపు లేవని పలువురు శాస్త్రవేత్తలు అంటున్నారు. మునుపటితో పోలిస్తే ప్రస్తుతం కరోనా కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయని, అంతమాత్రాన కొవిడ్‌-19 ‘స్థానిక వ్యాప్తి’ (ఎండెమిక్‌) దశకు చేరిందనే నిర్ధారణకు రావడం తొందరపాటు చర్యే అవుతుందన్నారు. కొవిడ్‌ మరణాల రేటు ఇంకా 1.2 శాతం దరిదాపుల్లోనే కదలాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా నిర్వహిస్తున్న బ్రిటన్‌ వంటి దేశాల్లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. ‘‘భారత్‌ ఇంకా ఎండెమిక్‌ దశకు చేరలేదు. ఈ పయనం ఇంకా చాలా దూరం సాగాలి. ఇందుకోసం వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలి’’ అని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌ పేర్కొన్నారు. పండుగల సీజన్‌ ముగిసిన తర్వాత కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ‘‘మరో రెండు నెలల ఆగితే కానీ కరోనా వ్యాప్తి ఎండెమిక్‌ దశకు చేరిందా ? లేదా ? అనేది తేలిపోతుంది’’ అని అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకానమిక్స్‌ అండ్‌ పాలసీ సంస్థ డైరెక్టర్‌ రామనన్‌ లక్ష్మీనారాయణ్‌ అభిప్రాయపడ్డారు.


జాతీయంమరిన్ని...