వ్యాక్సిన్‌ సక్సెస్‌

ABN , First Publish Date - 2021-01-17T06:08:55+05:30 IST

కరోనా నివారణకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తొలిరోజు జిల్లాలో విజయవంతమైంది. సంగారెడ్డి జిల్లాలోని ఎంపిక చేసిన ఆరు కేంద్రాల్లో తొలిరోజైన శనివారం 144 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లయిన వైద్యులు, నర్సులు, ఆస్పత్రి పారిశుధ్య సిబ్బందికి టీకా వేశారు.

వ్యాక్సిన్‌ సక్సెస్‌
సంగారెడ్డిలోని ఇందిరానగర్‌ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్‌తో విజయసంకేతం చూపుతున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

కరోనా నివారణకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తొలిరోజు జిల్లాలో విజయవంతమైంది. సంగారెడ్డి జిల్లాలోని ఎంపిక చేసిన ఆరు కేంద్రాల్లో తొలిరోజైన శనివారం 144 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లయిన వైద్యులు, నర్సులు, ఆస్పత్రి పారిశుధ్య సిబ్బందికి టీకా వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని టీవీల్లో వీక్షించిన అనంతరం ఆయా కేంద్రాల్లో కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు సహా ఇతర ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. శనివారం నుంచి ఈ నెల 21 వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. మొత్తమ్మీద జిల్లాలో 780 మంది సిబ్బందికి టీకాలు ఇచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు  చేపట్టింది.


 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి/(జహీరాబాద్‌, పటాన్‌చెరు, జోగిపేట, కోహీర్‌, ఝరాసంగం), జనవరి 16: జిల్లా మొత్తమ్మీద జోగిపేట, జహీరాబాద్‌లలోని ఏరియా ఆస్పత్రుల్లో, పటాన్‌చెరులో టంగుటూరు అంజయ్య వంద పడకల ఆస్పత్రిలోని రూరల్‌ హెల్త్‌ సెంటర్‌లో, సంగారెడ్డి పట్టణం ఇందిరానగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, కోహీర్‌ మండలం దిగ్వాల్‌, ఝరాసంగంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శనివారం ఉదయం కొవిషీల్డ్‌ టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకు ముందు టీవీల్లో నరేంద్రమోదీ ప్రసంగాన్ని వీక్షించారు. ఆరు కేంద్రాల్లో మొత్తం 144 మంది కొవిడ్‌ నిరోధక కొవిషీల్డ్‌ టీకాను వేయించారు. సంగారెడ్డి ఇంద్రనగర్‌ యూపీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్‌ ఆర్‌. సుకన్యకు తొలిటీకా ఇచ్చారు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేదని నిర్ధారించుకున్నాక రెండో వ్యక్తికి ఇచ్చారు. గంటసేపు అబ్జర్వేషన్‌లో ఉంచి, ఆ తర్వాత పంపించేశారు. పటాన్‌చెరులో డాటా ఎంట్రీ ఆపరేటర్‌ బి.కొండల్‌కు,  జోగిపేట ఆస్పత్రిలో ఎక్స్‌రే యూనిట్‌ టెక్నీషియన్‌ నాగరాజుకు, జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న ఎలిజబెత్‌కు, ఝరాసంగంలో ఆస్పత్రి వైద్యాధికారి మాజీద్‌కు, దిగ్వాల్‌లో డాక్టర్‌ రాజ్‌కుమార్‌కు తొలి టీకా ఇచ్చారు. అన్ని చోట్లా అందరినీ పరిశీలించాక, ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్నాకే తమ విధులకు పంపించారు.


ఈ టీకాతో మహమ్మారికి ముగింపు       

             - ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. టీకాతో ఈ మహమ్మారికి ముగింపు పడుతుందని, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ విజయవంతం కావాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. సంగారెడ్డిలోని ఇంద్రనగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్‌ హన్మంతరావుతో కలిసి టీకాను ప్రారంభించిన అనంతరం ఎంపీ మాట్లాడారు. పది మాసాల నుంచి కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం అందరూ సంతోషించాల్సిన విషయమన్నారు. కలెక్టర్‌ హన్మంతరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లాలో 10,842 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో చివరి పౌరుడివరకు అందరికీ వ్యాక్సిన్‌ అందించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి రావడం చరిత్రాత్మకమని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరులోని రూరల్‌ హెల్త్‌ సెంటర్‌లో డాక్టర్‌ వసుంధరతో కలిసి వారు వ్యాక్సిన్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, టీకా తయారు చేసిన 8 ఫార్మా పరిశ్రమల్లో 6 పరిశ్రమలు తెలంగాణాలోనే ఉండడం గర్వకారణమన్నారు. సామాన్య ప్రజలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ముదావహమని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అన్నారు. జోగిపేటలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆయన జడ్పీచైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అందరూ టీకాను సద్వినియోగం చేసుకుని కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ కేంద్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా జరుగుతున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు కలెక్టర్‌ హన్మంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్‌ టీకా అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమైన విషయమని సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌ కొనియాడారు. ఝరాసంగంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. కరోనా సోకిన వారు, ఇకపై వస్తుందేమోనన్న భయంతో ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే మాణిక్‌రావు భరోసా ఇచ్చారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌తో కలిసి జహీరాబాద్‌లో, దిగ్వాల్‌లో ఆయనవ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. 




పాల్గొన్న ప్రముఖులు

సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాథోడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ లత, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రబాకర్‌, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్ధ చైర్మన్‌ నరహరిరెడ్డి, ఆర్డీవో నగేశ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగనిర్మల పాల్గొన్నారు. పటాన్‌చెరు కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.వసంధర, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ హారికావిజయ్‌కుమార్‌, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్‌, ఎంపీపీలు ప్రవీణరెడ్డి, సుష్మశ్రీ, కార్పొరేటర్లు కుమార్‌యాదవ్‌, సింధు, పుష్ప, మున్సిపల్‌ చైర్మన్‌ టి.పాండురంగారెడ్డి పాల్గొన్నారు. జోగిపేటలో ఆర్డీవో విక్టర్‌, ఏఎంసీ, మున్సిపల్‌ చైర్మన్లు మల్లికార్జున్‌ గుప్తా, గూడెం మల్లయ్య పాల్గొన్నారు. ఝరాసంగంలో డీఆర్డీవో శ్రీనివా్‌సరావు, తహసీల్దార్‌ తారాసింగ్‌, తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్‌లో ఆర్డీవో రమేశ్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ సుభా్‌షరావు, దిగ్వాల్‌లో డీపీవో సురేష్‌ మోహన్‌, వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ గాయత్రీదేవి, ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ రాందాస్‌, సర్పంచ్‌ జ్యోతి తిరాంలింగారెడ్డి పాల్గొన్నారు.




ఒక్కరికి అస్వస్థత

సంగారెడ్డి ఇందిరానగర్‌ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ టీకా తీసుకున్న ఏఎన్‌ఎం సంగీత అస్వస్థతకు గురయ్యారు. టీకా తీసుకున్న వెంటనే ఆమె.. తల తిప్పుతున్నదని డాక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే బీపీ పరీక్షించిన వైద్య సిబ్బంది సపర్యలు చేశారు. వాంతులు చేసుకోవడంతో సంగీతను వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. బీపీ పెరగడం వల్లే ఇలా జరిగిందని, ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఆర్డీవో నాగేశ్‌, డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి వెంటనే ఆస్పత్రికి చేరుకుని సంగీత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.


ఇది నాకు దక్కిన గౌరవం

జోగిపేట ఏరియా ఆసుపత్రిలో ఇస్తున్న కొవిషీల్డ్‌ టీకాను తీసుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఒక డాక్టర్‌గా నేను ఈ టీకాను తీసుకోవడంలో ఎటువంటి శషభిషలకూ లోను కాలేదు. ఇతర టీకాల మాదిరే దీని వల్ల కూడా ఎటువంటి దుష్ప్రభావాలుండవు. ఈ నమ్మకంతోనే నేను మలి వ్యక్తిగా టీకాను తీసుకున్నా.

- డాక్టర్‌ అనూష, జోగిపేట


తొలి టీకాతో గర్వంగా భావిస్తున్నా

తొలి టీకాను నేను వేసుకుంటున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఆరోగ్య సిబ్బందికి మొదట టీకా వేయడం గొప్పగా ఉంది. ఆత్మ విశ్వాసంతో టీకాను వేసుకుని నాతోటి సిబ్బందిలో ఆత్మ స్థైర్యాన్ని నింపాలనుకుంటున్నా.

- ఆర్‌.సుకన్య, స్టాఫ్‌నర్స్‌, సంగారెడ్డి


ఉత్సాహంగా విధుల్లో పాల్గొన్నా

 పటాన్‌చెరులో టీకా వేసుకున్న రెండో వ్యక్తిని. టీకా తరువాత ఎలాంటి మార్పూ లేదు. ఉదయం టీకా వేసుకున్న తరువాత ఉత్సాహంగా సాయంత్రం వరకు ఆసుపత్రి విధుల్లో పాల్గొన్నాను. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దు.

- మనోహర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, పటాన్‌చెరు


మా వాళ్లందరికీ స్ఫూర్తిగా ఉంటా 

జహీరాబాద్‌లో తొలి టీకా నాకే వేయడం గర్వంగా ఉంది. వైద్యులకే ప్రాధాన్యం ఇస్తారేమో అనుకున్నా. వైద్యసిబ్బంది అందరినీ సమానంగా గుర్తించడం సంతోషం. నేను టీకా తీసుకోవడం వల్ల ఆస్పత్రిని శుభ్రంగా ఉంచే వారందరికీ స్ఫూర్తిగా ఉంటుంది. 

- ఎలిజబెత్‌, స్వీపర్‌, జహీరాబాద్‌


Updated Date - 2021-01-17T06:08:55+05:30 IST