Abn logo
Feb 27 2020 @ 01:17AM

మహిళా విజయం

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్‌ బడా నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్‌ను న్యూయార్క్‌ కోర్టు సోమవారం దోషిగా నిర్థారించింది. భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ ఈ వార్త వినగానే డెమోక్రాట్లకు హార్వే అంటే ఎంతో ప్రేమనీ, తనకు మాత్రం ఆయనంటే పడదని ఓ వ్యాఖ్యచేశారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా హార్వే పనిచేయడం ఇందుకు కారణం. మహిళల పట్ల ట్రంప్‌ గౌరవం ఏపాటిదో మనకు తెలిసిందే కానీ, ఈ తీర్పు మహిళా విజయం అన్నమాట నిజం. ఒక మూవీ మొఘల్‌కు వ్యతిరేకంగా వెలువడిన ఈ తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. హార్వేమీద దాదాపు ఎనభైమంది నటీమణులు లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు చేశారు. కేసుల్లో కొన్ని కొట్టుకుపోయినా, రెండు కేసులు ఇప్పుడు నిర్థారణ కావడంతో ఇప్పటివరకూ బెయిల్‌మీద ఉన్న హార్వే జైలుకు పోయాడు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో టిఫిన్‌ చేసి, తీర్పు వినడానికి వచ్చిన హార్వే మార్చి 11న తనకు పడబోయే శిక్ష కోసం ఎదురుచూస్తూ ఇకపై ఓ బేస్‌మెంట్‌ జైల్లో గడపబోతున్నాడు. నిర్థారణ అయిన ఈ రెండు కేసుల తీవ్రతను బట్టి ఆయనకు పాతికేళ్ళ జైలు తప్పదని అంటున్నారు. మదంతో విర్రవీగిన ఓ ఆస్కార్‌ విజేత కథ జైల్లోనే ముగిసిపోవచ్చు. 


హార్వే గురించి చెప్పుకోవడం ఎందుకంటే, రెండేళ్ళ క్రితం ప్రపంచాన్ని విశేషంగా ప్రభావితం చేసిన ‘మీ టూ’ ఉద్యమానికి కారకుడు ఆయన. అనేకమంది మహిళలు తమ మొహమాటాలు, అవమాన భయాలు తెంచుకొని నేను సైతం అంటూ ముందుకొచ్చి తమపై జరిగిన లైంగికదాడులను బయటపెట్టేందుకు ఒక ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ సమకూర్చిన ఉద్యమం అది. ఈ మీ టూ కారణంగా భారత్‌ సహా చాలా దేశాల్లో పెద్దమనుషుల ముసుగులో ఉన్న అనేకమంది కాముకుల నిజస్వరూపం బట్టబయలైంది. హార్వే మాదిరిగానే అవకాశాలు ఇస్తామనో, తాము ఏం చేసినా చెల్లుతుందన్న ధైర్యంతోనే అఘాయిత్యాలకు పాల్పడినవారు ఎందరో ఉన్నారు. హార్వే తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అకృత్యాలకు పాల్పడ్డాడని ప్రాసిక్యూషన్‌ వాదిస్తే, సినిమారంగంలో అవకాశాలకోసం ఈ హీరోయిన్లే ఆయన వెంటపడ్డారనీ, అప్పట్లో వారి సమ్మతితో జరిగిన శృంగారాన్ని ఇప్పుడు వారంతా అత్యాచారాలుగా అభివర్ణిస్తున్నారని హార్వే న్యాయవాది సమర్థించుకొచ్చారు. కేసుల సందర్భంగా జరిగే ఈ వాదోపవాదాలు అటుంచితే, మీ టూ ఉద్యమ సందర్భంగా సాగిన చర్చలో కూడా ఇవేరకమైన అడ్డగోలు వాదనలు మనం చూశాం. అవకాశాలు దక్కినవారు మారుమాట్లాడరనీ, దక్కనివారు మాత్రం ఇలా బ్లాక్‌మెయిల్‌ చేస్తారని అన్నవారూ ఉన్నారు. కానీ, ఏంజెలీనా జోలి, మెరిల్‌ స్ట్రీప్‌, కేట్‌ విన్‌స్లెట్‌ సహా హార్వేమీద పోరాడినవారంతా సినీరంగంలో వెలుగుతున్నవారే. అతనిమీద ఉన్న మొత్తం ఐదు అభియోగాల్లో ఇప్పుడు రెండు మాత్రమే నిర్థారణ అయినా, హాలీవుడ్‌ నటి అన్నా బెల్లే వంటివారు దీర్ఘకాలంగా చేస్తున్న న్యాయపోరాటాలు మరోపక్క సాగుతూనే ఉన్నాయి. మొన్న జనవరిలో ఈ కేసు మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు పాతికేళ్ళనాటి అత్యాచార ఘటన న్యాయస్థానానికి వివరిస్తూ అరవైయేళ్ళ అన్నాబెల్లే న్యాయస్థానంలో వెక్కివెక్కి ఏడ్చారు.


హార్వే లైంగిక ఆగడాలను ‘మీ టూ’ ట్యాగ్‌తో బయటపెట్టిన నటీమణులు, ప్రముఖులను ‘సైలెన్స్‌ బ్రేకర్స్‌’గా అభివర్ణిస్తూ 2017లో టైమ్‌ మ్యాగజైన్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా గుర్తించిన విషయం తెలిసిందే. అమెరికాలో హార్వేమీద అష్లీ జూడ్‌, ఇండియాలో నానాపటేకర్‌మీద తనుశ్రీ దత్తా తొలిసారిగా తిరుగుబాటు చేశారు కానీ, అనంతర కాలంలో న్యాయస్థానాల్లో నెగ్గలేకపోయారు. చలనచిత్రాల్లోనూ, సీరియళ్ళలోనూ సంస్కారులుగా కనిపించినవారు, ఆయా రంగాల్లో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారి అసలు రంగును ఈ ఉద్యమం వెలుగులోకి తేగలిగింది. భారత్‌ సహా అన్ని దేశాలూ మీ టూ ఉద్యమానికి భయపడ్డాయే తప్ప దానిని గౌరవించినట్టు కనిపించదు. తప్పుచేసినవారిని శిక్షించాల్సిన సమాజం, వేధింపులపై పెదవి విప్పిన ఫలితంగా తమ రంగంలో అవకాశాలు కోల్పోయినవారి పక్షాన నిలవలేదు. అయినప్పటికీ, చాలా రంగాల్లో అది కలిగించిన భయం, మిగల్చిన ప్రభావం కాదనలేనిది. ప్రశ్నించేవారు ఉండరన్న మగ దురహంకారం, దురాక్రమణలను తొలిసారిగా చీల్చిచెండాడిన ఒక బలమైన తిరుగుబాటుగా అది నిలిచిపోతుంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం దక్కి, సమాజం, న్యాయస్థానాలు తమ పక్కన నిలిచినప్పుడు మాత్రమే బాధితులు నోరువిప్పగలుగుతారు.

Advertisement
Advertisement
Advertisement