నిర్వాసితుల గోడు పట్టేనా?

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

సాగునీటి ప్రాజెక్టులతో భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్వాసితుల గోడు పట్టేనా?
షానగర్‌లో భూములు కోల్పోతున్న ప్రాంతం

- చిచ్చురేపుతున్న సాగునీటి ప్రాజెక్టులు
- భూములు, ఇళ్లు సర్వస్వం కోల్పోతున్న రైతులు
- ఉన్నదంతా కల్వల పాలయ్యే బతుకుడెట్లా.. రైతుల ఆవేదన
- ఎకరం భూమి పరిహారం గుంట భూమి కూడా రాని వైనం
- షానగర్‌లో రైతులు, నిర్వాసితుల ఆవేదన

రామడుగు, జనవరి 21:  సాగునీటి ప్రాజెక్టులతో భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు భూములు కోల్పోయిన వారు మళ్లీ భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. రామడుగు మండలం మోతె రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా వరద కాలువకు 4 ఓటీలు ఏర్పాటు చేసి కాలువల ద్వారా పంట పొలాలకు నీరందించేం దుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 2 సంవత్సరాల క్రితం అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఓటీల నిర్మాణానికి 524.18 ఎకరాల భూమిని అధికారులు సేకరించుటకు గ్రామసభలు నిర్వహిస్తుండగా ఎక్కడికక్కడ రైతులు కాలువల నిర్మాణం వద్దని అడ్డుకుంటున్నారు. రామడుగు మండలంలో 354.4 ఎకరాలు, చొప్పదండి మండలంలో 68 ఎకరాలు, గంగాధర మండలంలో 103 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ కాలువల నిర్మాణం ద్వారా 26,480 ఎకరాల భూములకు సాగునీరు అందనుంది. 

అదనపు టీఎంసీ కోసం సేకరణపై అభ్యంతరం

మరోవైపు అదనపు టీఎంసీ కోసం రామడుగు మండలంలోని వివిఽధ గ్రామాల్లో 145.6 ఎకరాల భూమిని ఇటీవల సేకరించుటకు గ్రామసభలు నిర్వహించారు. ఇందులో చిప్పకుర్తి గ్రామంలో 6.27 ఎకరాలు, శ్రీరాములపల్లిలో 34.29 ఎకరాలు, రామడుగు మండలంలో 8.1 ఎకరాలు, షానగర్‌లో 55.28 ఎకరాలు, కిష్టాపూర్‌లో 27.35 ఎకరాలు, గోపాల్‌రావుపేటలో 13.11 ఎకరాలభూమిని ప్రాథమికంగా సేకరించాల్సి ఉంది. ముఖ్యంగా షానగర్‌ రైతుల పరిస్థితి మరోరకంగా ఉంది. ఇప్పటికీ వివిధ సాగునీటి పథకాలకు భూములు ఇచ్చిన రైతులు మరోసారి కాలువల పేరిట మరో 68 ఎకరాల భూములను కోల్పోతున్నారు. ఇందులో ప్రధానంగా వరదకాలువ సమీపంలో ఉన్న దాదాపు వంద కుటుంబాలు భూములతోపాటు ఇండ్లను సైతం కోల్పోవడంతో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. గతంలో ఎల్‌ఎండీలో భూములు కోల్పోయిన రైతులు ఇక్కడికి వచ్చి భూములు కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇక్కడ సైతం వరదకాలువ ఏర్పాటు చేయడంతో భూములు కోల్పోయారు. ప్రస్తుతం అదనపు టీఎంసీ పేరిట ఉన్న భూములు ఇండ్లను సైతం కోల్పోతుండగా గగ్గోలు పెడుతున్నారు.  గతంలో ఎల్‌ఎండీలో ఆరు ఎకరాల భూమి కోల్పోగా ఇక్కడికి వచ్చి భూములుకొని వ్యవసాయం చేసుకుంటున్న వరాల మల్లయ్య వరద కాలువలో ఆరు ఎకరాలు కోల్పోయారు. ప్రస్తుతం ఎకరం భూమి ఉండగా ఎకరం భూమితోపాటు ఇల్లు కూడా కోల్పోతుండగా తనకు తలదాచుకోవడానికి స్థలం కూడా లేదు. లక్షలాది రూపాయలు వెచ్చించి అప్పు చేసి రెండంతస్తుల బిల్డింగ్‌ కట్టుకున్న అంజలి 20 గుంటల భూమితో పాటు ఇల్లు కూడా కోల్పోతోంది. భూమిని కొని అప్పులపాలైన చిరంజీవి విదేశాలకు వెళ్లి అప్పులు తీర్చుకొని తిరిగి ఇంటికి రాగా ఉన్న భూమి సైతం ఇందులో పోతుంది. విలువైన భూములు కాలువ నిర్మాణాలకు పోతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇద్దరు, ముగ్గురి సమస్య కాదు ఇక్కడ ఉన్న అన్ని కుటుంబాలలో ఇలాంటి పరిస్థితే ఉంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి భూములు కోల్పోతున్న వారికి సరైన న్యాయం చేయాలని రైతులు, నిర్వాసితులు కోరుతున్నారు. 
 

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST