Advertisement
Advertisement
Abn logo
Advertisement

గూడు చెదిరి..వరద గోడు

  • గుడారాల్లో వరద బాధితుల అవస్థలు
  • అవి కూడా సీఎం రాకకు ముందే ఏర్పాటు
  • కడపలోని వరద పల్లెల్లో బాధితుల వ్యథలు


కడప, డిసెంబరు 3 (ఆంద్రజ్యోతి): అన్నమయ్య జలాశయం మట్టి ఆనకట్ట తెగిపోవడంతో చెయ్యేరు నదితీరంలోని పల్లెసీమలు ఛిద్రమయ్యాయి. వరద ముంచెత్తి 15రోజులైనా ఊరు ఇంకా సర్దుకోలేదు. ఏవైపు నుంచీ సాయం అందలేదు. గురువారం సీఎం జగన్‌ పులపత్తూరు, మందపల్లి గ్రామాలకు రావడానికి ముందే జిల్లా యంత్రాంగం పరుగులు పెట్టింది. ముందురోజే ప్లాస్టిక్‌ కవర్ల గుడారాలు ఏర్పాటు చేశారు. కూర్చోవడానికి కూడా సరిపోని ఆ గుడారాల్లో పగలు మండుటెండలు.. రాత్రి చలిగాలులతో అవస్థలు పడుతున్న బాధితులను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. పులపత్తూరుకు చెందిన సంపత్‌ నాగమ్మ(61) భర్త వరదలో కొట్టుకుపోయాడు. ఇప్పుడు ఆమె కు టుంబంలో నలుగురు మిగిలారు. సీఎం రావడానికి ముందు హడావుడిగా అధికారులు వచ్చి గుడారం వేయించారు. ‘‘ఈ గుడారంలో రాత్రి చలిగాలులకు వణికిపోతున్నాం. ఆ దేవుడు మమ్మల్ని కూడా తీసుకుపోయింటే బాగుండు. ఈ కష్టాలు ఇంకెన్నాళ్లో. చాలీచాలని ప్లాస్టిక్‌ గుడారాల్లో అవస్థలు పడుతున్నాం’’ అని నాగమ్మ కన్నీరు పెట్టుకుంది. కళ్లు వత్తుకుంటూ వరద ఊరుని తాకిన రోజును గుర్తుచేసుకుంది. ‘‘అప్పుడు అందరం ఇంట్లోనే ఉన్నాం. ఒక్కసారిగా నీళ్లు మా ఇంటిని ముంచేశాయి. నా భర్త గంగయ్య వరదకు కొట్టుకుపోయాడు. మూడు రోజులకు ఆయన శవం దొరికింది’’ అని భోరుమంది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కొట్టుకుపోయింది. 16 ఆవులు చనిపోయాయి. మా వాళ్లు కువైట్‌కు వెళ్లి కొనుక్కున్న బంగారమంతా పోయింది’’ అని సుబ్బమ్మ వాపోయింది. 


పండుటాకుకు ఎంతకష్టం! 

ఈ వృద్ధురాలి పేరు సుబ్బమ్మ (81). అన్నమయ్య కట్ట తెగినరోజు కొడుకు సుబ్బరాయుడు నడవలేని స్థితిలో ఉన్న తన తల్లిని మోసుకొంటూ భార్యపిల్లలతో సహా క్షేమంగా బయటపడ్డాడు. ఇల్లు కొట్టుకుపోయింది. రెండు కర్రలు పాతి.. దానిపై ప్లాస్టిక్‌ కవరు కప్పి.. అందులో ఓ మంచం వేసి వృద్ధురాలికి నీడ కల్పించారు. ‘‘పగలు ఎండకు ఉక్క... రాత్రైతే చలి... ఇంత చలిలో చన్నీళ్లు పోసుకోలేక పదిరోజులుగా స్నానం లేదు. ఈ వయసులో ఏంది నాయనా మాకీ కష్టాలు’’ అంటూ సుబ్బమ్మ కన్నీరు పెట్టింది. 


రేకులషెడ్డు వేయించాలి

‘‘ఉంటున్న ఇల్లు సహా సామగ్రి సర్వం చెయ్యేరు కలిపేసుకుంది. ఈ గుడారాల్లో పడరాని పాట్లు పడుతున్నాం. ఇళ్లు కూలిపోయిన వారికి రేకులు షెడ్లు వేయించి కరెంట్‌ సౌకర్యం కల్పించాలి. పక్కా ఇళ్లు కట్టించే వరకు ఆ రేకుల షెడ్లలో ఉండేలా ఏర్పాట్లు చేయాలి’’


సంపత్‌ గంగయ్య, పులపత్తూరు

గొప్పగా బతికి.. ఇలా

ప్రభుత్వం వేయించిన గుడారంలో సేదతీరుతున్న ఈ దంపతులు అవసాని వెంకటరమణ, మహాలక్ష్మమ్మ. చెయ్యేరు నది ఒడ్డున 34.5 సెంట్లలో 25 మామిడి చెట్లు, కొబ్బరి, నిమ్మ చెట్లు, పూల మొక్కలూ, వాటి మధ్య కట్టుకున్న అందమైన ఇల్లూ వరదతో నామరూపాలు లేకుండాపోయాయి. 14 ఆవులు, 2 పాడి గేదెలు కొట్టుకుపోయాయి. రూ.20-25లక్షల వరకు నష్టపోయి ఇలా ఇబ్బందులు పడుతున్నారు.


వరద కష్టానికి పరదాలు..

వరద మురుగు కనపడకుండా పరదాలు కట్టేశారు. జనం ఇళ్ల బయటికి రాకుండా గేట్లను మూసేశారు. ఎందుకంటే... ముఖ్యమంత్రి జగన్‌ వరద బాధితుల పర్యటనకు వస్తున్నారు. నెల్లూరు శివార్లలోని ఇరగాళమ్మ ఆలయం వద్ద, బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో సీఎం పర్యటన సందర్భంగా కనిపించిన దృశ్యాలివి.

Advertisement
Advertisement