Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజద్రోహం కేసుల్ని అడ్డుకోవాల్సిందే

దేశంలో మీడియా స్వేచ్ఛ కోసం సుప్రీంకోర్టు జోక్యం ముదావహం

‘ఏబీఎన్‌’పై అభియోగాలు నిలవవు

ఏపీ సర్కారు దుర్మార్గ చర్యలను సమర్థంగా అడ్డుకొన్న కోర్టు ఆదేశాలు

ఆధారాలు లేని ఆరోపణలు చేసే పోలీసులూ, అధికారులపైనా చర్యలు

పలు జాతీయ పత్రికల సంపాదకీయాలు


న్యూఢిల్లీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులో మోపిన రాజద్రోహం అభియోగాలను సమగ్రంగా సమీక్షిస్తామని, సెక్షన్‌ 124(ఏ) పరిధి, పరిమితులను స్పష్టపరుస్తామంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పలు జాతీయ పత్రికలు స్వాగతించాయి. ‘దేశంలో ప్రజాస్వామ్య విలువలను ఈ ఆదేశాలు కాపాడాయి’ అని శ్లాఘిస్తూ సంపాదకీయాలు ప్రచురించాయి. ‘‘సుప్రీంతీర్పు భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ శుభవార్త. దీని వల్ల దేశానికి మేలు జరుగుతుంది. రకరకాల సిద్ధాంతాలు గల పలచటి చర్మం గల రాజకీయనాయకుల ప్రేరణతో పోలీసులు జరిపే దాడులకు గురవుతున్న మీడియాకు ఈ ఆదేశాలు మేలు చేస్తాయి’’ అని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ వ్యాఖ్యానించింది. రాజద్రోహం కేసును తాజాగా పరిశీలించాలన్న సుప్రీం నిర్ణయం.. ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించేందుకు తోడ్పడాలని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఆకాంక్షించింది. ‘‘ఏపీలో జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు దాఖలు చేసిన నేపథ్యంలో...కాలం చెల్లిన సెక్షన్‌ 124(ఏ) కల్పించిన ఒక భయానక ప్రభావంపై సుప్రీంకోర్టు సమీక్షకు పూనుకుంది. కొవిడ్‌ వల్ల మృతి చెందిన ఒక వ్యక్తి మృతదేహాన్ని నదిలో పడవేస్తున్న దృశ్యాన్ని ప్రసారం చేసే చానల్‌పై రాజద్రోహం కేసు మోపే అవకాశాల గురించి కోర్టు వ్యాఖ్యానించడం... సమస్య తీవ్రతను తెలియజేస్తోంది’’ అని ‘ద ట్రిబ్యూన్‌’ వ్యాఖ్యానించింది. 


దుర్మార్గ చర్యలకు అడ్డుకట్ట పడాలి: ద హిందూస్థాన్‌ టైమ్స్‌

‘‘ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత కల్పిస్తున్నాయని ఆరోపిస్తూ రెండు తెలుగు చానళ్లపై సెక్షన్‌ 124 (ఏ) క్రింద దుర్మార్గమైన చర్యలు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ ఉన్నత న్యాయస్థానం కీలక పరిశీలనలు చేసింది. వచ్చే ఏడాదితో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు.  ఇలాంటి సమయంలో నిరసన వ్యక్తం చేసినంత మాత్రానే రాజ్యానికి శత్రువులుగా తీర్మానించకుండా, పౌరుల ప్రజాస్వామిక హక్కులకూ, రాజద్రోహానికీ మధ్య వ్యత్యాసాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు పూనుకోవడం సరైనదే’’


వీటికి కాలం చెల్లేదెన్నడు?: ద ఆసియన్‌ ఏజ్‌

‘‘దేశంలో 1500 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశామని చెప్పుకొంటున్న నరేంద్రమోదీ ప్రభుత్వం వలసవాద పాలనకు చిహ్నంగా ఉన్న సెక్షన్‌ 124(ఏ)ను కొనసాగించడం ఆశ్చర్యకరం. ‘ఏబీఎన్‌ -ఆంధ్రజ్యోతి’పై నిరంకుశ చర్యలు తీసుకోకుండా అడ్డుకున్న ఉన్నత న్యాయస్థానం రాజద్రోహం సెక్షన్‌ ను పత్రికా స్వాతంత్య్రం వెలుగులో సమీక్షించాలని నిర్ణయించడం సరైనదే. ఈ సమీక్ష త్వరగా జరిగితే దేశంలో ప్రతి పౌరుడికీ అంతిమంగా న్యాయం జరుగుతుంది’’ 


నినాదం ఆక్సిజన్‌..నిరసన నెత్తురు: ద పయనీర్‌

‘‘రాజద్రోహం అనేది నిరసన ను తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం వాడే ఆయుధం. ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది విద్వేషం, తిరుగుబాటును రెచ్చగొట్టడం కిందకు రాదు. రాజద్రోహ నేరారోపణలు న్యాయపరీక్షలో నిలువలేవు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తోపాటు మరో చానల్‌పై రాజద్రోహ నేరం మోపినంత మాత్రాన పోలీసులు తమ ఆరోపణలను సమర్థించుకోలేరు. భారత దేశంలో నినాదం అనేది ఆక్సిజన్‌.. నిరసన అనేది నెత్తురు లాంటిది. ఇక్కడ రాజద్రోహానికి తావు లేదు’’


అణచివేత చట్టాలపై నిర్దిష్ట చర్యలు: ద ఎకనమిక్‌ టైమ్స్‌

‘‘పత్రికా స్వాతంత్య్రం వెలుగులో రాజద్రోహం తదితర సెక్షన్లను సమీక్షిస్తామని సుప్రీంకోర్టు చెప్పడం ఆహ్వానించదగ్గ పరిణామం. అదేసమయంలో నిరసనను అణిచివేసేందుకు చట్టాన్ని దుర్వినియోగపరచకుండా ఉన్నత న్యాయస్థానం నిర్దిష్టమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు మౌలికమైన స్వేచ్ఛలను నిరాకరించే విధంగా చట్టాలను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలి. సరైన ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలను మోపే పోలీసులు, దిగువ కోర్టులను కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించాలి’’


మీడియా స్వేచ్ఛకు విఘాతం: ద మిలీనియం పోస్ట్‌

‘‘రెండు టీవీ చానళ్లపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మోపిన రాజద్రోహం నేరం వెలుగులో.. మొత్తం సెక్షన్‌ 124 (ఏ)నే సమీక్షించాలని సుప్రీం నిర్ణయించింది. ఒక జర్నలిస్టు సత్యాల ఆధారంగా వార్త రాసే ముందు తాను అరెస్టవుతానన్న భయం ఏర్పడితే అది మీడియా స్వేచ్ఛకు భంగకరం అవుతుంది. నిరసన తెలిపే వ్యక్తి అరెస్టయినప్పుడు, తర్వాతికాలంలో అతడు విడుదలయ్యే అవకాశాలున్నప్పటికీ... అరెస్టు చేస్తారన్న భయమే నిరసన తెలిపే స్వరాన్ని అణిచివేస్తుంది’’ అని ద మిలీనియం పోస్ట్‌ వ్యాఖ్యానించింది. కాగా హిందూస్థాన్‌, జనసత్తా, ప్రభాత్‌ ఖబర్‌, ది హిందీ మిలా్‌పతో పాటు అనేక హిందీ పత్రికలూ సంపాదక వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించాయి. 


అధికారులు సైతం బాధ్యులే : అవుట్‌లుక్‌..

‘‘ఆంధ్రప్రదేశ్‌ లో రెండు టీవీ చానళ్లపై రాజద్రోహ నేరం మోపినందుకు సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అయితే  కొంతమంది వెన్నుముక లేని అధికారులు కుమ్మక్కు కాకపోతే అక్కడి రాజకీయ నాయకులు విజయవంతం కాలేరు. ప్రభుత్వాన్ని విమర్శించడం రాజద్రోహం కాదని ఆ నాయకులకు తెలిసి ఉండాలి. మణిపూర్‌లో కిషోర్‌ చంద్ర వాంగ్‌ కెమ్‌ అనే వ్యక్తి ఫేస్‌ బుక్‌ లో పోస్టులు పెట్టినందుకు రాజద్రోహ నేరారోపణల క్రింద పలు సార్లు జైలుకు పంపారు. చాలా కాలం తర్వాత అతడిపై ఆరోపణలను హై కోర్టు కొట్టి వేసినప్పటికీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిన ఏ అధికారికీ శిక్షపడలేదు. అలాంటప్పుడు ఏ అధికారి తన పద్ధతిని మార్చుకొంటారు? ప్రతి రాజద్రోహం కేసులో సంతకం చేసే పోలీసు డీఐజీతో సహా ప్రతి అధికారికీ బాధ్యత ఉంటుంది. వారు తమ రాజకీయ యజమానుల అడుగులకు మడుగులొత్తి  ప్రయోజనాలు పొందుతారు. రాజద్రోహం పరిధిని పరిమితం చేయడం ఆహ్వానకర పరిణామమే. కానీ ఈ విషయంలో ఆలస్యం చేయకూడదు. ముందుగా వందిమాగధులైన అధికారుల మనసుల్లో...తాము పర్యవసానాలు ఎదుర్కొంటామన్న భయాన్ని కల్పించాలి. రాజద్రోహం నేరం మోపాలంటే ఐఏఎస్‌ అధికారి సైతం భయపడే పరిస్థితి కల్పించాలి’’


నిష్పాక్షిక విమర్శే ప్రజాస్వామ్యానికి వెన్నుముక..సుప్రీం ఉత్తర్వుల పట్ల ‘ఎన్‌బీఎఫ్‌’ హర్షం

‘‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కేసులో రాజద్రోహం సెక్షన్లను నిర్వచిస్తామని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫెడరేషన్‌ స్వాగతించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ‘ఎన్‌బీఎఫ్‌’ ఓ ప్రకటనలో తెలిపింది. నిష్పక్షపాతమైన, నిజాయతీకలిగిన విమర్శలు ప్రజాస్వామ్యానికి వెన్నుముక అని పేర్కొంది. జర్నలిస్టులను, మీడియా సంస్థల యజమానులను ఎంపిక చేసుకొని ప్రభుత్వాలు వేధించడాన్ని నిరోధించేలా.. ఓ స్వతంత్ర తటస్థ జాతీయ ఏజెన్సీని వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరింది.

Advertisement
Advertisement