‘పెగాసస్‌’పై సుప్రీం విచారణ జరపాలి

ABN , First Publish Date - 2021-07-22T06:50:06+05:30 IST

దేశవ్యాప్తంగా ‘పెగాసస్‌’ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు తమ నిరసన గళాలను వినిపిస్తున్నాయి.

‘పెగాసస్‌’పై సుప్రీం విచారణ జరపాలి

  • కాంగ్రెస్‌, ప్రతిపక్షాలు, ఎడిటర్స్‌ గిల్డ్‌ డిమాండ్‌
  • న్యాయవ్యవస్థే దేశాన్ని కాపాడగలదని వ్యాఖ్య
  • భయంతో ఫోన్‌కు ప్లాస్టర్‌ వేశానన్న మమతా బెనర్జీ


న్యూఢిల్లీ, జూలై 21: దేశవ్యాప్తంగా ‘పెగాసస్‌’ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు తమ నిరసన గళాలను వినిపిస్తున్నాయి. ఇది జాతీయ భద్రత, ప్రజల స్వేచ్ఛకు సంబంధించిన విషయం కాబట్టి పార్లమెంటులో ఈ అంశంపైనే చర్చించాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్‌ చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని, దానికి బీజేపీనే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. మోదీ సర్కారు దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలని చూస్తోందని ఆరోపించారు. రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు చివరికి న్యాయమూర్తుల ఫోన్లనూ హ్యాక్‌ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.


హ్యాకింగ్‌ వ్యవహారంపై సుమోటోగా విచారణ జరిపించాలన్నారు. కేవలం న్యాయవ్యవస్థే దేశాన్ని కాపాడగలదని ఆమె చెప్పారు. పెగాసస్‌ స్పైవేర్‌ భయంతో తన ఫోన్‌ కెమెరాకు ప్లాస్టర్‌ వేసుకున్నానని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా కలిసి ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల సొమ్మును వారి సంక్షేమానికి కాకుండా గుఢచర్యానికి వాడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌.. మూడింటినీ పెగాసస్‌ ద్వారా ప్రభుత్వం స్వాధీనపర్చుకుందని ఆరోపించారు. 


ఏకమైన ప్రతిపక్షాలు

ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా దేశంలో 1000 మందికి పైగా కీలక వ్యక్తుల ఫోన్లను హ్యాకింగ్‌ చేసి సమాచారాన్ని, సంభాషణలను సేకరించారన్న వార్తలు దేశంలో ప్రతిపక్షాలన్నింటినీ ఏకంచేశాయి. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, తృణమూల్‌ నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌తో పాటు పలువురు నేతలు కలిసికట్టుగా కార్యాచరణ రూపొందించి రాజ్యసభ చైర్మన్‌కు వాయిదా తీర్మానాలను సమర్పించాయి. లోక్‌సభలో కూడా కాంగ్రెస్‌, టీఎంసీ, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు సంయుక్త పార్లమెంటరీ కమిటీతో పెగాసస్‌ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశాయి. ఈ అంశంపై కలిసికట్టుగా పోరాడాలని మమత పిలుపునిచ్చారు. ఈనెల 27, 28న ఢిల్లీలో ప్రతిపక్షాలతో భేటీ కానున్నట్లు చెప్పారు. పెగాస్‌సపై సుప్రీంకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. పెగాసస్‌ స్పైవేర్‌ను మోదీ సర్కారు వినియోగించనట్లయితే అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో తెలియజేయాలన్నారు. పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని భారత ఎడిటర్స్‌ గిల్డ్‌ డిమాండ్‌ చేసింది. కాగా, పెగాసస్‌ స్పైవేర్‌పై భారత్‌లో రచ్చ జరుగుతున్న నేపథ్యంలో 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఓ విదేశీ పత్రిక పేర్కొంది. 


28న థరూర్‌ నేతృత్వంలోని కమిటీ విచారణ

పెగాసస్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటు కమిటీ ఈనెల 28న కేంద్ర హోం శాఖ, ఐటీ మంత్రిత్వ శాఖలను ప్రశ్నించనుంది. ఐటీపై ఏర్పాటు చేసిన ఈ స్థాయీ సంఘం పౌరుల సమాచార భద్రత, గోప్యతపై చర్చించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. వాట్సా్‌పలో పెగాసస్‌ స్పైవేర్‌ ముప్పునకు సంబంధించి ఈ కమిటీ 2019లోనూ సంబంధిత శాఖల ప్రతినిధులను ప్రశ్నించింది. పెగాసస్‌ వ్యవహారం జాతీయ భద్రతకు సంబంధించి తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుందని థరూర్‌ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, పెగాసస్‌ స్పైవేర్‌పై వస్తున్న ఆరోపణలను పరిశీలించేందుకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం అంతర్గతంగా సీనియర్‌ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. 


అంతర్జాతీయ విత్తన కంపెనీ మోన్‌శాంటో అధికారులు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న కార్యకర్తల పేర్లు పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా జాబితాలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కన్సార్షియం వెల్లడించింది. 


మీడియా దుష్ట ప్రచారంపై స్పందించం: ఎన్‌ఎస్‌వో

పెగాసస్‌ స్పైవేర్‌ అంశం రచ్చరచ్చగా మారిన తరుణంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎ్‌సవో గ్రూప్‌ టెక్నాలజీస్‌ సంస్థ స్పందించింది. దుష్ట, దూషణలు, అపోహలతో కూడిన ప్రచారంపై తాము స్పందించబోమని బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఫర్‌బిడెన్‌ స్టోరీస్‌, ప్రత్యేక ప్రయోజనాలు ఆశించే గ్రూపుల ఆధ్వర్యంలో ఈ దుష్ట ప్రచారం కొనసాగుతోందని తెలిపింది. మీడియాలో ప్రచారం చేస్తున్న జాబితాకు, తమకు ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించింది. అవన్నీ భ్రమలు, తప్పుడు కథనాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 50 వేల మంది ప్రముఖులు పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా జాబితాలో ఉన్నారంటూ ఆదివారం 17 అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్‌ నుంచి కాంగ్రెస్‌ నేత రాహుల్‌, రాజకీయ వ్యూహకర్త పీకే సహా 300 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. 


ఫోన్లలో ‘పెగాస్‌స’కు రూ.కోట్లలో ఖర్చు

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎ్‌సవో కంపెనీ ప్రధాన ఉత్పత్తుల్లో పెగాసస్‌ టూల్స్‌ ఒకటి. ఫోన్లలో ఈ స్పైవేర్‌ను రన్‌ చేయాలంటే రూ.కోట్లలోనే ఖర్చవుతుంది. 2016లో ఎన్‌ఎ్‌సవో గ్రూప్‌ వాణిజ్య ప్రతిపాదనలను సంపాదించిన ‘ద న్యూయార్క్‌ టైమ్స్‌’ ఆ వివరాలను వెల్లడించింది. 10 ఐఫోన్‌ లేదా ఆండ్రాయిడ్‌ ఫోన్లపై నిఘా ఉంచేందుకు 6.50 లక్షల డాలర్లు, ఐదు బ్లాక్‌బెర్రీ ఫోన్లపై నిఘాకు 5 లక్షల డాలర్లు, 5 సింబియన్‌ వినియోగదారులపై నిఘాకు 3 లక్షల డాలర్లు వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇన్‌స్టాలేషన్‌ ఫీజు 5 లక్షల డాలర్లుగా పేర్కొన్నట్లు వివరించింది. అలాగే వార్షిక సిస్టమ్‌ నిర్వహణ ఫీజు కింద  ఏటా అయ్యే మొత్తం ఖర్చులో 17 శాతం వసూలు చేస్తుందని తెలిపింది. ఈ ఫీజులు ప్రాథమికంగా నిర్దేశిత కాలానికి మాత్రమేనని, పునరుద్ధరించుకుంటే ఎక్కువగా ఉంటాయని వివరించింది. 


ఈ లెక్కన భారత్‌లో 300 ఫోన్లపై నిఘా పెట్టడానికి నాటి లెక్కల ప్రకారం రూ.56 కోట్లు అవుతుంది. అదీ ప్రాథమికంగా కొన్ని నెలలకు మాత్రమే. అయితే తాము ప్రభుత్వాలకు చెందిన భద్రత, నిఘా సంస్థలకు (నేర, ఉగ్రవాద చర్యలను అడ్డుకునేందుకు) మాత్రమే స్పైవేర్‌ను విక్రయిస్తామని ఎన్‌ఎ్‌సవో చెబుతోంది. మరోవైపు ఇజ్రాయెల్‌కే చెందిన మరో స్పైవేర్‌ తయారీ సంస్థ క్యాండిరు ఇన్‌స్టాలేషన్‌ ఫీజు మాత్రం భారీగా ఉంది. 2016లోనే అది 28 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ఎన్‌ఎ్‌సవోతో పోలిస్తే ఇది దాదాపు 60 రెట్లు ఎక్కువ. ఇటీవలి ధరలు చూసుకున్నా ఎన్‌ఎ్‌సవో కంటే క్యాండిరు రేట్లు 25 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో 7.5 మిలియన్‌ డాలర్లు కాస్తా ప్రస్తుతం దాదాపు 187.5 మిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు అంచనా. అంటే తాజా మారక విలువల ప్రకారం ఇది రూ.1401 కోట్లు. 

Updated Date - 2021-07-22T06:50:06+05:30 IST