విజయానికి ప్రతీక విజయదశమి

ABN , First Publish Date - 2021-10-15T06:54:56+05:30 IST

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే వేడుక విజయ దశమి(దసరా). ఆశ్వయుజ పాడ్యమి రోజున ప్రారంభమయ్యే శరన్నవరాత్రులు దశమితో ముగుస్తాయి. దసరా అనేది దశహరా అనే పదం నుంచి వచ్చింది.

విజయానికి ప్రతీక విజయదశమి

నేడే దసరా పర్వదినం 

పలు చోట్ల శమీ పూజలు

తాండూర్‌, అక్టోబరు 14: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే వేడుక విజయ దశమి(దసరా). ఆశ్వయుజ పాడ్యమి రోజున ప్రారంభమయ్యే శరన్నవరాత్రులు దశమితో ముగుస్తాయి. దసరా అనేది దశహరా అనే పదం నుంచి వచ్చింది. దశహరా అంటే దశ విధ పాపహరం అని అర్థం. దసరా పండుగ రోజజు  ఎక్కడేక్కడే ఉన్న వారందరూ సొంతింటికి వచ్చి బంధుమిత్రులతో కలిసి వేడుక జరుపుకుంటారు.  

ఫ దసరా అంటే..

మహిషాసురుడు అనే రాక్షసుడు లోకకంఠకుడుగా మారి ముల్లోకాలలో స్వైర విహారం చేశాడు. తట్టుకోలేని దేవతలు మహిషాసురుడిని సంహరించాలని జగన్మాతను కోరారు. దేవతల కోరిక మేరకు జగన్మాత తొమ్మిది రోజులపాటు మహిషాసురునితో యుద్ధం చేసి పదవ రోజున రాక్షసున్ని సంహరించగా రాక్షసపీడ విరగడైనందుకు గుర్తుగా దసరాగా జరుపుకుంటారు.

శమీ పూజ..

విజయదశమి నాడు పూజలందుకునే శమీ (జమ్మి) వృక్షానికి సంబంధించిన పురాణ గాధ ఒకటి ఉంది. పూర్వం ప్రజాపతి అగ్నిని సృష్టించాడు. అది తన ప్రభావాన్ని చూపించి ప్రజాపతినే కాల్చివేయసాగింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజాపతి అగ్నిని శమింపచేసేందుకు పచ్చని చెట్టును సృష్టించి దాని కొమ్మలతో కొట్టి అగ్నిని ఆర్పివేశాడు.  అగ్నిని శమింప చేసేందుకు ఉపయోగించిన వృక్షమే శమీ వృక్షం. శమీ వృక్షం వద్దకు విజయదశమి నాటి సాయంత్రం చేరుకుని ప్రదక్షిణలు చేసి ఆకు తీసుకు వచ్చి పెద్దలకు పాదాభినందనం చే సి ఆశ్వీరాదం పొందడం ఆచారం. మిత్రుల ఆలింగనాలు, పరస్పర శుభాకాంక్షల మధ్య దసరా సాయంత్రం వేళ అనుబంఽధాలు, ఆప్యాయతల్లో మునిగితేలుతాం. శమీ వృక్షాన్ని దర్శించి పూజించడంతో విజయాలు లభిస్తాయని నమ్మకం. ప్రస్తుతం ఆయుధాలకు బదులు వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన వస్తువుల్ని, యంత్రాల్ని పూజిస్తున్నారు. వాహన పూజలు జరుపుతుంటారు. కొత్త వ్యాపారాలు, పనులు, దుకాణాలు విజయదశమి నాడు ప్రారంభిస్తే మంచిదని భావిస్తారు.  

  పాలపిట్ట దర్శనం

దసరా రోజున పాలపిట్టను చూడడం మన ప్రాంతంలో ఆచారంగా వస్తుంది. పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందన్న నమ్మకంతో పాలపిట్టను వెతుక్కుంటూ మరీ వెళ్లి చూసేందుకు ఆతృత పడుతుంటారు.  

రావణ దహనం.. ఒక వేడుక

రాముడు రావణున్ని వధించిన రోజు కూడా ఆశ్వయుజ దశమేనని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు దేవికి పూజ చేసి ఆశీర్వాదం పొంది రాముడు యుద్ధంలో రావణున్ని వధించి విజయం సాధిస్తాడు. దీనికి గుర్తుగా మన దగ్గర కూడా రావణదహనం కార్యక్రమాలను నిర్వహిస్తుం టారు. ఎప్పటికైనా చెడుపై మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో దసరా రోజున రావణ దహనం చేస్తారు. 

Updated Date - 2021-10-15T06:54:56+05:30 IST