Abn logo
Sep 27 2021 @ 00:11AM

ఇంకా లక్ష్యం చేరలేదు

  1. ప్రయత్నం కొనసాగిస్తాను
  2. సివిల్స్‌ ర్యాంకర్‌ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి 
  3. శిక్షణ లేకుండా చదివి.. 93వ ర్యాంకు
  4. ఉద్యోగం చేస్తూనే.. లక్ష్యం దిశగా పయనం


ఉదయం ఉద్యోగం.. రాత్రికి చదువు. ఇల్లే  పాఠశాల. పుస్తకాలే గురువులు. శిక్షణ లేకుండా సివిల్స్‌ సాధించాడు ఓ యువకుడు. సివిల్స్‌ అంటే లక్షల్లో ఖర్చు, హైదరాబాద్‌, ఢిల్లీలలో కోచింగ్‌ తీసుకోవాల్సిందే అనుకునే వారికి మరో మార్గం  చూపించాడు. 93వ ర్యాంకర్‌గా నిలిచి స్ఫూర్తి నింపాడు. ‘రోజుకు 12 గంటలు చదువు.. ఇక వేరే ఆలోచనే ఉండొద్దు. లేకుంటే సివిల్స్‌ అసాధ్యం’ అని ఇన్నాళ్లూ అనుకునేవారు. అంత అవసరం లేదు, సరైన ప్రణాళిక, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే కల సాకారం అవుతుందని నిరూపించాడు. తన పేరు చల్లపల్లి యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి. చాగలమర్రి మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన ఈ యువకుడు సివిల్స్‌ కంటే ముందు చాలానే సాధించాడు. 


కర్నూలు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): బీటెక్‌ తర్వాత గేట్‌ పరీక్ష మొదలుకుని, గ్రూప్స్‌, సివిల్స్‌ వరకు స్వయంగా ప్రిపేర్‌ అయ్యాడు. పోటీ పరీక్షల్లో విజేతగా నిలిచాడు. తొలి ప్రయత్నంలోనే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, మలి ప్రయత్నంలో కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉద్యోగాలు సాధించాడు. కర్నూలులో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. ఇప్పుడు సివిల్స్‌లో ర్యాంకు సాధించినా, తన లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదని అంటున్నాడు. ఇంకా ఏదో సాధించాలని అనుకుంటున్న యశ్వంత్‌ కుమార్‌రెడ్డిని ఆంధ్రజ్యోతి కలిసింది. ఆ విశేషాలు ఇవి.


ప్రశ్న: సివిల్స్‌లో ర్యాంకు సాధించారు. మీరు లక్ష్యం చేరుకున్నానని భావిస్తున్నారా?

సమాధానం: నేనింకా లక్ష్యాన్ని చేరుకోలేదు. ప్రస్తుతం నేను ఐపీఎస్‌కు సెలక్ట్‌ కావచ్చు. కానీ, నా లక్ష్యం ఐఏఎస్‌. ఆ లక్ష్యం చేరుకోవడానికి మళ్లీ ప్రయత్నిస్తాను. 

ప్రశ్న: అంటే ఐపీఎస్‌పై ఆసక్తి లేదా? 

సమాధానం: అది మాత్రమే నా లక్ష్యం కాదంటున్నాను. ఆ ప్రయత్నంలో ఐపీఎస్‌ కేడర్‌కు సెలక్ట్‌ అయితే కచ్చితంగా వెళ్తాను. అలాగే ఐఏఎస్‌ అయ్యే వరకు విశ్రమించను. 

ప్రశ్న: లక్ష్యంపై ఇంతటి కచ్చితత్వంతో మాట్లాడుతున్న మీకు స్ఫూర్తి ఎవరు?

సమాధానం: ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు నాకు స్ఫూర్తి. కర్ణాటక ఐఏఎస్‌లు అయిన డీకే రవి, రోహిణి సింధూరి గురించి చూశాను. అలాగే శంకరన్‌ గారి గురించి కూడా చాలా విన్నాను. అందరి కంటే ముందుగా మా నాన్న నాకు స్ఫూర్తి. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసినపుడే నేనొక విద్యార్థిగా క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసుకున్నాను. అదే నా లక్ష్య సాధన దిశగా తోడ్పడుతున్న తొలి అంశం. 

ప్రశ్న: మీ విద్యాభ్యాసం గురించి చెప్తారా? 

సమాధానం: కడప జిల్లా కొట్టాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివాను. రాజంపేట నవోదయలో 6-10 వరకు చదువుకున్నాను. తర్వాత విజయవాడలో ఇంటర్‌ పూర్తి చేశాను. కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్‌ చేశాను. అప్పుడే గేట్‌ ద్వారా ఐఓసీఎల్‌లో, ఆ తర్వాత గ్రూప్‌-1లో మూడో ర్యాంకు ద్వారా కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉద్యోగం సాధించాను. 

ప్రశ్న: ఉద్యోగాలు వచ్చాక కూడా సివిల్స్‌పై ఎలా దృష్టి మళ్లింది?

సమాధానం: చిన్నప్పట్నుంచి పబ్లిక్‌ సర్వీస్‌ చేసే అధికారులంటే మక్కువ. తహసీల్దారు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో కూడా చాలా మంది ప్రజలకు నేటికీ తెలీదు. ఈ అంశాలూ నన్ను పబ్లిక్‌ సర్వీస్‌ వైపు నడిపించాయి. 

ప్రశ్న: ఎక్కడ కోచింగ్‌ తీసుకున్నారు?

సమాధానం: ఎక్కడా తీసుకోలేదు. అదే నా విజయానికి తొలి కారణమనుకుంటాను. ఇంటర్‌ తర్వాత జేఈఈ కోసం కోచింగ్‌ తీసుకున్నాను. 7,656వ ర్యాంకు రావడంతో బాధపడ్డాను. ఇక నుంచి కోచింగ్‌ జోలికి వెళ్లకూడదని అప్పుడే అనుకున్నాను. ఆ ఆలోచనను తొలిసారి గేట్‌లో అమలుచేసి సక్సెస్‌ అయ్యాను. సివిల్స్‌కు కూడా నా ఫ్రెండ్స్‌, మా సోదరుడి ఫ్రెండ్స్‌ సాయంతో మెటీరియల్‌ సేకరించాను. తగిన జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికపుడు ప్రిపేర్‌ అవుతూ నన్ను నేను షైన్‌ చేసుకున్నాను. 

ప్రశ్న: సివిల్స్‌ సాధించడం చాలా టఫ్‌. పైగా ఖర్చుతో కూడుకున్నది కదా.. ఇంట్లోనే కూర్చుని ప్రిపేర్‌ అవ్వచ్చు అనుకునే వాళ్లకి ఏమైనా చెప్తారా?

సమాధానం: కేవలం ఇంట్లో కూర్చుని చదివితే సివిల్స్‌లో ర్యాంకు వచ్చేస్తుందనుకోకూడదు. ఇది మన జర్నీ. ప్రయాణంలో గమ్యం చేరడమే కాదు.. వెళ్లే దారి కూడా ముఖ్యమే. ఎందుకో నాకు కోచింగ్‌ సరిపడలేదు. అంతేగానీ, అందర్నీ నాలాగే చేయమని చెప్పను.

 ప్రశ్న: ఇంట్లో ప్రిపేర్‌ అవ్వడం ద్వారా ఈ ర్యాంకు సాధిస్తానని ఊహించారా? 

సమాధానం: రెండు మూడేళ్ల క్రితం దాకా నేను కూడా ఇలాంటి ఆలోచనలు ఎదుర్కున్న వాడినే. నేనెప్పుడూ ఊహించలేదు. ప్రయత్నించాను అంతే అక్కడకు ఇక్కడకు వెళ్లి చదవాలి. బాగా కష్టపడాలి అని నేనూ విన్నాను. కానీ, ఎందుకో అవి నాకు సెట్‌ అవుతాయని అనిపించలేదు. అందుకే నా దారి నేను ఎంచుకున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా నాకు తోడై ఈరోజు ఈ ర్యాంకు సాధించగలిగాను.

ప్రశ్న:  ఒకవైపు ఉద్యోగం, మరోవైపు ప్రిపరేషన్‌ ఎలా సాధ్యమైంది? 

సమాధానం: ‘రోజుకు 12 గంటల పాటు చదవాలి.. అదే పనిగా రుద్దితే చదువుతారు’ అనేది కరెక్ట్‌ కాదని నా ఉద్దేశం. ముందు విద్యార్థికి ఎటువైపు ఆసక్తి ఉందనేది ప్రధానం. ఆ ఆసక్తి లేకుండా రోజులో 24 గంటలు చదివినా ఉపయోగం లేదు కదా! నా వరకు ఉద్యోగం అయ్యాక చాప్టర్ల వారీగా ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలనే నిబంధన పెట్టుకుని చదివాను. అంతే తప్ప టైం లక్ష్యంగా పెట్టుకుని చదవలేదు.

ప్రశ్న:  నేటి యువతకు ఏదైనా చెప్తారా? 

సమాధానం: సివిల్స్‌ ఒక్కటే జీవితం కాదు. ప్రతివారికీ ప్రపంచంలో విస్తృతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఏదేని రంగంలో సాధించాలని నిర్ణయించుకున్నాక దృష్టి మరల్చకుండా ముందుకెళ్తే కచ్చితంగా ఒకరోజు విజయం చేతికందుతుందని నమ్ముతాను.