లక్ష్యం..రూ.300 కోట్లు

ABN , First Publish Date - 2020-08-13T09:26:21+05:30 IST

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షి్‌పనుంచి వివో వైదొలగడంతో..ఈ సీజన్‌కు మరో టైటిల్‌ స్పాన్సర్‌ను వెతికి పట్టుకోవడం బీసీసీఐకి

లక్ష్యం..రూ.300 కోట్లు

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షి్‌పపై బీసీసీఐ

ముంబై: ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షి్‌పనుంచి వివో వైదొలగడంతో..ఈ సీజన్‌కు మరో టైటిల్‌ స్పాన్సర్‌ను వెతికి పట్టుకోవడం బీసీసీఐకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. వివో ప్రతి ఏడాదీ రూ.440 కోట్లు చెల్లిస్తుండగా కరోనా నేపథ్యంలో కొత్త స్పాన్సర్‌ అంత మొత్తానికి టైటిల్‌ హక్కులు సొంతం చేసుకొనేందుకు ముందుకు రావడం కష్టమేనని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అధికారిక స్పాన్సర్లను మూడు నుంచి ఐదుకి పెంచడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మొత్తం రాబట్టాలని బోర్డు భావిస్తోంది. కొత్తగా వచ్చే ఒక్కో స్పాన్సర్‌ నుంచి కనీసం రూ. 40 కోట్ల చొప్పున రాబట్టాలని బీసీసీఐ ఎత్తుగడ వేస్తోంది. ఈ-లెర్నింగ్‌ యాప్‌ ‘అన్‌ అకాడమీ’, క్రెడిట్‌ కార్డుల చెల్లింపుల సంస్థ ‘క్రెడ్‌’ కొత్తగా రానున్న రెండు సంస్థలుగా తెలుస్తోంది. ‘అన్‌ అకాడమీ’ ఇప్పటికే టైటిల్‌ బిడ్‌ డాక్యుమెంట్లు సేకరించిందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా..రూ 300 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలన్నది బోర్డు ఆలోచన. తద్వారా దేశంలో క్రికెట్‌ క్రేజ్‌ ఏపాటిదో నిరూపించాలని బీసీసీఐ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. ఇక..అమెజాన్‌, బైజూస్‌, డ్రీమ్‌ లెవెన్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ రేసులో ఉండగా.. అనూహ్యంగా కొత్త సంస్థ తెరపైకి వచ్చే అవకాశాలున్నట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు..ఈ వారం చివరికల్లా టైటిల్‌ స్పాన్సర్‌ విషయాన్ని తేల్చేయనుందని పేర్కొన్నాయి. 


Updated Date - 2020-08-13T09:26:21+05:30 IST