ఆర్టికల్‌ 356 విధించండి

ABN , First Publish Date - 2021-10-22T08:13:40+05:30 IST

వైసీపీ దాడులతో శాంతిభద్రతలు క్షీణించిన రాష్ట్రంలో ఆర్టికల్‌ 356ను తక్షణం అమలుచేయాలని టీడీపీ నేతలు కోరారు. టీడీపీ కార్యాలయం, పలు జిల్లాల కార్యాలయాలపై, విజయవాడలో ఆ పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడుల ..

ఆర్టికల్‌ 356 విధించండి

  • దాడులపై సీబీఐ దర్యాప్తు జరిపించండి
  • గవర్నర్‌ను కలిసి కోరిన టీడీపీ బృందం


విజయవాడ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):  వైసీపీ దాడులతో శాంతిభద్రతలు క్షీణించిన రాష్ట్రంలో ఆర్టికల్‌ 356ను తక్షణం అమలుచేయాలని టీడీపీ నేతలు కోరారు. టీడీపీ కార్యాలయం, పలు జిల్లాల కార్యాలయాలపై, విజయవాడలో ఆ పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడుల నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతల బృందం గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. ‘‘రెండు డిమాండ్లను గవర్నర్‌ ముందుంచాం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నివేదికను తెప్పించుకుని వెంటనే ఆర్టికల్‌ 356ను అమలు చేసేలా రాష్ట్రపతికి, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాయాలని కోరాం. విపక్షమైన టీడీపీని అణచివేసేందుకు దాడులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశాం’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆ తర్వాత మీడి యాకు తెలిపారు. దాడుల వీడియో ఫుటేజీలను గవర్నర్‌కు అందజేశామన్నారు.


‘‘తెలంగాణ ఉద్యమంలోనూ పార్టీల ఆఫీసులపై దాడులు జరగలేదు. దీనికి భిన్నంగా రాష్ట్రంలో మా నేతలు, కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించారు. రిపోర్టులు తెప్పించుకుని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి నివేదిస్తానని హామీ ఇచ్చారు’’ అని ఆయన వివరించారు. చంద్రబాబు నాయకత్వంలో ఓ ప్రతినిధి బృందం త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి తదితరులను కలిసి వైసీపీ అరాచకాలపై ఫిర్యాదు చేస్తుందని తెలిపారు. ‘‘డీజీపీ ఓ దద్దమ్మ. డీజీపీ ఆఫీసుకు 100 మీటర్ల దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడినవారిని ఇంతవరకు అరెస్టు చేయలేకపోయారు. పైగా దాడి చేసిన వైసీపీ రౌడీలకు ఎస్కార్ట్‌ ఇచ్చారు. ధ్వంస రచన పూర్తయ్యాక చుట్టాలను సాగనంపినట్టుగా పోలీసులు దగ్గరుండి వైసీపీ రౌడీలను సాగనంపారు. దీనిపై మా పార్టీ బంద్‌కు పిలుపునిస్తే.. మొగుడ్ని కొట్టి మోగసాలకు ఎక్కినట్లుగా వైసీపీ నాయకులు పోటీగా బంద్‌ చేయడం, దీక్షలు చేపట్టడం సిగ్గుచేటు’’ అని మండిపడ్డారు. వైసీపీ పెద్దలకు పిచ్చి ముదిరి పాకాన పడిందని, ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదంటూ ధ్వజమెత్తారు. హెరాయిన్‌, గంజాయి తదితర మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ను హబ్‌గా మార్చారని ఆరోపించారు. గవర్నర్‌ను కలిసిన టీడీపీ బృందంలో యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-10-22T08:13:40+05:30 IST